దంత క్షయం .. లేదా క్యావిటీస్ .. దంతాలు పుచ్చిపోవడాన్ని క్యావిటీస్ అంటారు. బ్యాక్టీరియా సంబంధిత చర్యలు దృఢమైన దంత నిర్మాణాన్ని దంత ధాతువు మరియు పంటిగార దెబ్బతీయడం… తద్వారా ఈ కణజాలాలు త్వరగా దెబ్బతింటాయి. ఫలితంగా దంత క్షయం సంభవిస్తుంది.
మనం ప్రతి రోజూ ముఖం, నోరు, దంతాలు, నాలుకను శుభ్రం చేసుకుంటాం. చాలామంది ఈ పనులన్నీ దైనందిన జీవితంలో చేస్తుంటారు. ఈ ప్రక్రియలో భాగంగా పళ్ళు శుభ్రం చేసుకోకపోవడం వల్ల పళ్ళు గారపట్టడం, పుచ్చిపోవడం, నోటిలో పుళ్ళు ఏర్పడటం లాంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు పంటి మీద నల్లటి మచ్చ ఏర్పడిందంటే వెంటనే పన్ను పుచ్చి పోయిందనే విషయాన్ని గుర్తించాలి. ఆ మచ్చ క్రమంగా రంద్రంగా ఏర్పడి పలు సమస్యలు తెచ్చిపెడుతుంది.
సాధారణంగా ఒక వయసు వచ్చేసరికి పళ్ళు ఊడిపోవడం, కదలడం లేదంటే పిప్పి పన్ను బాధించడం సర్వ సాధారణమైన విషయమే . కానీ ఈ మధ్య చాలామందికి అతి చిన్న వయసులోనే పిప్పి పన్ను వచ్చేస్తోంది. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళలో టీనేజ్ వయసున్న అమ్మాయిలకు పిప్పి పన్ను సమస్య ఎక్కువగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి వంశపారంపర్యంగా వచ్చే ఈ సమస్యకు దూరంగా ఉండాలంటే నిద్రించే సమయంలో తీపి పదార్థాలు తిని దంతాలు సరిగ్గా కడుక్కోకుండా ఉండకూడదు. నిద్రించేటప్పుడు తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పళ్ల మధ్య పాచి చేరకుండా ఉంటుంది. తద్వారా పళ్ళు శుభ్రంగా ఉంటాయి.
పంటి లోపల 3 రకాల పొరలు ఉంటాయి. పైన ఎనామిల్ ఉంటుంది. దీని లోపల డెంటిన్ ఉంటుంది. ఈ ఎనామిల్ కు దంతక్షయం ప్రారంభమయినప్పుడు సెన్సిటివిటీ గాని , నొప్పి గాని రాదు. అలాగే డెంటిన్ లోకి వెళ్ళిన మొదట్లో ఎలాంటి నొప్పి రాదు. ఈ డెంటిన్ లోపలి పొర పల్ప్ కు రక్త సరఫరా ఉంటుంది. ఈ పల్ప్ దగ్గర్లోకి చేరేటప్పటికీ ఈ సెన్సిటివిటీ మొదలవుతుంది. అందువల్ల ఈ కెరీస్ చిన్న మచ్చగా మొదలై పల్ప్ ను చేరడానికి సుమారుగా 2-3 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ప్రతి 6 నెలలకొకసారి దంత పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే ఈ గ్యాప్ లో కెరీస్ లోపల మాత్రం నల్లటి మచ్చల మాదిరిగా , చిన్న చిన్న రంద్రాల మాదిరిగా ఏర్పడి పంటిని తినేస్తుంది.
కెరీస్ లు డెంటిన్, పల్ప్ కు దగ్గర్లో ఉన్నప్పుడే పేషెంట్ డాక్టర్ ను సంప్రదిస్తే అప్పుడు వైద్యులు వాటికి ఇండైరెక్ట్ రూట్ క్యాపింగ్ లేదా ఫిల్లింగ్స్ చేస్తారు. ఈ కెరీస్ అనేది లోపల పుచ్చుపట్టినా పైన సన్నని పొర ఉంటుంది. మనం ఏదైనా పదార్థాన్ని తినేటప్పుడు గట్టిగా కొరికినపుడు ఈ సన్నని పొర విరిగి మనం తిన్న ఆహారం ఆ పంటి మధ్య ఇరుక్కుంటూ కొంత కాలం తర్వాత క్రమంగా నొప్పిగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ కు వైద్యులు పన్ను తీయడమో లేదా రూట్ కెనాల్ చేయడమో తప్ప మరో మార్గం కనిపించదు. మరికొన్ని సార్లు దవడలోని చీము కారణంగా ట్యూమర్స్ ఏర్పడి అశ్రద్ధ చేస్తే క్యాన్సర్ గా మారే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో వ్య్ధిగ్రష్టమైన దవడ ఎముకను తీసివేయవలసి ఉంటుంది. ఎక్కువ అశ్రద్ధ చేస్తే మొత్తం దవడ ఎముకను తీసివేయవలసి వస్తుంది. కాబట్టి రోగి ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ ను సంప్రదిస్తే మంచిది.
పిప్పి పన్ను వచ్చిన తర్వాత దీనిని ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే తీయించివేయడం వల్ల పన్నును మనం రక్షించుకోగలుగుతాము. కాబట్టి మీరు ప్రతి 6 నెలలకొకసారి వైద్యున్ని సంప్రదిస్తే సమస్యలు తీవ్రతరం కాకముందే మన పళ్లను మనం సేవ్ చేసుకోవచ్చు. ఆరోగ్యకరంగా ఉండవచ్చు.
అకస్మాత్తుగా వచ్చే పంటి నొప్పితో ఎంతటి వారైనా విలవిల్లాడిపోతారు. ఎక్కువగా రాత్రుళ్లు మొదలయ్యే పంటినొప్పి కొన్ని గంటల పాటు తీవ్ర వేదనకు గురిచేస్తుంది. అలాంటి సమయంలో తక్షణం నొప్పి నుంచి ఉపశమనం అందించే మెడిసిన్ కోసం చూస్తాం. అయితే నొప్పి ఎక్కువగా ఉన్న సమయంలో ఉపశమనం కోసం ఈ సమస్యకు తగిన చికిత్స చేసుకోని పక్షంలో ఈ వ్యాధి నొప్పి, పళ్లు రాలిపోవడం, గాయాలకు దారితీస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మరణం కూడా సంభవించవచ్చు. కాబట్టి ఈ సమస్యకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపండి.