చాలా మంది ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం అనుకుంటూ ఉంటారు. శారీరక మానసిక ఆరోగ్యాలు వేరు వేరు అనుకుంటూ ఉంటారు. నిజానికి రెంటికీ మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈ రెంటిలో దేనికి సమస్య వచ్చినా రెండోది కూడా డీలా పడి పోతుంది. అందుకే హాయిగా, ఆరోగ్యంగా ఉండేందుకు పాటించాల్సిన జాగ్రత్తలేంటి..?
ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుకోవడం వల్ల హాయిగా, ఆరోగ్యంగా ఉండవచ్చు . ఇందుకు మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం అవసరం. మనం తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కొన్ని ఆహార నియమాలను పాటించాలి. రోజూ వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. శారీర వ్యాయామం కేవలం శరీరానికే కాదు, మనసుకు కూడా చాలా అవసరం. రోజుకు కనీసం 30 నిముషాల వ్యాయామం మంచి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది.
ఎప్పుడూ పనే కాదు… విశ్రాంతి కూడా మన ఆరోగ్యానికి చాలా అవసరం అని గుర్తించడం చాలా అవసరం. ముఖ్యంగా కంప్యూటర్ లాంటి వాటి మీద పని చేసే వారికి ఇది అత్యంత ఆవశ్యకం. వారంలో ఒక రోజు పని ఒత్తిడులకు దూరంగా, రోజువారీ ఆలోచనలను వదిలివేసి సరదాగా గడపాలి. వీలైతే మనకు ఇష్టమైన ఆటలపైగానీ, చిత్రలేఖనం వంటి వాటిపైగానీ దృష్టి పెట్టాలి. లేదా సంగీతం వినడం, సినిమాలు చూడడం వంటివీ చేయవచ్చు.
నిత్యం ఏదో ఒక పనిలో, ఏదో ఒక ఒత్తిడితో సతమతం అవుతూంటే మెదడుపై భారం పెరిగిపోతుంది. అందువల్ల అప్పుడప్పుడూ.. అన్ని రకాల పనులు, ఒత్తిళ్లకు దూరంగా సరదాగా గడపడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. బ్రిస్క్ వాక్ వల్ల శరీరం, మెదడు రెండూ చేతనంగా తయారవుతాయి. తీవ్ర అనారోగ్యాలు, ఆందోళన, ఒత్తిడిలు తొలగి ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ 40 నిమిషాల నడక అవసరం. నడక వల్ల ఎక్కువ గాలిని పీల్చుకుంటాం. దాంతో ఊపిరితిత్తులకు, మెదడుకు తగినంత ఆక్సిజన్ అంది అవి మెరుగ్గా పని చేస్తాయి. చమటతో ఒంట్లోని మలినాలు బయటికి వెళ్లిపోతాయి.
రోజూ కొద్దిసేపు నలుగురితో కలిసి నవ్వేయండి. శరీరంలోని కండరాలు నలభై నిమిషాలు వ్యాయామం చేసిన దానికంటే ఎక్కువ నవ్వడం వల్లనే కదులుతాయి. మెదడుపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా బిగ్గరగా మనస్పూర్తిగా నవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందట. చికాకుగా ఉన్నప్పుడు మనసుకు నచ్చిన పాట వినండి. వినడమే కాదు వీలైతే బిగ్గరగా పాడండి. ఇలా చేస్తే చికాకు తొలగిపోయి మనసు కాస్తయినా తేలిక పడుతుంది. ఈ దెబ్బకు బీపీ, ఒత్తిడి లాంటివి పారిపోతాయి.
ఆరోగ్యంగా జీవించాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు అంటున్నారు నిపుణులు. శరీరానికి అవసరమయ్యే డీ విటమిన్ పొందేందుకు ఉదయం కొంత సమయం శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలామంచిది. కంటి నిండా నిద్రపోయేలా చూసుకోవాలి. మంచి నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవసరం. కాబట్టి ప్రతిరోజు త్వరగా పడుకొని త్వరగా నిద్రలేవాలి.
వ్యాయామం చేయడం వల్ల నిరంతరం శక్తి కలిగి ఉంటారు. ముఖ్యంగా ఉదయం చేసే వ్యాయామం వల్ల యాక్టివ్ గా మరియు హెల్తీగా ఉంటారు. రోజూ కాసే ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ప్రశాంతత ముఖ్యం. యోగా, ధ్యానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండి ఆరోగ్యాన్ని పొందవచ్చు.
నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో వినోదం అందేలా చూసుకోవాలి. దీంతో ఒత్తిడి కొంత మేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అందరితో ఫన్నీగా మాట్లాడడం, జోక్స్ వినడం వంటివి చేస్తే ఒత్తిడి దూరమవుతుంది. నిజానికి ఇవన్నీ కష్టమైనవి కాదు. కాస్తంత శ్రద్ధగా ఆచరించాలి అంతే. వీటిని పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు.