Breakfast – బ్రేక్ ఫాస్ట్ మిస్ చేస్తే ఇక అంతే సంగతులు

By manavaradhi.com

Published on:

Follow Us
Truth about Breakfast

రోజూ మనం తీసుకునే ఆహారంలో అత్యంత కీలక పాత్ర పోషించేది ఉదయం మనం తీసుకునే బ్రేక్ ఫాస్టే. రోజుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రారంభించాలంటే మంచి పోషకవిలువలున్న అల్ఫాహారం తీసుకోవడమూ ముఖ్యమే. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కొంత మందికి బ్రేక్ ఫాస్ట్ చేయడానికే టైముండదు. అసలు బ్రేక్ ఫాస్ట్ కంపల్సరీగా ఎందుకు తినాలి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి..?

నిద్రించే సమయంలో మన శరీరంలో జీవక్రియల ప్రక్రియ క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి, ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం వల్ల జీవక్రియలు ఉత్తేజితమవుతాయి. తిరిగి వేగవంతంగా పుంజుకుంటాయి. ఈ ప్రక్రియల వల్ల శరీరంలో క్యాలరీలు కరుగుతాయి. బరువు అదుపులో ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే శరీరానికి కావల్సిన శక్తి అందుతుంది. కాబట్టి మనం ఏ పని మీదైనా పూర్తిగా శ్రద్ద పెట్టొచ్చు.

బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల ఆకలితో చేసే పని మీద ఏకాగ్రత పెట్టలేకపోతారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ బరువును అదుపులో పెట్టుకోవాలంటే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా అవసరం. బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా అందుతాయి . మనం రెగ్యులర్ గా రోజూ తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ లో పీచు పదార్థాలు ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉండే పోషకవిలువలున్న ఆహారాలను తీసుకోవడం వల్ల గుండె సురక్షితంగా ఉంచుకోవచ్చు. అలాగే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో బ్యాలెన్స్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది.

బ్రేక్ ఫాస్ట్ తినడకపోవడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఎక్కువ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేయాలంటే..మెదడుకు మనం తీసుకునే ఆహారం నుంచి గ్లూకోజ్ అందాలి. అలాకాకుండా అల్పాహారం మానేస్తే మెదడు చురుగ్గా పనిచేయదు . ఫలితంగా చేపే పనిపట్ల ఆసక్తి తగ్గుతుంది. క్రమం తప్పకుండా అల్పాహారం తీసుకోకపోతే డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగడంలాంటి పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ హార్ట్ అటాక్ కు కారణమవుతాయి.

ప్రతి రోజూ ఉదయాన్నే ఓట్ మీల్ తీసుకోవడం వల్ల.. మలబద్దకము తగ్గుతుంది. మన శరీరానికి కావలిసిన పోషకాలు చాలా పుష్కలంగా లభిస్తాయి.అలాగే ఏదో ఒక రకం పప్పుతో కాకుండా రకరకాల పప్పులను కలిపి వండుకునే పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వటం మంచిది. నూనెతో చేసే పూరీల కంటే ఉదయాన్నే నూనె పెద్దగా లేని చపాతీల వంటివి , వాటిల్లోనూ ఆకుకూరలు వంటివి కలుపుకొని వండుకోవటం మంచిది.

టిఫిన్ అనగానే చాలామంది ఇంట్లో చేసుకోవడం ఎందుకులే అని బయట తినేస్తే పోలా అనుకుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. బయట తినే ఆహారంలో ఉప్పు, నూనెల మోతాదు ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇంట్లోనే తినడం మంచిది. ఉదయాన్నే లేచిన తర్వాత పొట్టంతా ఖాళీగా ఉంటుంది. ఈ సమయంలో కాస్తంత అల్పాహారం తీసుకోవడం ద్వారా తగిన శక్తి లభిస్తుంది. అదే విధంగా ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ద్వారా రోజంతా ఆకలి అదుపులో ఉంటుంది. మనం ఆరోగ్యం గా ఉంటాం…

Leave a Comment