టెక్నాలజీతోపాటుగా మెదడుకు కొంత భారం తగ్గిందనుకొంటున్నారు కదా! కాని మెదడుకు ఎంతో ముప్పు. మెదడును ఎంతగా వాడుకుంటే అంతగా దాని పనితనం పెరుగుతుంది. అయితే మనకుండే కొన్ని చెడు అలవాట్ల వల్ల కూడా మెదడు పనితనం తగ్గిపోతుంది.
నేటి ఉరుకుల పరుగుల బిజీ ప్రపంచంలో పోటీతనం ఎక్కువైంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం… ఇలా ఏ రంగం తీసుకున్నా వ్యక్తుల మధ్య పోటీ అనివార్యమైంది. జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలనుకునే వారైతే ఇంకా పట్టుదలతో శ్రమిస్తున్నారు కూడా. ఈ క్రమంలో ఏ వ్యక్తి అయినా మరింత చురుగ్గా ముందుకు దూసుకుపోవాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండడంతోపాటు మానసికంగా దృఢంగా ఉండాలి. అలా ఉండాలంటే మెదడు చురుగ్గా పనిచేయాలి. ఇలాంటి కీలకమైన మన మెదడు కొన్ని చెడు అలవాట్ల కారణంగా ఆటుపోట్లకు గురవుతోంది.
ఎక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగాదం వల్ల మెదడుతోపాటు శరీరంలోని అన్ని అవయవాలపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. శాచురేటెడ్ కొవ్వు అధికంగా ఉన్న ఆహారం తీసుకున్న వారిలో దీర్ఘకాలంలో మెదడు సామర్థ్యం తగ్గిపోతుందని కూడా వెల్లడించారు. అదేవిధంగా దీర్ఘకాలికంగా వేధించే టైప్-2 డయాబెటిస్, ఒబేసిటీ, హై బీపీ వంటివి మెదడు పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తాయి. దీంతో జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఆలోచించే శక్తి, విశ్లేషణా సామర్థ్యం కూడా తగ్గిపోతాయి.
నిత్య జీవితంలో మనం తీసుకునే పలు ఆహార పదార్థాలు, కొన్ని రకాల అలవాట్లు మెదడు పనితీరును మందగింపజేస్తాయి. మెదడు ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంపైనా, మనకుండే అలవాట్లపైనా ప్రధానంగా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఆహారంలో కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లు అవసరమైన మేరకు ఉండేలా చూసుకోవాలని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
మద్యం సేవించడం వల్ల కేవలం లివర్, జీర్ణాశయం మాత్రమే కాదు, మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. ఆల్కహాల్ మన మెదడుపై తీవ్రమైన నెగెటివ్ ప్రభావాలను చూపిస్తుంది. మెదడులో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆల్కహాల్ వల్ల నాశనం అవుతాయి. ఫలితంగా విటమిన్ బి1 లోపం సంభవించి మెదడు సమస్యలకు కారణమవుతుంది. ఆర్టిఫీషియల్ చక్కెరలు ఎక్కువగా ఉండే ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ లను పూర్తిగా మానేయాలి. రోడ్డుపైన లభించే ఫాస్ట్ ఫుడ్స్.. రోస్టెడ్ ఫుడ్స్ ను దూరం పెట్టాలి. సాయంత్రం వేళ సరదాగా ఆయిల్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్లను తినే అలవాటును పూర్తిగా మానుకోవాలి. ధూమపానం వల్ల శరీరంలో వచ్చే విష పదార్థాలు మెదడు యొక్క వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తాయి.
మన మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. శరీరానికి తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం. కలత నిద్ర కాకుండా గాఢ నిద్ర ఉండాలి. రోజూ మితంగా కాఫీ తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా ఏదైనా ఆలోచించాల్సి వచ్చినప్పుడు, దేని గురించైనా విశ్లేషించాల్సి వచ్చినప్పుడుగానీ కాఫీ అద్భుతంగా పనిచేస్తుంది. మన మెదడు చురుగ్గా పనిచేయడానికి చేప మాంసం అద్భుతంగా తోడ్పడుతుందని చాలా పరిశోధనల్లో తేలింది.
నిత్యం ఏదో ఒక పనిలో, ఏదో ఒక ఒత్తిడితో సతమతం అవుతూంటే మెదడుపై భారం పెరిగిపోతుంది. అందువల్ల అప్పుడప్పుడూ.. అన్ని రకాల పనులు, ఒత్తిళ్లకు దూరంగా సరదాగా గడపడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. సో.. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. మీ మెదడు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి.