Immunity Booster: వ్యాధులు రాకుండా.. రోగనిరోధక శక్తి పెంచుకోవడం ఎలా?

By manavaradhi.com

Published on:

Follow Us
Strengthen-Your-Immune-System

ఆరోగ్యం మహాభాగ్యం అని మన పెద్దలు ఎప్పుడో మాటల్లో చెప్పారు. కానీ నేటితరానికి ఇది ఆచరణలో అర్ధం అవుతుంది. అభివృద్ధి పేరుతో శరవేగంగా దూసుకుపోతున్నా ఆరోగ్యం మాత్రం వెనకబడుతూనే ఉంది. ప్రకృతికి దగ్గరగా ఉండాల్సిన మనిషి తనంతట తానే ప్రకృతికి, సహజత్వానికి దూరమవుతున్నాడు. దీంతో శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ నాశనం అయ్యి అనేక రోగాలను ఆహ్వానించినట్టు అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా వైద్యసౌకర్యం పెరగడంతో సగటు ఆయుర్ధాయం గణనీయంగా పెరిగింది. కానీ జీవనవిధానంలో వచ్చిన మార్పులతో హఠాత్తుగా ప్రాణాలు వదులుతున్నవారు, రోగాలబారినపడి జీవితాన్ని అతికష్టంగా గడుపుతున్నవారి సంఖ్య పెరిగిపోతుంది.

మనిషి శరీరం అద్భుతమైన జీవయంత్రం. ఉదయం లేచిన మొదలు.., రాత్రి నిద్రపోయేంత వరకు శరీరానికి తగిన ఆహారం, విశ్రాంతి అందిస్తూ ఎంతైనా శ్రమించవచ్చు. కానీ కాలం మారిపోయింది. అలవాట్లూ మారిపోయాయి. అందరూ హడావుడిగానే బతకాల్సివస్తుంది. చాలా మందిలో శారీరికశ్రమ తగ్గిపోయి మానసిక శ్రమ పెరిగింది. కంప్యూటర్ ముందు గంటల తరబడి గడిపేస్తూ…, రోజు మొత్తం మీద ఒక్క కిలోమీటరు కూడా నడవని యువత కోట్లలో ఉన్నారు. క్రమంగా ఈ జీవనవిధానమే మనలోని రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. దీంతో అనేక లైఫ్స్టయిల్ డిజార్డర్స్కు కారణం అవుతుంది. నేడు ప్రపంచంలో అత్యంత తీవ్ర సమస్యలు అని చెప్పుకుంటున్న అనేక రోగాలకు వైరస్లు, క్రిములు కారణం కాదు. కేవలం జీవనవిధానంలో మార్పులు వలన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోయి.. అనేక అనారోగ్యాలకు కారణం అవుతుంది.

శరీరానికి శక్తినిచ్చే ఆహారం అవసరం. అలాగే ఆహారం జీర్ణమయ్యి శక్తిగా మారడానికి శ్రమ అవసరం. ఈ రెండూ సమానస్థాయిలో ఉండాలి. కానీ ఆధునిక జీవితంలో ఈ బ్యాలెన్స్ తప్పింది. పోటీ ప్రపంచంలో ఎక్కడ వెనుకబడిపోతామోననే భయంతో ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పరుగులు పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ఇబ్బంది పెడుతున్న తీవ్ర సమస్య ఊబకాయం. జన్యుపరమైన సమస్యల వలన ఒకటి నుంచి రెండు శాతం మంది మాత్రమే ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉంటున్నారు. మిగిలిన 98శాతం జీవనవిధానంలో మార్పులు వలన బరువు పెరుగుతున్నారు. ఒకసారి బరువు పెరగడం మొదలయిన తరువాత దాని దుష్ప్రభావాలు శరీరంపై అనేక రకాలుగా ఉంటాయి. నడుము చుట్టూ పేరుకుపోయే కొవ్వు తెచ్చే అనారోగ్యం అంతా ఇంతా కాదు. బరువు పెరగడం వలన ఆ భారం శరీరంలో అన్ని అవయవాలపైనా పడుతుంది.

సంప్రదాయ ఆహారపు అలవాట్లు వదిలేసి, తమది కాని ఆహారం తీసుకోవడం వలన అనేకమంది బరువు పెరిగిపోతున్నారు. జంక్ఫుడ్లో కొవ్వు పదార్ధాలు ఎక్కువ ఉంటాయి. దీంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఇది శరీరంలో ప్రవహించాల్సిన రక్తవేగంలో మార్పులకు కారణం అవుతుంది. ఇదే బీపీ… బ్లడ్ ప్రెజర్కు కారణం. మానసిక సమస్యలు, ఒత్తిళ్లు, ఇతర అనారోగ్యాలు ఈ బీపీకి తోడయినప్పుడు గుండె జబ్బులు రావడం, అవి ప్రాణాంతకంగా మారడం సాధారణం అయిపోయింది.

