పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఎదురుదాడి చేస్తే దీటుగా బదులిస్తాం… అవసరమైతే తమ అణ్వాయుధాలు సైతం వాడుతాం అన్న పాక్ ఉన్నట్టుండి కాల్పుల విరమణ అనే కాళ్ల బేరానికి ఎందుకు వచ్చింది?
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ లోని తొమ్మిది ప్రదేశాలపై భారత్ తీవ్ర ప్రతీకార దాడులు చేసింది.భారత్ చేపడుతున్న చర్యలు.. పాక్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో మేకపోతే గాంభీర్యం ప్రదర్శిచింది. రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీద్ జమాలీ అణు బూచిని భారత్‌కు చూపించి బెదిరించే యత్నం చేశారు. ఒక వేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే.. అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామని పేర్కొన్నారు. అలాంటి పాకిస్థాన్ ఒక్కసారిగా కాల్పుల విరమణ అనే కాళ్లబేరానికి ఎందుకు వచ్చింది? అప్పటిదాకా భారత్ – పాక్ ఘర్షణను పెద్దగా పట్టించుకోని అమెరికా ఉన్నపళంగా ఎందుకు రంగంలోకి దిగింది? పాకిస్థాన్ అణు స్థావరాలను భారత క్షిపణులు తాకడమే ఇందుకు కారణమా అంటే.. అవుననే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. పాక్ అణుబూచికి ఎట్టిపరిస్థితుల్లోనూ భయపడే ప్రసక్తే లేదన్న సందేశం ఇచ్చేందుకే ఆ దాడులను భారత్ కచ్చితత్వంతో నిర్వహించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మే 9 అర్ధరాత్రి, 10వ తేదీన పాకిస్థాన్‌లోని కీలక వాయుసేన స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశామని భారత్ ప్రకటించింది. పూర్తి స్వదేశీ ఆయుధాలతో దాడి చేసి 11 వాయుసేన స్థావరాలను దెబ్బతీసినట్లు తెలిపింది. వీటిలో ఒక దాడి పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రాంగణంలో జరిగినట్లు తెలుస్తోంది. పాక్ చెప్పుకొంటున్న ప్రధానబలం అణ్వస్త్రం. ఆ బలంపైనే దాడి చేస్తే దేశ నాశనం తప్పదని పాక్ సైనిక నాయకత్వం వెన్నులో వణుకుపుట్టి అమెరికాను ఆశ్రయించిందన్న వాదన వినిపిస్తోంది. ఈ వాదనల్లో నిజానిజాలను ఇటు భారత్ గానీ, అటు పాకిస్థాన్ గానీ నిర్ధరించలేదు. ఈ విషయంపై అంతర్జాతీయ మీడియా సహా సోషల్ మీడియాలో సైనిక వ్యవహారాల నిపుణులు చేసిన చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రావల్పిండిలోని నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ సమీపంలో ఇండియన్ ఆర్మీ ప్రిసిషన్ స్ట్రైక్స్ చేసింది. దానికి అతి చేరువలో పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోలు ఉంది. అణ్వాయుధాలను నియంత్రించడం, నిల్వ చేయడంలో దీని పాత్ర అత్యంత కీలకం. దీనికి అతి సమీపంలో దాడి చేయడమంటే పాకిస్థాన్ అణ్వాయుధాలను క్షణాల్లో భారత్ ధ్వంసం చేయగలదన్న సందేశం ఇచ్చినట్లే అని రాండ్ కార్పొరేషనుకు చెందిన డెరెక్‌జే గ్రోస్మన్ అనే మిలిటరీ వ్యవహారాల నిపుణుడు చెప్పారు. ఇది అన్ని లక్ష్యాల పైనా అత్యంత కచ్చితమైన దాడులను నిర్వహించే సత్తా భారత్‌కు ఉందని చెప్పడమేనని వివరించారు. అమెరికా జోక్యానికి ముందు భారత్, పాక్ ఘర్షణ అతిప్రమాదకరంగా ఉందని.. ఆ దాడుల తర్వాతే అమెరికా రంగంలోకి దిగి కాల్పుల విరమణ చేసుకోవాలని సర్దిచెప్పినట్లు ఆయన వెల్లడించారు.