మన శరీరాన్ని బాధపెట్టే రోగాలకు కారణాలు ఎన్నో ఉంటాయి.. కానీ శుభ్రంగా ఉంటే ఎటువంటి రోగాలు దరిచేరవని పెద్దలు చెబుతుంటారు.. అది ఇంటి శుభ్రమైనా..వంటి శుభ్రమైనా.. పరి శుభ్రత విషయంలో చాలామంది తేలిక భావనతో ఉంటారు.. ముఖ్యంగా తినేముందు చేతులు శుభ్రం చేసుకునే విషయమై బద్దకిస్తుంటారు.. కానీ మన శరీరాన్ని ఆవహించే అంటురోగాలకు మన చేతులు శుభ్రంగా లేకపోవడమే కారణమని తెసుకోలేకపోతున్నాం.
మనం కేవలం తినేందుకు మాత్రమే చేతులు ఉపయోగిస్తామనుకుంటే పొరబడ్డట్లే. ఈ చేతుల్లోనే ఎన్నో మిలియన్ల బాక్టీరియాలు స్టోరైపోతూ ఉంటాయి. చేతుల ద్వారానే అనేక రకాల వ్యాధి కారక సూక్ష్మక్రిములు మన శరీరంలోనికి ప్రవేశిస్తాయి. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ద్వారా వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. ఉదయం నుంచి మన అన్ని రకాల దినచర్యలను చేతుల ద్వారానే చేస్తుంటాము. రకరకాల పనులు చేసేప్పుడు ఆ పనికి సంబంధించిన కొన్ని మలినాలు చేతికి అంటుకుంటాయి.
చేతులను శుభ్రం చేసుకొనకపోవడం వల్ల చేతికి అంటిన క్రిములన్నీ మన శరీరంలోనికి ప్రవేశిస్తాయి. అందుకే భోజనం తినే ముందు.. చేతులను శుభ్రం చేసుకోవడం వలన క్రిములు శరీరం లోనికి ప్రవేశించకుండా ఉంటాయి. చేతులను శుభ్రం చేసుకోకపోవడం వలన జీర్ణవ్యవస్థ సమస్యలు, జ్వరం, జలుబు, శ్వాసకోశ సమస్యలు వంటివి మనల్ని చుట్టుముడతాయి. కాబట్టి ఏపనీ చేయకుండా ఖాళీగాఉన్నా, తరచు చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలా చేయడంవల్ల దాదాపు 80 శాతం రోగాలు మన శరీరానికి దూరంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది.
ఒక రకంగా చేతులు కడుక్కోవటమూ టీకానే. టీకాలాగే ఇది కూడా జబ్బులు రాకుండా చూస్తుంది. ఎవరైనా తుమ్మినపుడు, దగ్గినపుడు వెలువడే తుంపర్లు చుట్టుపక్కల వస్తువులపై పడటం సహజం. దానిలోని తేమ కొద్దిసేపట్లో ఆరిపోవచ్చుగానీ వాటిలోని సూక్ష్మక్రిములు మాత్రం చాలాసేపు అక్కడే ఉండిపోతాయి. మనం తెలియక.. అక్కడ ముట్టుకుని.. వెంటనే కళ్లు, ముక్కు వంటివి రుద్దుకున్నామనుకోండి.. అవి మన శరీరంలోకీ ప్రవేశించి.. మనకూ జబ్బులు తెచ్చిపెడతాయి. కాబట్టి మనం తరచూ చేతులను శుభ్రం చేసుకుంటే ఇలాంటి సూక్ష్మక్రిముల బారి నుంచి కాపాడుకోవచ్చు.
క్రిములు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండానూ చూసుకోవచ్చు.
మల విసర్జనకు వెళ్లొచ్చిన తర్వాత కూడా శుభ్రంగా సబ్బుతో చేతులు కడుక్కోవటం అవసరం. పద్ధతి ప్రకారం చేతులను శుభ్రం చేసుకోవటం ద్వారానే ఎన్నో రకాలు వ్యాధుల భారి పడకుండా ఉండవచ్చు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోందంటే దీని ప్రాధాన్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. గోళ్లు పెద్దవిగా ఉంటే గోటి కింద మట్టిరూపంలో నిల్వ ఉంటాయి. గోళ్లను పొట్టిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లలు మట్టిలో ఆడుతుంటారు. కనుక తరచుగా చేతులు కడుక్కోవటం అలవాటు చేయాలి .తినడానికి ఏదైనా, ఇచ్చేముందు సబ్బుతో చేతులు శుభ్రంగా ఉన్నాయో లేదో చూడాలి.
చేతులు అపరిశుభ్రత కారణంగా అతిసారం, శ్వాసకోశ సంబంధ వ్యాధులు సంభవిస్తున్నాయి. అలాగే స్వైన్ ఫ్లూ మహమ్మారికి వ్యాప్తికి కూడా చేతుల అపరిశుభ్రతే కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరు ఆకలివేస్తోందనే ఆత్రుతలో చేతులు కడుక్కోకుండా హడావిడిగానే ఆహారం తినేస్తారు. ఇలా చేస్తే ఆరోగ్యానికి చేజేతులా ముప్పు తెచ్చుకున్నట్లే అంటున్నారు పరిశోధకులు. అసలు చేతులు శుభ్రం చేసుకోకుండా తినడంవల్లే జలుబుతో సహా పలు ప్రమాదకర వ్యాధులు వస్తాయట. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం అరచేతుల్లో ఎక్కువ తేమ ఉండడంతోపాటు కొన్ని లక్షల సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ చేతులతోనే తినేయడంవల్ల అనేకరకాల రోగాల్ని చేతులారా ఆహ్వానించినట్టే.
చేతుల శుభ్రత ప్రాధాన్యం అందరికీ తెలియకపోవచ్చు. కానీ తెలిసినవారిలోనూ చాలామంది పాటించటం లేదు. కేవలం ముగ్గురిలో ఒకరు మాత్రమే తుమ్మిన, దగ్గిన ప్రతిసారీ చేతులను కడుక్కుంటున్నారు. ప్రతి ఐదుగురిలో ముగ్గురు అసలు సబ్బును వాడటం లేదు కూడా. కేవలం నీటితోనే కడుక్కుంటే చాలని భావిస్తున్నారు. సబ్బుతో కడుక్కుంటే సూక్ష్మక్రిములను సమర్థంగా తొలగించుకోవచ్చని గుర్తుంచుకోవాలి. చేతుల శుభ్రతతో విరేచనాల ముప్పు తగ్గుతుంది. న్యుమోనియా, జలుబు వంటి శ్వాసకోశ జబ్బులను తగ్గించుకోవచ్చు. కొన్ని పనులకు ముందూ, ఆ తర్వాతా చేతులు కడుక్కోవటం చాలా అవసరం. దీంతో సూక్ష్మక్రిముల బెడదను వదిలించుకోవచ్చు. ఫలితంగా జబ్బుల ముప్పును నివారించుకోవచ్చు.
చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా సుమారు 50 పైగా అతిసార సంబంధ వ్యాధులు, 20 నుంచి 30 శ్వాస సంబంధిత వ్యాధులు నివారించవచ్చు.కేవలం 15 నుంచి 20 సెకన్లపాటు సబ్బు చేతిలో ఉండేవిధంగా చేతిలోని అన్ని భాగాలను శుభ్రపరిచేవిధంగా చేయడం ద్వారా వ్యాధులు నివారించవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వ్యాధులపై పరిశోధన చేసిన సంస్థలు తెలియజేస్తున్నాయి.చేతులు శుభ్రపరుచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.