ఇక ప్రపంచంలోనే భారతదేశం క్యాపిటల్ ఆఫ్ డయాబెటిస్గా మారిపోతుంది. మధుమేహవ్యాధిగ్రస్తుల సంఖ్య వేగంగా మారిపోతుంది. ఇది కూడా లైఫ్ స్టైల్ డిసీజ్ అనే చెప్పుకోవాలి. అంటే జీవనవిధానంలో మార్పులు వలన రోగనిరోధక శక్తి తగ్గి.., మనిషిని నాశనం చేస్తుంది. మనం తినే ఆహారం ఏ సమయంలో తింటున్నాం అనేది కూడా ముఖ్యమే. నేటి తరం పనిలో పడి ఆకలి వేసినప్పుడు నోటికి రుచిగా అనిపించిందో, చేతికి దొరికిందో తిని సరిపెట్టుకుంటున్నారు. శరీరానికి సమతుల ఆహారం దొరకడం లేదు. దీంతో రోగనిరోధక శక్తి తగ్గి కొత్త వైరస్లకు శరీరం సులువుగా లొంగిపోతుంది. ఇక మద్యపానం, ధూమపానానికి బానిస అవుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. ఈ రెండు అలవాట్లు శరీరంలో రోగ నిరోధక స్థాయిని కనిష్టానికి పడేస్తాయి. సరదా కోసమో, సమాజంలో స్టేటస్ సింబల్గానో వీటిని అలవర్చుకుని.. అలవాటుగా మారాక వదులుకోలేక ఇబ్బందులు పడేవారి సంఖ్య కోట్లలో ఉంటుంది. అతి మద్యపానంతో లివర్ ఫెయిల్యూర్, ధూమపానంతో అనేక రకాల క్యాన్సర్లు శరీరంలో వచ్చి చేరుతున్నాయి. శరీరానికి రక్షణగా పనిచేయాల్సిన రోగనిరోధక వ్యవస్థ తిరగబడటమే ఈ సమస్యలకు కారణం. అంటే అలవాట్లు మారితే.. ఈ సమస్యలు దరిచేరవనే అర్ధం చేసుకోవాలి.

ఇక రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసేవాటిలో నిద్ర ముఖ్యమైనది. సమతుల ఆహారంతో పాటు సరిపడా నిద్ర ఉంటేనే శరీరంలో వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. అయితే ఆధునిక జీవితంలో నాణ్యమైన నిద్ర అనేది ఏ కొద్దిమందికో మాత్రమే పరిమితం అవుతుంది. సగటు మనిషి జీవితంలో స్క్రీన్ను చూసే టైమ్ విపరీతంగా పెరిగింది. కంప్యూటర్, టీవీ, స్మార్ట్ ఫోన్… ఇలా రోజులో ఎక్కువ భాగం ఏదో ఒక స్క్రీన్ చూస్తూ గడిపేస్తున్నాం. దీంతో మెదడు యాక్టివ్గా ఉండే సమయం పెరిగింది. నిద్రపోవడానికి కొద్ది నిమిషాల ముందు కూడా స్మార్ట్ ఫోన్తో గడుపుతున్నారు. దీంతో బ్రెయిన్ నిద్రపోవడానికి సంసిద్ధం కావడం లేదు. అంతలోనే పని ఒత్తిడితో మేల్కోవడం.., ఈ ప్రక్రియ రోజులు, ఏళ్ల తరబడి సాగడం…. అలవాటుగా మారడంతో శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ బలహీనం అయిపోతుంది.

