మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు కొన్ని రకాల సమస్యలు ఎదురౌతూ ఉంటాయి. అలాంటి వాటిలో జలుబు కూడా ఒకటి. జలుబు చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే కొంత మందిలో ఇది ఒక పట్టాన తగ్గదు. ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.
మన జీవితాలలో మనందరం ఎప్పుడోఅప్పుడు జలుబును అనుభవించే ఉంటాం. జలుబును ఎదుర్కొనే రోగనిరోధక శక్తి మనలో ఎవరికీ ఉండదు. 200 వైరస్లు ఒకేసారి అటాక్ చేస్తే వచ్చేదే జలుబు. దీంతో ముక్కు దిబ్బడ, గొంతులో గరగరా, శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు ఏర్పడతాయి. దగ్గుతో పాటు తుమ్ములు ఎక్కువగా వస్తాయి. ఇంట్లో ఒకరికి వచ్చిందంటే అది త్వరగా ఇతర సభ్యులకు కూడా అంటుకుంటుంది.
జలుబు అనేది బ్యాక్టీరియా లేదా వైరస్ ఇన్ఫెక్షన్ వలన శరీరానికి సోకుతుంది. సాధారణంగా, జలుబు చేసినప్పుడు, ఇతర లక్షణాలైన జ్వరం,తలనొప్పుల వంటి వాటితో పోలిస్తే తగ్గటానికి ఎక్కువ సమయం పడుతుంది. జలుబు చేసినప్పుడు, రోజువారీ పనులు చేసుకోటం కొంచెం కష్టమవుతాయి. తలనొప్పి, ముక్కు కారుతుండటం, శ్వాస తీసుకోవటంలో కష్టాలు, ముక్కులో దురద,ముక్కుదిబ్బడ, అలసట వంటి లక్షణాలు ఉంటాయి. పిల్లల్లో రోగనిరోధకశక్తి బలహీనంగా ఉండటం వల్ల వారు తరచుగా జలుబుకి గురౌతారు.
జలుబు అనేది ప్రధానంగా వైరస్ కారణంగా వచ్చే సమస్య. దీనికి రైనో వైరస్ వర్గానికి చెందిన ఎన్నో రకాల వైరస్‌లు కారణం కావచ్చు. పైగా ఈ వైరస్‌లు ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూ ఉంటాయి. కొన్ని కొత్తగానూ పుట్టుకొస్తుంటాయి. అందుకే అందరినీ తరచూ జలుబు వేధిస్తూనే ఉంటుంది. సాధారణంగా జలుబు ఒక వారం పాటు బాధిస్తుంది, తర్వాత చాలా వరకూ దానంతట అదే తగ్గిపోతుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలి.
తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు తప్పనిసరిగా నోటికి చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. సాధ్యమైనంత ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవాలి. వేడినీళ్లలో ఉప్పు కలిపి పుక్కిలించి ఉమ్మివేయడం ద్వారా జలుబు నుంచి ఉపశమనంగా ఉంటుంది. ఇది శ్లేష్మ స్థరాన్ని శుభ్రపరిచే దిశగా పనిచేస్తుంది. నెమ్మదిగా గొంతునొప్పి, ముక్కు దిబ్బడ తగ్గించడం లో కీలకపాత్ర పోషిస్తుంది.
జలుబు నుండి ఉపశమనం పొందడానికి ఎంత ప్రయత్నించినా, విశ్రాంతి లేనిదే ఫలితం ఉండదు. రోజులో ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. పుస్తకాన్ని చదవండి, సినిమాలు చూడండి లేదా కళ్లు మూసుకుని డ్రీమ్‌ల్యాండ్‌లోకి వెళ్లండి. డీప్ బ్రీదింగ్ ఎక్సర్‌సైజ్‌ల వల్ల కూడా కఫం బయటకు వచ్చేస్తుంది. యోగాలో ప్రాణాయామం మేలు చేస్తుంది. జలుబును తగ్గించుకోటానికి నీటిని తాగటం అనేది చాలా సులువైన పద్దతి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
గోరువెచ్చగా ఉండే నీరు గొంతు భాగంలో కలిగే ఇన్‌ఫక్షన్‌ను తగ్గిస్తుంది. వేడిగా ఉండే జావ, సూప్‌లు లాంటి ద్రవ పదార్థాలు తాగాలి. వెల్లుల్లి, అల్లం.. ఇవన్నీ కూడా ముక్కు దిబ్బడను తగ్గించడంతో పాటు, జలుబు చేసిన సమయంలో రిలీఫ్‌గా ఉండేందుకు తోడ్పడతాయి. రోజుకు రెండు సార్లు విక్స్ లేదా పసుపు వేసుకొని ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గడంతో పాటు గొప్ప రిలీఫ్ వస్తుంది.
సాధారణంగా జలుబు దానిఅంతటఅదే తగ్గిపోతుంది. దీనికంటూ ప్రత్యేకించి చికిత్స అవసరం లేదు. కానీ తగ్గకుండా మరీ ఎక్కువ రోజులు వేధిస్తుంటే మాత్రం అలసత్వం వహించకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలి.