AP Fire Driver Operator Notification: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (AP SLPRB) నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ తేదీలు, ప్రాథమిక రాత పరీక్ష తేదీతో పాటు ఇతర వివరాలతో కూడిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నారు.
ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ నోటిఫికేషన్
పోలీసు నియామక మండలి ఛైర్మన్ రాజీవ్‌కుమార్ మీనా గురువారం ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. గతంలో 2018 నవంబర్‌లో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పుడు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం హయాంలో ఈ పోస్టులకు తాజా నోటిఫికేషన్ వెలువడింది.
మారిన ఎంపిక విధానం
ఈసారి డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల నియామక ప్రక్రియలో కీలక మార్పులు చేశారు. గతంలో ఈ పోస్టులకు ప్రధానంగా శారీరక కొలతల పరీక్ష (PMT), డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసేవారు.
అయితే తాజా నిబంధనల ప్రకారం శారీరక కొలతల పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్, రాత పరీక్ష నిర్వహించనున్నారు.
ముందుగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శారీరక కొలతల పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు.
1600 మీటర్ల పరుగు.. ఆ తర్వాత డ్రైవింగ్ టెస్ట్
దేహదారుఢ్య పరీక్షలో భాగంగా అభ్యర్థులు 1600 మీటర్ల పరుగును 10 నిమిషాల్లోపు పూర్తి చేయాలి. ఈ పరుగు కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
పరుగులో అర్హత సాధించిన అభ్యర్థులకు 100 మార్కులకు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. పోలీసు నియామక మండలి ఛైర్మన్ నియమించిన ఉన్నతాధికారుల కమిటీ ఈ డ్రైవింగ్ పరీక్షను నిర్వహిస్తుంది.
డ్రైవింగ్ టెస్ట్‌లోనూ అర్హత సాధించిన అభ్యర్థులకు చివరగా 3 గంటల వ్యవధిలో రాత పరీక్ష నిర్వహించనున్నారు.
అర్హతలు, వయోపరిమితి
వయసు: అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1996 జూలై తర్వాత, 2008 జూలై కంటే ముందు జన్మించిన వారు అర్హులు.
వయో సడలింపు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
విద్యార్హత: అభ్యర్థులు 10వ తరగతి (SSC) లేదా తత్సమాన విద్యార్హత ఉత్తీర్ణులై ఉండాలి.
డ్రైవింగ్ లైసెన్స్: నోటిఫికేషన్ వెలువడిన తేదీ నాటికి కనీసం రెండేళ్లపాటు చెల్లుబాటులో ఉన్న హెవీ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ (HMV) తప్పనిసరిగా ఉండాలి.
దరఖాస్తులు ఎక్కడ చేయాలి?
ఈ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు తేదీలు, పరీక్షల షెడ్యూల్, ఫీజు, ఎంపిక విధానం, సిలబస్ తదితర పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి.
అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి:
AP SLPRB అధికారిక వెబ్సైట్: https://slprb.ap.gov.in
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న అన్ని నిబంధనలు, అర్హతలు, తేదీలను పూర్తిగా పరిశీలించాలి.