లైఫ్ స్టైల్ డిసీజిస్ రావడానికి మనిషి స్వయంకృతాపరాధమే కారణం. తమంతట తాము శరీరానికి హాని చేసేవిధంగా జీవనవిధానం అలవర్చుకోవడం వలన వ్యాధుల బారినపడుతుంటారు. కాబట్టి మంచి అలవాట్లే మంచి ఆరోగ్యాన్నిస్తాయనే విషయాన్ని గుర్తించాలి. శరీరంలో రోగనిరోధకశక్తి పూర్తి స్థాయిలో ఉండటానికి ఆహారం ప్రధానకారణం. కాబట్టి శరీరానికి అవసరమైన సమతుల ఆహారం తీసుకోవాలి. రుచిగా ఉందని ఒకటే తరహా భోజనానికి అలవాటుపడకుండా ఆహారంలో భిన్నత్వం ఉండేలా చూసుకోవాలి. పప్పులు, కూరగాయలతోపాటు మాంసం, చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆకుకూరలు, తాజాపండ్లు లాంటి వాటికి ప్రత్యమ్నాయం ఉండదు. అలాగే స్నాక్స్ రూపంలో బాగా మరిగిన నూనెలో వేయించిన పదార్ధాలను కాకుండా తాజా పండ్లను తినడం ఉత్తమం.

క్రమం తప్పకుండా వ్యాయామం అనేది శరీరానికి ఓ క్రమశిక్షణ నేర్పుతుంది. రోజూ కనీసం అరగంట వాకింగ్, వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో అన్ని అవయవాలు ఉత్తేజితం అయ్యి పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. దీంతో వ్యాధినిరోధక శక్తి పెరిగి.., సీజనల్గా వచ్చే అనేక రోగాలను అడ్డుకుంటుంది. ఇక వ్యాయామం పూర్తయిన తరువాత ధ్యానం లాంటివి మానసికంగానూ ప్రశాంతత కలిగిస్తాయి. రోజంతా కూర్చుని పనిచేస్తూ ఉండేవారు వ్యాయమాలకు కేటాయించే సమయం పెంచాలి. అలాగే వ్యాయామం చేశాం కదా అని రోజంతా కదలకుండా ఉండటమూ మంచిది కాదు. ఆఫీసులో ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు వెళ్లేటప్పుడు లిఫ్ట్ బదులు మెట్లను ఉపయోగించడం, నీళ్లు, టీ, కాఫీ వంటివి తాగడానికి వెళ్లినప్పుడు నాలుగు అడుగులు ఎక్కువ దూరం నడిచేలా చూసుకోవడం, ఇంటికి దగ్గర్లో ఉండే చిన్న చిన్న అవసరాల కోసం వాహనంపై కాకుండా నడిచి వెళ్లడం లాంటివి శరీరంలో కదలికలు పెంచుతాయి.

మనిషికి పని ఎంత ముఖ్యమో విశ్రాంతి అంతే ముఖ్యమని గుర్తించాలి. శరీరానికి, మెదడుకు తగినంత విశ్రాంతినివ్వడం వల్ల రెట్టించిన ఉత్సాహంతో పనిచేయవచ్చు. కాబట్టి పని, విశ్రాంతి ఓ క్రమ పద్ధతిలో ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కొంత సమయం గడుపుతూ ఉండాలి. దీని వలన బంధాలు బలపడతాయి. మానసికంగా మనిషి బలోపేతం అవుతాడు. ఉత్సాహంగా, చలాకీగా ఉండటంతో నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. అది మానసిక ఒత్తిళ్లను తొలగించి ఊబకాయం, డయాబెటిస్ లాంటివి రాకుండా చూడగలుగుతుంది. ఇక ధూమపానం, మద్యపానం లాంటివి చేసే హాని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎముకలు బోలుగా మారడం నుంచి గుండె జబ్బుల వరకు అనారోగ్యపరంగా, సామాజికంగానూ చెడు అలవాట్లు దిగజారుస్తాయి. కాబట్టి మంచి అలవాట్లు ఏర్పరుచుకోవడం ద్వారా ఇమ్యునిటీ పవర్ పెంచుకుని అనారోగ్యాలను దరిచేరకుండా కాపాడుకోవచ్చు.

రోగనిరోధకవ్యవస్థ బలహీనపడటం అంటే యాంటీ వైరస్ లేని కంప్యూటర్ను విచ్చలవిడిగా వాడటం లాంటిది, సేఫ్టీ కిట్ లేకుండా లాంగ్ డ్రైవ్కు వెళ్ళడం లాంటిది. కాబట్టి…, ఇమ్యునో సిస్టమ్ బలపరుచుకోవడం అందరికీ కనీసం అవసరం. లేదంటే పక్కోళ్ళు తుమ్మినా మనకు జలుబు చేస్తుంది. రోడ్డుపై ఏ వాహనం వెళ్లినా మనకు అలర్జీ వస్తుంది. కాబట్టి రోగనిరోధకశక్తిని బలహీనపరిచే ఏ అలవాటుకు అయినా స్వస్తి చెప్పాల్సిందే.

Leave a Comment