త్రేనుపు అనేది ఒక రకమైన వింత శబ్ధం. ఇది నోటి నుండి వాయు విడుదల అవటం వలన ఇవి వస్తాయి. గాలిని మింగడం ద్వారా వచ్చే ఈ త్రేనుపులు కడుపు, అన్న వాహిక మరియు నోటి ద్వారా పైకి వెళ్ళడం ద్వారా గ్యాస్ ను ఉత్పత్తి చేస్తాయి.
త్రేన్పు అంటే కడుపునిండా తిన్న తర్వాత వచ్చే ఒక రకమైన శబ్ధం. ఇది ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. సఃదరణంగా భోజనం చేసిన తర్వాత 3 నుంచి 4 సార్లు త్రేన్పులు వస్తే దాన్ని సాధారణంగానే భావించాలి. కానీ ఎక్కువసార్లు వస్తే మాత్రం ఏమాత్రం అశ్రద్ద చేయవద్దు. సాధారణంగా మనం ఆహారం తీసుకునేటప్పుడు నోరు తెరుస్తాం. అలా తెరిచినప్పుడు బయటి గాలి, నోటి ద్వారా కడుపులోకి చేరుకుంటుంది. శరీరం లోపల ఛాతీకి, ఉదరానికి మధ్య తలుపు లాంటి ప్రదేశం ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం లోపలకు వచ్చిన వెంటనే ఆ తలుపు మూసుకుంటుంది. ఇలా మూసుకోవడం వల్ల కడుపులోని జీర్ణరసాలు పైకి రావు. ఈ సమయంలో ఉదరంలో కొంత గాలి చేరుకుంటుంది. అంతే గాక, మనం తిన్న ఆహారం జీర్ణమవుతున్నప్పుడు మరి కొంత వాయువు ఉత్పత్తి అవుతుంది. వెంటనే మెదడుకు సంకేతాలు అందుతాయి. వెంటనే కడుపులో ఉన్న కండరాలు బిగుస్తాయి. దాంతో తలుపు తెరుచుకుని, కడుపులో వెలువడి వాయువు బయకు వస్తుంది. ఇది బయటకు వస్తూ చేసే ప్రకంపనలనే త్రేన్పుగా చెబుతారు.
నిజానికి కడుపులో పేరుకునే గ్యాస్ వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా నోటితో గాలి పీల్చుకోవడం, ఆహారం జీర్ణమయ్యే సందర్భాల్లో గ్యాస్ పేరుకు పోతుంటుంది. ఇది బయటకు రావడానికి ప్రయత్నించడం వల్లే త్రేన్పులు వస్తాయి. కానీ కొన్ని మార్లు ఈ గ్యాస్… జీర్ణాశయం, పేగుల్లోనే ఉండిపోయి, కడుపు ఉబ్బరం, నొప్పికి దారి తీస్తాయి. తరచుగా త్రేన్పులు, ఆవలింతలతో చికాకు కలిగిస్తుంది.
త్రేన్పులు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. తీసుకునే ఆహారం దగ్గర్నుంచి ఒత్తిడి వరకూ… ఎన్నో కారణాలు త్రేన్పులు ప్రభావితం చేస్తాయి. కొవ్వు పదార్థాలు తినడం కడుపు ఉబ్బరానికి దోహదం చేస్తుంది. జీర్ణాశయం నుంచి ఆహారం త్వరగా పేగుల్లోకి వెళ్ళకుండా, కొవ్వు అడ్డుకుంటుంది. దీని వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, ధూమపానం, మద్యపానం, జీర్ణకోశంలో ఇన్ఫెక్షన్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కూడా కడుపుబ్బరానికి కారణమవుతాయి. ఎక్కువగా పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా కడుపులో గ్యాస్ పేరుకుపోతుంది. ముఖ్యంగా క్యాబేజి, క్యాలిఫ్లవర్, బబుల్ గమ్ లాంటి వాటి వల్ల ఈ సమస్య వస్తుంది. వీటితో పాటు ఆహారాన్ని త్వరగా తినేయడం, మాట్లాడుతూ తినడం, కూల్ డ్రింక్ లు తాగడం వల్ల జీర్ణాశయలోకి గాలి ఎక్కువగా చేరుకుంటుంది. ఇది త్రేన్పులు రావడానికి దోహదం చేస్తుంది.
