ప్రస్తుత బిజీ ప్రపంచంలో మారుతున్న జీవన విధానాల కారణంగా ఆరోగ్యంతో పాటు జీవిత కాలం కూడా తగ్గిపోతోంది. వయసుపెరిగేకొద్దీ రోజురోజుకూ మారుతున్న ఆహారపు అలవాట్లు కారణంగా అనేకరకాల రోగాలు చుట్టుముడుతున్నాయి. అయితే వీటన్నింటికి ఒక్కటే సరైన పరిష్కారం అంటున్నారు వైద్యనిపుణులు. మనం నిత్యం మంచి ఆహరాన్ని తీసుకోవడం వల్ల మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు . ఎలాంటి ఆహారపు అలవాట్లు అలవరుచుకోవాలి.
ప్రస్తుతం జీవితం ఉరుకులు పరుగులమయమైపోతోంది. దీంతోపాటు ప్రతి మనిషి తమ తమ కార్యాలయాలలో పని ఒత్తిడికి గురవుతుంటారు. శారీరక ఒత్తిడితోపాటు, మానసిక పరమైన ఒత్తిడిని కూడా ఎదుర్కోక తప్పడం లేదు. దీంతో వారిలో కోపం, నిరాశా.. నిస్పృహలు చుట్టుముడుతుంటాయి. వీటి వలన వారి పని, ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. జీవితంలో భోజనం కాస్తా మొక్కుబడి కార్యక్రమంగా మారిపోయింది. దాంతో పోషకాహారం అందక పలు రకాల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.
సరైన ఆహారాన్ని ఎంపిక చేయడానికి అనేక కారణాలను లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చాలామందికి ఒక అపోహ ఉంటుంది. నాలుకకు రుచిగా ఉన్నవి మీ ఆరోగ్యానికి మంచిది కాదు అనేది వాస్తవం కాదు. ఒక్కోవ్యక్తికి ఒక్కో రకంగా పౌష్టికాహారం అవసరమౌతుంది. ఏదైనా సరే ఆహారాన్ని మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా తీసుకోవాలి. ప్రతిరోజూ ఒకే నిర్ణీత సమయానికి భోజనం చేయాలి. ఇలా చేస్తే మన శరీరంలో జీవక్రీయలన్ని సక్రమంగా జరుగుతాయి. వయసు పెరుగుతున్న ఎలాంటి ఆరోగ్యసమస్యలు తలెత్తవు.
వయసుపెరిగేకొద్దీ తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కోన్ని ఆహార నియమాలను పాటించాలి. తీపిపదార్థాలు, వేపుడు పదార్థాలు వీలయినంత వరకు తగ్గించుకోవాలి. తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినాలి. గంటకు ఒకసారి కొంతకొంత తినడం ఉత్తమం. దీనిద్వారా అసిడిటీకి దూరంగా ఉండవచ్చు. ఆహారంలో ఎక్కువగా సలాడ్స్ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఏదైనా జీర్ణంకాని పదార్థాలు మీ జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడుతుంటే ఈ సలాడ్స్ ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తాయి.
కడుపు నింపుకోవడానికి కాకుండా శరీరానికి శక్తిని అందివ్వడానికి మనం ఆహారం తీసుకోవాలి. వాతావరణ, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆహారం తీసుకోవాలి. బ్యాలెన్సింగ్ ఫుడ్ అన్నీ విధాలా శ్రేయస్కరం. మనం నిత్యం తీసుకునే ఆహారం, విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేడ్లు. ఇలా అన్నీ సమపాళ్లలో ఉండాలి. తీసుకునే ఆహారం ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు. కాలానుగుణంగా వచ్చే పండ్లూ, కూరగాయలు ఎంచుకోవాలి. అలాగే వెన్న తీసిన పాలూ, పాల పదార్థాలూ.. చిరుధాన్యాలు తీసుకోవాలి. అప్పుడే శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి.
తక్కువ తిన్నా, లేదా ఎక్కువ తిన్నా రెండూ ప్రమాదాలు కొని తెస్తాయి. కొంత మంది తక్కువ తిన్నా లావు అవుతుంటారు. మరి కొందరు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. దీనికి కారణం వారికి అందే పోషకాలు అనే చెప్పుకోవాలి. ప్రమాదకరమైన కొవ్వులతో పాటు, ఆహారంలో అవసరమైన కొవ్వులు కూడా ఉంటాయి. మంచి చేసే కొవ్వుల వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. అలాగే అనవసరమైన కొవ్వు శరీరంలో పేరుకు పోయి, స్థూలకాయంతో పాటు ఇతర రోగాలను తీసుకొస్తుంది. ఏ ఆహారం తీసుకున్నా ఎలా తీసుకోవాలన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడే ఆహారం శరీరానికి మేలు చేస్తుంది. ఒక్కోసారి ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ సరైన విధానంలో తీసుకోకపోవడం వల్ల అనారోగ్యాలకు కారణం అవుతుంది.
చక్కని పోషకాహారంతో పాటు వ్యాయామం లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు మేలు చేస్తాయి. ఉదయాన్నే నిద్ర లేవగానే అధికంగా నీరు తీసుకోవడం, నడక లాంటి వ్యాయామాలు చేయడం, తిన్న తర్వాత కాస్త దూరం నడవడం, నూనె, మసాలా, కారం, ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. చిన్ననాటి నుంచే ఆహారపు అలవాట్లు ఒక క్రమపద్ధతిలో ఉంటే అది మన చక్కని పునాదిగా ఉపయోగపడుతుంది. శరీరానికి అందాల్సిన పోషకాలు, విటమిన్లు సమపాళ్లలో అందించినప్పుడు మనం ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంటామని సెలవిస్తున్నారు పోషకాహార నిపుణులు.