అటల్ పెన్షన్ యోజన (APY)ఇది ఒక కెంద్ర ప్రభుత్వ పెన్షన్ పథకం. ఈ పథకంలో ఎవరైతే చేరతారో వాళ్ళు 60 సంవత్సరాల వయస్సు నుంచి పింఛన్ పొందొచ్చు. దీని ద్వారా నెలకు రూ. 1000 నుంచి రూ. 5000 వరకు పెన్షన్ పొందవచ్చు. ఈ పథకం కోసం ఇప్పటికే 5 కోట్ల మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు. ఈ పథకం యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వృ ద్ధాప్యంలో ఎవరూ కూడా తమ కనీస జీవనావసరాల నిమిత్తం ఇతరులపై ఆధారపడకుండా నెలనెలా పింఛను రూపంలో కొంత మొత్తాన్ని పొంది గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో భారతప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అటల్ పెన్షన్ యోజన. ఈ పథకం జూన్ 1, 2015న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద పాలసీ తీసుకున్నట్లయితే 60 సంవత్సరాల నుండి నెలనెలా రూ. 1,000/- ల నుండి రూ.5,000/- ల వరకూ పింఛను పొందవచ్చు. బ్యాంకు పొదుపు ఖాతా కలిగిన ప్రతిఒక్కరూ ఈ పథకంలో చేరవచ్చు. 18 సంవత్సరాలనుండి 40 సంవత్సరాల వయసు కలిగిన ప్రతిఒక్కరూ అర్హులే. గత ఎన్.పి.ఎస్. లైట్ పథకంలోని పాలసీదారులుకూడా ఈ కొత్తపథకంలో చేరవచ్చు.
ఖాతాను తెరిచే విధానం ఏంటి..?
- బ్యాంకు ప్రతినిధిని లేదా బ్యాంకు మిత్రను కలిసి సంబంధిత ఫారంను, రిజిస్ట్రేషను ఫారంను పూర్తి చేయాలి.
- ఫారంలో అడిగిన అన్ని వివరాలూ తప్పనిసరిగా తెలియజేయాలి. (మొబైల్ నంబరు, ఆధార్ నంబరుతో సహా)
- వయసును బట్టి ఎంత ‘కిస్తీ’ కట్టాలో (కాంట్రిబ్యూషను) బ్యాంకు నిర్ధారిస్తుంది.
- ఇంతకు ముందు బ్యాంకు ఖాతా లేనట్లయితే, ఇప్పుడు బ్యాంకు ఖాతా మరియు అటల్ పింఛన్ యోజన పథకం ప్రారంభించవచ్చు.
- బ్యాంకు ఖాతా తెరిచేటపుడు (కె.వై.సి.) నిబంధనలను అనుసరించాలి.
- మీరు డిపాజిట్ చేసిన మొత్తం లేదా మీ పొదుపు ఖాతాలో నుండి మీ ‘కిస్తీ’ ని (కాంట్రిబ్యూషను) తీసుకునే అధికారాన్ని బ్యాంకుకు కల్పించాలి.
- ఈ ఖాతాలో కాంట్రిబ్యూషనుకు కావలసిన మొత్తం లేనట్లయితే ఆ తరువాత అపరాధ రుసుముతో కలిపి బ్యాంకు వసూలు చేస్తుంది.
- ఖాతాలో కాంట్రిబ్యూషన్ వసూలు చేయడానికి 24 నెలల సమయం బ్యాంకు మనకు ఇస్తుంది.
- గడువు ముగిసేలోపు మనం కాంట్రిబ్యూషనుకు కావలసిన మొత్తాన్ని డిపాజిట్ చేయలేకపోయినట్లయితే ఖాతాను బ్యాంకు మూసివేస్తుంది.
- ఖాతాదారుడు పాలసీ తీసుకునేటప్పుడు ఫారంలో తప్పనిసరిగా నామినీ పేరును ప్రతిపాదించాలి. పాలసీదారుడు మరణిస్తే పింఛను జీవితభాగస్వామికి ఇస్తారు. ఇద్దరూ లేకపోయినట్లయితే పింఛను నిధిని నామినీకి ఇస్తారు.
అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాలు
- 60 సంవత్సరాల వయస్సు నుండి మీరు, మీ మరణం తరువాత మీ జీవిత భాగస్వామి ప్రతి నెలా నిర్దిష్టమైన పెన్షన్ పొందుతారు.
- మీ జీవిత భాగస్వామి తరువాత మీ నామినీ రూ.1,70,000/- ల నుండి 8,50,000/- ల వరకు పొందుతారు.
- కనీస పెన్షన్ ప్రయోజనానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది.
- నెలవారి చెల్లించవలసిన సొమ్ము లబ్ధిదారుని వయస్సు మరియు ఎంచుకున్న పెన్షన్ సొమ్ముపై ఆధారపడి ఉంటుంది.
- కంట్రిబ్యూషన్ సొమ్ము ఖాతాదారుల పొదుపు ఖాతా నుండి బ్యాంక్ ద్వారా ‘ఆటో డెబిట్’ సదుపాయం ద్వారా తీసుకోబడుతుంది.
- ఏ వ్యక్తి అయినా కేవలం ఒక పొదుపు ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకాన్ని పొందగలరు.
- అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరిన వారు ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద రూ.50000 వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు.
మనలో చాలా మందికి కొన్ని సందేహాలు ఉంటాయి. అనుకోని కారణాల వల్ల ఎప్పుడన్న మనం ఈ పథకం నుంచి తప్పుకోవాచ్చా. ఎవరైతే ఈ పథకంలో చేరతారో వాళ్ళు అనారోగ్యం బారినపడినప్పుడు పథకం నుంచి నిష్క్రమించవచ్చు. కొన్ని నిర్ధిష్ట అనారోగ్యాలకు, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం నియమాల ప్రకారం నిర్ధిష్ట అనారోగ్యం బారిన పడి ఏపీవై నుంచి వైదొలగాలి అనుకుంటే చందాదారుడు చెల్లించిన ప్రయోజనాలను (చందాదారుడు చేసిన కాంట్రీబ్యూషన్, ప్రభుత్వ కాంట్రీబ్యూషన్, దానిపై వచ్చిన రాబడితో సహా) చెల్లిస్తారు. అలా కాకుండా స్వచ్ఛందగా తప్పుకోవాలంటే ..60 ఏళ్లకు ముందే చందాదారుడు పథకం నుంచి స్వచ్చంధంగా వైదొలగవచ్చు. అయితే, అప్పటివరకు చందాదారుడు చేసిన కాంట్రీబ్యూషన్, దానిపై వచ్చిన రాబడి నుంచి వర్తించే ఛార్జీలను (నిర్వహణ, ఇతర రుసుములను) తీసివేసి మిగిలిన మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తారు. చందాదారునికి అనుగుణంగా ప్రభుత్వం చేసిన కాంట్రీబ్యూషన్, దానిపై వచ్చిన రాబడిని చెల్లించరు.
నెల నెలా సక్రమంగా చెల్లించని వారికి జరిమానా ఉంటుంది. నెలకు రూ.100 చెల్లించే వారు నిర్ణీత తేదీలోగా చెల్లించకపోతే వారికి ఒక రూపాయి జరిమానా విధిస్తారు. అలాగే, నెలకు రూ.101 నుంచి రూ.500 చెల్లించే వారికి రెండు రూపాయలు, రూ.501 నుంచి రూ.1000 చెల్లించే వారికి ఐదు రూపాయలు, రూ.1000 ల కంటే ఎక్కువ చెల్లించే వారికి పది రూపాయల చొప్పున జరిమానా విధిస్తారు. ఒకవేళ వరుసగా ఆరు నెలల పాటు చెల్లించనట్లయితే సదరు పింఛను ఖాతాను స్తంభింపజేస్తారు. అదేవిధంగా 12 నెలల పాటు చెల్లించనట్లయితే పింఛను ఖాతాను డీయాక్టివేట్ చేస్తారు. 24 నెలల అనంతరం ఖాతాను మూసివేసి అంతవరకు సేకరించిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారు.