అందోక వింత రోగం ఎవరికి ఎందుకు వస్తుందో.. ఎవరికి తెలియదు. కానీ క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా మంచి చిక్సిత అందించవచ్చు. అది దాదాపుగా క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసుకోవడంతో సమానం. మంచి జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా క్యాన్సర్ వచ్చే అపాయాన్ని తగ్గించుకోవచ్చు.
ఈ మధ్య కాలంలో మనిషిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ ముందు వరుసలో ఉంటుంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగానే వస్తున్నాయంటున్నారు వైద్య నిపుణులు. క్యాన్సర్ అనేది శరీరంలో ఎక్కడైనా వచ్చే అసాధారణమైన కణాల అనియంత్రిత పెరుగుదల. ఈ కణాలు సాధారణ శరీర కణజాలాలను చొరబాట్లు చేయగలవు. సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణ సమూహాలనే క్యాన్సర్లుగా పిలుస్తారు. క్యాన్సర్ మన శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉంది. శరీరం నుంచి ఏ ప్రాంతంలోనైనా రక్తం కారినా, గడ్డలుగా ఏర్పడిన కాన్సర్ లక్షణాలుగా గుర్తించాలి.
శరీరంలో నిర్దిష్టమైన భాగంలో కణాలు బాగా పెరిగి కణతుల్లా మారితే అప్పుడు ఆ భాగానికి క్యాన్సర్ సోకిందని అంటారు. అయితే అన్ని కణతులు క్యాన్సర్ కణతులు కావు. రోజులు గడుస్తున్నకొద్దీ కణతి సైజ్‌లో మార్పు వచ్చినా, నొప్పి ఉన్నా దాన్ని క్యాన్సర్ కణతిగా అనుమానించాలి. గత మూడు సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా క్యాన్సర్లు పొట్ట,పెద్ద పేగు,ప్రోస్టేట్,ఊపిరితిత్తులు,రక్త,కీడ్నీ తదితర క్యాన్సర్లు 35 శాతంగా ఉంది. రొమ్ము క్యాన్సర్ 25 శాతం, నోరు, గొంతు క్యాన్సర్ 20 శాతం, గర్భశయ ముఖద్వార క్యాన్సర్ 20 శాతం మందిలో వస్తుంది. అయితే చాలా వరకు క్యాన్సర్లను ఆరంభ దశలో గుర్తిస్తే చికిత్స చేయడం సులభతరమవుతుంది.
మన జీవనశైలితో పాటు మనం తీసుకునే ఆహారం ఈ క్యాన్సర్ వ్యాధికి ప్రధాన కారణం. తీసుకునే ఆహారపదార్థాల ద్వారా క్యాన్సర్ ను చాలా వరకూ నిరోధించుకోవచ్చు. పోషక విలువలున్న ఆహార పదార్థాలను నిత్యం తీసుకుంటూ ఉంటే… అందులోని పోషక గుణాలు క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. అప్పుడు ఆరోగ్యంగా ఉండొచ్చు. తాజా కూరగాయలు, పళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెరలు,నిల్వ ఉంచిన ఆహారాలకు దూరంగా ఉండాలి. శీతల పానీయాలు మానేయాలి. తాజా పండ్ల రసాలను త్రాగటం అలవాటు చేసుకోవాలి. వంశపారంపర్యంగా క్యాన్సర్ సంక్రమించే అవకాశాలున్నవాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఏ అనారోగ్య లక్షణమైనా మూడు వారాలకు మించి తగ్గకపోతే క్యాన్సర్ అయి ఉండొచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి.
క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చా.. అంటే దీనికి కచ్చితంగా సమాధానం దొరకదు. క్యాన్సర్ ను ఖచ్చితంగా నివారించే పద్దతి ఏదీ లేదు. కానీ కొన్ని మంచి అలవాట్లు ద్వారా ముందు జాగ్రత్త ద్వారా క్యాన్సర్ వచ్చే అపాయాన్ని కొంతవరకూ తగ్గించుకోవచ్చు. ధూమపానం, నికోటిన్ సంబంధించిన పదార్థాలకు దూరంగా వుండటం మంచిది. అలాగే క్రొవ్వు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, ముడి ధాన్యం, అధికంగా తీసుకోవాలి.
ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేయాలి. అధిక బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి. ఎండ వేళల్లో గొడుగు ధరించాలి. కాలుష్యం నుంచి వీలైనంత వరకూ దూరంగా ఉండాలి. జీవనశైలిలో మార్పులు చేసుకొని పోషకాహారం తీసుకోవాలి. ఎలాంటి కణుతులు, గడ్డలు కనిపించినా అశ్రద్ధ చేయకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ముందస్తుగా గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా క్యాన్సర్లను జయించొచ్చు.
ఆరోగ్యకరమైన జీవనశైలితో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల శరీరమే తనలో మొలకెత్తే క్యాన్సర్ కణాలను ఎప్పటికప్పుడు చంపేస్తుంది. కాబట్టి మంచి జీవనశైలిని అలవర్చుకోండి ఆరోగ్యంగా జీవించండి.