మధుమేహం, రక్తపోటు ప్రస్తుతం మనల్ని పట్టిపీడిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య. రక్తపోటు కేవలం గుండెపైనే కాకుండా అన్ని అవయవాలపైన ప్రభావం చూపుతుంది. అందటి ప్రధానమైన రక్తపోటు మనలో రాకుండా ఉండాలంటే ఏంచేయాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రక్తపోటును నివారించుకోవచ్చు..?
రక్తపోటు.. చాపకింది నీరులా చుట్టేస్తున్న ఈ సమస్య… ప్రతి పది మందిలో ముగ్గురిని బాధపెడుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. జీవనవిధానం, ఆహారపుటలవాట్ల కారణంగానే రక్తపోటు సమస్య నానాటికి తీవ్రమవుతున్నది. కూర్చుని పనిచేయడం ఎక్కువ కావడంతో ఈ సమస్యతో బాధపడే వారి సమస్య కూడా ఎక్కువవుతున్నది. ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే శరీరభాగాలపై ప్రభావం చూపుతుంది. తలనొప్పి, నిద్రలేకపోవడం, చూపు మందగించడం, ఆలసట, గందరగోళం, చెవుల్లో ప్రతిధ్వనులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె కొట్టుకునే వేగం హెచ్చు తగ్గుదల వంటి లక్షణాలు కనిపిస్తాయి.
రక్తపోటు సమస్య రావడానికి ప్రధాన కారణం ఉప్పు. మనం తినే ఆహారాల్లో సహజసిద్ధంగా ఉప్పు ఉంటుంది. నిత్యం 6 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకుండా జాగ్రత్తపడాలి. ఉప్పు ఎక్కువగా ఉండే ప్రాసె్‌సఫుడ్, పిజ్జాలు, బర్గర్‌లు రెడిమెడ్ మాంసం, కూల్‌డ్రింక్స్, ఫ్రిజ్‌లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలను దూరం పెట్టాలి. కృత్రిమ చక్కెరలు కలిగిన పానీయాలను తీసుకోకుండా చూసుకోవాలి. నిద్రలో గురక వస్తున్నదంటే రక్‌డపోటు సమస్య వస్తున్నట్టుగా గ్రహించాలి. గురకను తగ్గించుకోవడం ద్వారా బీపీని అదుపులో పెట్టుకోవచ్చు. రక్తంలో ద్రవాలు బ్యాలెన్స్ గా ఉండేందుకు పొటాషియం, సోడియం చాలా అవసరం. అందుకని తాజా కూరగాయలు, పండ్లు, తక్కువ కొవ్వు కలిగిన డెయిరీ ఉత్పత్తులను తీసుకోవాలి. అరటిపండు, బ్రకోలి, పాలకూర, ఇతర ఆకుకూరల్లో పొటాషియం, సోడియం ఎక్కువగా లభిస్తుంది.
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నవారిలో కూడా రక్తపోటు సమస్య కనిపిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగి బీపీ ఎక్కువయ్యేందుకు దోహదపడుతుంది. నూనెలు ద్రవరూపంలో ఉన్న కొవ్వుల వాడకం క్రమ పద్ధతిలో ఉండేలా చూసుకోవాలి. నూనెలు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, ఆవకాయ, కారం ఊరగాయ వంటి వాటిని దూరంపెట్టాలి. మద్యం సేవించడం కూడా రక్తపోటును పెంచడానకి కారణమవుతుంది. పొగతాగడం వల్ల రక్తనాళాలు కుచించుకుపోయి రక్తపోటు రావడానికి కారణమవుతాయి. ఎర్రటి మాంసం, మీగడ, వెన్న, నూనె వంటి వాటికి దూరంగా ఉండాలి. టెన్షన్‌కు గురైన సమయంలో నచ్చినవారితో మాట్లాడాలి. మంచి సినిమా చూడాలి. పాటలు వినాలి.
జీవన విధానంలో మార్పుల ద్వారా రక్తపోటు రాకుండా జాగ్రత్త పడవచ్చు. మంచి ఆహారం తీసుకోవడం, మానసిక ప్రశాంతత ద్వారా రక్తపోటు సమస్య నుంచి బయటపడొచ్చు. రక్తపోటు కనిపించగానే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా సమస్య మరింత జటిలం కాకుండా చూసుకోవచ్చు.