నేటి ఆధునిక యుగంలో కంప్యూటర్‌పై పని చేయడం, స్మార్ట్‌ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. ఫలితంగా కళ్ళు పొడిబారి అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో మన ఇంట్లో ఉన్న ఐ డ్రాప్స్ వేసుకొంటుంటాం. ఐ డ్రాప్స్ వేసుకోవడం వల్ల డ్రై ఐస్ సమస్య తొలగిపోతుందా ..?
కంటిలో రక్షణ వలయంగా ఓ నీటి పొర ఉంటుంది. ఇది ఉన్నంత కాలం కంటికి ఏ ఇబ్బందులూ ఉండవు. సహజంగానే మన శరీరం దీన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఆ తేమ శాతం తగ్గిపోతుంది. దీని వల్ల కళ్ళకు సంబంధించిన ఇబ్బందులతో పాటు, దృష్టి లోపాలు కూడా ఎదురౌతాయి. మన కను గుడ్డు మీద ఓ నీటి పొర ఉంటుంది. కళ్ళలోకి వచ్చే దుమ్ము, ధూళి, ఇన్పెక్షన్లతో పోరాడి, వాటిని బయటకు పంపే బాధ్యత ఈ నీటి పొరదే. కళ్ళు పొడి బారినప్పుడు ఈ పరిస్థితి తగ్గిపోతుంది.
కంటి నీరు సాధారణంగానే వచ్చినా, అందులో తగినంత తైలపు స్థాయి లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. తైలపు స్థాయి తగ్గడం వల్ల కంటి నుంచి వచ్చే నీరు త్వరగా ఆవిరిగా మారిపోతుంది. ఫలితంగా కళ్ళు వెంటనే పొడిబారతాయి. సాధారణంగా కంటికి వచ్చే సమస్యల్లో డ్రై ఐ సిండ్రోమ్ ఒకటి. దీని వళ్ళ కళ్ళలో తయారయ్యే నీటి స్థాయి తగ్గిపోతుంది. ఫలితంగా అనేక కంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.
డ్రై ఐస్ రావడానికి కారణాలు ఏంటి ?
కళ్ళు పొడిబారడానికి ప్రధాన కారణాల్లో వయసును ముందుగా చెప్పుకోవాలి. కంట్లో నీటిని స్రవించే గ్రంథులు పని చేయడం ఆగిపోతుంది. కొన్ని సమయాల్లో అవి పగిలిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఫలితంగా ఈ సమస్య ఏర్పడుతుంది. కంటి శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారిలో కూడా కళ్ళు పొడిబారే సమస్య ఎదురౌతుంది. అందుకే ఈ సమయంలో వైద్యులు కంటి కోసం చుక్కల మందును సూచిస్తారు. కొన్ని రకాల మందులు వాడే వారిలో కంటిలో స్రవించే నీటి స్థాయి తగ్గిపోతుంది. ఇటువంటి వారిలో కూడా కళ్ళు పొడిబారే అవకాశం ఉంది.
కండ్లు ఎక్కువగా పొడిబారుతున్నట్లు అనిపిస్తే నిపుణుల సలహా తీసుకొని ఐ డ్రాప్స్ వాడటం మంచిది. ఇలా చేయడం వల్ల కంటి చూపు కోల్పోకుండా ఉంటారు. ఇంట్లో ఉన్న పాత ఐడ్రాప్స్ వాడితే…కంటి చూపుపై దుష్ప్రభావం చూపుతుంది. కంటి వైద్యుడి సూచనల మేరకు ఐడ్రాప్స్ వాడాలి అంతేగాని సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదని గుర్తుంచుకోవాలి. వైద్యులు ఎక్కువడా కాటరాక్ట్ సర్జరీ చేసే సమయాల్లో, కాంటాక్ట్ లెన్స్ రీవెట్టింగ్ చేసే సమయాల్లో సాధారణ కంటి మార్పిడి సమయాల్లో ఐ డ్రాప్స్ వాడుతుంటారు.
డ్రై ఐస్ కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
డ్రై ఐస్ కోసం ఐ డ్రాప్స్ ఎక్కువగా వాడడం కంటే కొన్ని సహజ పద్దతుల ద్వారా కంటిని రక్షించుకోవచ్చు. వృత్తి రీత్యా కంప్యూటర్ తో వర్క్ చేయవలసి వస్తే ప్రతి రెండు గంటలకు కనీసం రెండు నిముషాలు కళ్ళు మూసి ఉంచాలి. కంప్యూటర్ స్క్రీన్ పై చూస్తూ ఉంటే రెప్పవాల్చడం కూడా తగ్గిపోతుంది. అలాగే మధ్యమధ్యలో అలా నడకకు వెళ్లి పచ్చటి చెట్లను చూడాలి. ఇలా చేయడం వలన కంటి అలసట తగ్గుతుంది. మధ్యమధ్యలో కంప్యూటర్ స్క్రీన్ కి విరామం ఇవ్వడం వలన కళ్లపై దుష్ప్రభావాలు అంతగా పడవు. పని ఒత్తిడి ఎక్కువగా ఉందని నిద్రను కూడా త్యాగం చేసి రాత్రి వేళల్లో కూడా పనిచేయడం వలన కళ్ళు మరింత అలసటకు గురవుతాయి. కాబట్టి, నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు.
మన కళ్లకు రోజూ కనీసం 8 గంటల నిద్ర అవసరమవుతుంది. అప్పుడే, కళ్ళు రిఫ్రెష్ అవుతాయి. ఐ డ్రాప్స్ ను తరచూ వాడకూడదు. కంట్లో ఏదైనా అసౌకర్యం తలెత్తితే కంటి వైద్యుడిని సంప్రదించాలి. కంటి ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదు. కళ్ళల్లో ఇష్టమొచ్చినట్లు డ్రాప్స్ ను వాడితే దుష్ప్రభావాల బారిన పడే ప్రమాదం ఉంది. ఐ డ్రాప్స్ ఎక్స్‌పైరీ డేట్ చూసుకోవాలి. వైద్యులు సూచించిన మేరకే డోస్ ఇవ్వాలి. రెండు అంతకన్నా ఎక్కువ చుక్కలు వాడాల్సివచ్చినప్పుడు రెండింటికి మధ్య కొంత వ్యవధి ఉండేలా చూసుకోవాలి.
అతిగా స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు వాడడం వల్ల కళ్లలో ఉండే నీరు ఇంకిపోయి కళ్లు పొడిబారిపోతున్నాయి. ఇలాంటి వారు ఇంటివద్ద అందుబాటులో ఉండే ఐ డ్రాప్స్ వాడుతూ శరీరం మీదకు తెచ్చుకుంటున్నారు. అలాకాకుండా కండ్లు పొడిబారిపోకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి