శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె. మనిషి మనుగడకు గుండె ఆధారం. అనుకోని పరిణామంలా వచ్చి అందరికీ హడలెత్తించే హార్ట్ ఎటాక్. చాలామందికి దీని లక్షణాలు తెలియక గుండెనొప్పితో మరణిస్తుంటారు. అలాకాకుండా ముందుగానే ఈ లక్షణాలను గుర్తించి , తగిన సమయంలో వైద్యం చేయించుకుంటే విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చు.
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాల గోడలకు కొవ్వు ఎక్కువైతే రక్త నాళాలు సన్నగా మారతాయి. దీని వలన గుండెకు రక్త సరఫరా తగ్గిపోతుంది. రక్త సరఫరా తగ్గడం కారణంగా గుండె కండరాలకు పోషకాలు, ఆక్సిజన్ అందవు. దీని వలన గుండె కండరం చచ్చుబడి పోతుంది. దీనినే గొండెనొప్పి లేదా హార్ట్ ఏటాక్ అంటారు. మన శరీరంలో అన్నీ అవయవాలకు ఆక్సిజన్ అవసరం. అలాగే కార్బన్ డై ఆక్సైడ్ , మరికొన్ని మలిన పధార్థాలని ఎప్పటికప్పుడు మన శరీరం నుండి తొలగించాలి. ఈ పని రక్తం ద్వారా జరుగుతుంది. నిరంతరం మన గుండె స్పందిస్తూ ఉంటుంది. కాబట్టి రక్తం శరీర భాగాలన్నిటికి సరఫరా అవుతుంది. మళ్ళీ వెనుకకు తిరిగి రావడం జరుగుతుంది. ఈ విధంగా జరిగే ప్రక్రియలో లోపాలు వస్తే అది గుండె నొప్పికి కారణం అవుతుంది.
గుండె కండరాలు ఆరోగ్యంగా బలంగా ఉండాలి. గుండె కండరాలకు రక్త సరఫరా సరిగ్గా జరుగుతుండాలి. గుండెలోను శక్తి ప్రవాహం కూడా ఒక పద్దతిలో జరుగుతుండాలి. అప్పుడే గుండె ‘లబ్ డబ్’ అంటూ సరైన వేగంతో కొట్టుకుంటూ దాని విధులను నిర్వహిస్తుంది. గుండె చుట్టూ ఉండె రక్షక పొరని ‘పెరికార్డియమ్’ అంటారు. దీనిలో కూడా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలున్నాయి. ఇలా ఇన్ఫెక్షన్ వస్తే గుండె చుట్టూ నీరు చేరుతుంది. ఇలా నీరు చేరడం వలన ఛాతీ ప్రాంతంలో నొప్పి వస్తుంది. దీనివలన గుండె కండరాలు బలహీనమై గుండె కొట్టుకోవడం కష్టమౌతుంది. దీనిని గుర్తించకుండా వదిలేస్తే ‘హార్ట్ ఫెయిల్యూర్ ‘ కి దారితీస్తుంది.
గుండెలోని ఒక ప్రక్కన ఉన్న గదుల ద్వారా ఆక్సిజన్ కూడుకున్న రక్తం శరీరబాగాలలోకి వెళితే రెండో ప్రక్కనున్న గదులలోకి కార్బన్ డై ఆక్సైడ్ తో కూడుకున్న రక్తం శరీరబాగాలనుంచి చేరుతుంది. కాబట్టి రెండు ప్రక్కలలోనున్న రక్తనాళాలు కలవకుండా ఉండాలి. అలాగే రక్తం ఒకవైపే ప్రవహిస్తుండాలి. ఇందుకు గుండెకు ఉండే కావటాలు తోడ్పడుతుంటాయి. వీటిలో ఏమైనా లోపాలున్న గుండె గోడలలో రంద్రాలున్నా గుండె పనితీరులో సమతుల్యం దెబ్బతిని గుండె నీరసించిపోతుంది. అందుకే గుండెకు సంబందించిన ఏ చిన్న సమస్య వచ్చిన వైధ్యుల సలహాలు తీసుకొని సరైన చికిత్సను చేయించుకోవాలి.