పొగ తాగే వారిలోనూ పొగతో పాటు గాలి లోపలకు వెళ్ళి, త్రేన్పులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సఫ్రా గ్యాస్ట్రిక్ బెల్చింగ్ డిజార్డర్ అనే సమస్య వల్ల కూడా త్రేన్పులు వస్తాయి. గ్యాస్ట్రో పారెసిస్ అనే మరో సందర్భంలో కూడా త్రేన్పులు వస్తాయి. పొట్టలోని కండరాలు పక్షవాతానికి గురైనప్పుడు, పొట్టలోని ఆహారం పూర్తిగా ఖాళీ అయినప్పుడు తరచూ త్రేన్పులు వస్తాయి. గొంతు సమస్యలు ఉన్న వారికి సైతం ఆహారాన్ని మింగితే త్రేన్పులు వచ్చే అవకాశం ఉంది.
పాల పదార్థాలు,పండ్లు వంటి వాటిల్లోని చక్కెర పదార్థాలు పూర్తిగా జీర్ణం కాకపోవడం వల్ల గ్యాస్ పేరుకుంటుంది. కడుపు ఉబ్బరం, త్రేన్పులు చాలా వరకూ వాటంతట అవే తొలగిపోతాయి. చాలా తరచుగా త్రేన్పులు వస్తున్నాయంటే, ఇది బరువు, ఆకలి తగ్గిపోవడానికి కారణం అవుతుంది. ఇది అన్నవాహిక క్యాన్సర్ కు సంకేతం కావచ్చు. అన్నవాహికలో ట్యూమర్స్ కూడా త్రేన్పులకు కారణం కావచ్చు. తరచూ వచ్చే త్రేన్పులు యాసిడ్ రిఫ్లక్స్ కి కూడా సంకేతం కావచ్చు. దీనికి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోకపోతే పొట్టలో ఆల్సర్ల ప్రమాదం ఉంది. త్రేన్పులతో పాటు అతిసారం, మలబద్ధకం, వికారం వాంతులు, బరువు తగ్గడం కడుపునొప్పి, తరచుగా గుండెలో మంట, మలంలో రక్తం పడ్డం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి.
త్రేన్పులు రావడం ఓ విధంగా ఆరోగ్య చిహ్నమే. గతంలో పొట్టలో సర్జరీలు చేయించుకున్న వారికి, పేగులు తొలగించిన వారికి త్రేన్పులు వచ్చే అవకాశం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా త్రేన్పులు రాకుండా జాగ్రత్తపడవచ్చు. డిజార్డర్ వల్ల త్రేన్పులు వస్తే, దీన్ని నివారించడానికి బిహేవియరల్ థెరఫి ఉపయోగపడుతుంది. కొవ్వు పదార్థాలు తినడం తగ్గించాలి. ఒత్తిడి, ఆందోళను తగ్గించుకోవడం వల్ల కూడా త్రేన్పులు రాకుండా ఉంటాయి. త్రేన్పుల సమస్య ఉన్న వారు పిండి పదార్థాలను తగ్గించి తీసుకోవాలి. బబుల్ గమ్ లాంటివి నమలడం తగ్గించాలి. మాట్లాడుతూ తినడం, నమలకుండా తినడం లాంటివి చేయకూడదు.
పొగతాగే అలవాటు ఉన్న వారు కచ్చితంగా తగ్గించాలి. తినే ఆహారాన్ని, మానసిక పరిస్థితుల్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా త్రేన్పుల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. జాగ్రత్తలు తీసుకున్నా, త్రేన్పులు తగ్గడం లేదంటే మాత్రం వెంటనే వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. లేదంటే… ఇతర వ్యాధులు ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది.
అదే పనిగా వచ్చే త్రేన్పుల పట్ల జాగ్రత్తగా ఉండండి. చాలా వేగంగా తినడం, కార్బోనేటెడ్ పానియాలు తాగడం తగ్గించడం, ఆందోళన లేకుండా చూసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.