నిజానికి మనలో చాలామంది మనకు ఎటువంటి గుండె జబ్బు లేదని అనుకుంటుంటారు . కానీ పైకి ఏమి తెలియకుండానే గుండె జబ్బు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. గుండె రావడానికి అనేక కారణాలున్నాయి. పొగతాగడం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ , మధుమేహం , మానసిక ఒత్తిడి, ఊబకాయం శారీరక శ్రమ లేకపోవడం. కాబట్టి గుండె నొప్పితో ఆకస్మిక మరణం రాకుండా చూసుకోవాలంటే ఒకటే మార్గం. గుండెకు సంబందించిన సమస్యలపై అవగాహన పెంచుకోవడం. ఎన్నడూ అనుభవించని నొప్పి ఒక్కసారిగా వస్తే దానిని గ్యాస్ ప్రాబ్లెమ్ గా చాలామంది భావిస్తుంటారు. ఇలా వ్యాధి నిర్ధారణ ఎవరికి వారే చేసుకోవడం వలన విలువైన ప్రాణాన్ని కోల్పోయిన వారిని మనం తరచూ చూస్తూనే ఉంటాం. అందుకే ఛాతీ నొప్పి వచ్చినప్పుడు వెంటనే వైధ్యుల సలహాలు పాటించాలి.
గుండె నొప్పి రావడానికి ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తిస్తే కొంతవరకు మన ప్రాణం మన చేతుల్లో ఉన్నట్లే. కొన్ని సమయాలలో గుండెపై ఒత్తిడి కలుగుతుంది. కానీ ఏ కారణం లేకుండా
- ఆయాసం ,శ్వాస ఆడకపోవడం
- శారీరక శ్రమ లేకుండా చెమటలు రావడం
- శరీర బాగాలలో అలసటగా అనిపించడం.
- రెండు భుజాలపై నొప్పిగా ఉండటం.
- వీపు భాగంలో నొప్పిఛాతీ మధ్యలో నొప్పి రావడం, తగ్గడం
- జ్ఞాపకశక్తి లోపించడం
- మాట్లాడేటప్పుడు గందరగోళానికి గురవ్వడం
- ఒకే విషయాన్ని ఎక్కువసార్లు చెప్పడం.. మొదలైన లక్షణాలు కనిపిస్తే నిర్లక్షం చేయకుండా జాగ్రత్తపడితే గుండె నొప్పి వలన సంభవించే మరణాల భారినుండి బయటపడవచ్చు.
మానవ హృదయం రోజుకు లక్షసార్లు కొట్టుకొంటుంది. పురుషులతో పోల్చితే స్త్రీలలో హృదయ స్పంధన చాలా వేగంగా ఉంటుంది. స్త్రీలలో నిమిషానికి గుండె 78 సార్లు పురుషులలో 70 సార్లు కొట్టుకొంటుంది. గుండెలోని 4 కావాటాలు మూసుకొని ఉండటం వలన గుండె కొట్టుకునే శబ్దం మనకు వినిపిస్తుంది. గుండెకు ఏదైనా ప్రమాదం జరిగితే రక్త పంపీణీలో అవకతవకలు ఏర్పడతాయి. దీంతో కవాటాలు రక్తాన్ని పంపిణీ చేయలేకపోతాయి. అందుకే గుండెను పదిలంగా కాపాడుకోవాలి. అప్పుడే మనం ప్రాణంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాము.
ఆరోగ్యకరమైనా సమతులాహారం తీసుకోవడం వలన గుండెకు సంబందించిన జబ్బులను నివారించవచ్చును. రోజు తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. కొలెస్ట్రాల్ ను తగ్గించే ఆహార పదార్థాలైన వెళ్ళుల్లిని , రక్త నాళాలను శుభ్రం చేసే ద్రాక్షపండ్లను ఆహారంలో బాగంగా తీసుకోవాలి. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. దానివలన మానసిక ఒత్తిడి లేకుండా ఉంటూ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. దీనివలన రక్తపోటు క్రొవ్వులు మధుమేహం వంటివి అదుపులో ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వలన మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.