Thyroid: అసలేంటీ థైరాయిడ్‌.. గుర్తించడం ఎలా?

By manavaradhi.com

Updated on:

Follow Us
Thyroid

థైరాయిడ్ గ్రంథి ఇది శరీరంలోని జీవక్రియ ప్రక్రియలను నియంత్రిస్తుంది. సమతుల్య శరీర ఉష్ణోగ్రత, హార్మోన్ల పనితీరు మరియు బరువు నిర్వహణ ఈ గ్రంథిలో కొన్ని ముఖ్యమైన విధులు. థైరాయిడ్ గ్రంధికి సాధారణంగా రెండు రకాల సమస్యలు ఉంటాయి. హైపోథైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజం. థైరాయిడ్ గ్రంధితో సమస్యలు ఉంటే, అది శరీరం యొక్క మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

ఈ మధ్యకాలంలో థైరాయిడ్ సమస్యలు చాలామందిలో కనబడుతున్నాయి. థైరాయిడ్ గ్రంథి పనితీరులో లోపాల వలన కలుగుతున్న సమస్యల కోసం ఆసుపత్రికి వెళితే…అసలు విషయం బయటపడుతున్న సందర్భాలు అనేకం. మెడ భాగంలో ముందువైపు సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంథి థైరాయిడ్ హార్మోనును స్రవిస్తుంది. ఈ హార్మోను మన శరీరంలోని ప్రతి కణంపైన ప్రభావాన్ని చూపి మన శరీరంలో అనేక పనులు సవ్యంగా జరిగేలా చేస్తుంది. థైరాయిడ్ హార్మోను ఉత్పత్తి ఎక్కువ, తక్కువ కాకుండా తగినంత ఉండాలి. అలా లేనప్పుడు దాని పనితీరులో లోపాలు ఏర్పడి అనేక సమస్యలు చుట్టుముడతాయి.

అవసరమైన దానికన్నా థైరాయిడ్ హార్మోను ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నపుడు అలాంటి పరిస్థితిని హైపర్ థైరాయిడిజం అని, మామూలుగా ఉండాల్సిన స్థాయికన్నా తక్కువగా థైరాయిడ్ హార్మోను ఉన్నపుడు హైపో థైరాయిడిజం అని అంటారు. ఈ రెండు సందర్భాల్లోనూ పలురకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. హైపర్ థైరాయిడిజం ఉన్నపుడు గుండెకొట్టుకునే వేగం పెరగటం, గుండెలయ సక్రమంగా లేకపోవటం, చెమట పట్టటం, చేతుల్లో వణుకు, విరేచనాలు కావటం, జుట్టు ఊడిపోవటం, బరువు కోల్పోవటం, ఆందోళన, క్రమం తప్పిన రుతుస్రావం లాంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నపుడు అశ్రద్ధ చేయకుండా వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

హైపో థైరాయిడిజం ఉన్నప్పుడు కూడా కొన్నిసమస్యలు ఉంటాయి. రక్తహీనత ఏర్పడటం, రుతుస్రావం తక్కువగా ఉండటం, నిద్రమత్తు, అలసట, నీరసం, బరువు పెరగటం, మొహం ఉబ్బటం, ఏకాగ్రత లోపించడం, గోళ్లు పెళుసు బారటం, మలబద్దకం, చర్మం పొడిబారి దురదలు రావటం లాంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదింఛాలి.

థైరాయిడ్ విషయంలో గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీరిలో హైపో థైరాయిడిజమ్….అంటే థైరాక్సిన్ హార్మోను తక్కువగా స్రవిస్తే ప్రసవం విషయంలో సమస్యలు తలెత్తవచ్చు. పుట్టిన పిల్లలలో బుద్ది వికాసం లోపించే అవకాశం కూడా ఉంటుంది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యరీత్యా కాబోయే తల్లులు థైరాయిడ్ పరీక్షని చేయించుకోవటం మంచిది. పిల్లలు కావాలని అనుకుంటున్న మహిళలు సైతం తమకు థైరాయిడ్ లేదని నిర్దారించుకోవటం మరింత ప్రయోజనకరంగా చెప్పవచ్చు.

నిస్సత్తువ, బరువు పెరగటం, చలి తట్టుకోలేక పోవటం.హైపోథైరాయిడిజమ్‌ అనగానే ఇలాంటి లక్షణాలే గుర్తుకొస్తాయి. ఇవి అందరిలో ఒకేలా ఉండాలనేమీ లేదు. కొందరిలో.. ముఖ్యంగా వృద్ధుల్లో ఎలాంటి లక్షణాలు లేకపోవచ్చు. ఇంకొందరిలో భిన్నమైన లక్షణాలూ ఉండొచ్చు. కొన్ని వృద్ధాప్య లక్షణాలుగానూ కనిపించొచ్చు. వీటిని పోల్చుకోగలిగితే సమస్య ముదిరిపోకుండా, ఇబ్బందులు పడకుండా చూసుకోవచ్చు. వృద్ధుల్లో హైపోథైరాయిడిజమ్‌కు అధిక కొలెస్ట్రాల్‌ ఒక్కటే సంకేతం కావొచ్చు. చాలాసార్లు దీన్ని కొలెస్ట్రాల్‌ సమస్యగానే పొరపడుతుంటారు. థైరాయిడ్‌ హార్మోన్లు తగినంత ఉత్పత్తి కాకపోతే కాలేయం కొలెస్ట్రాల్‌ను సరిగా విడగొట్టలేదు. అకారణంగా కొలెస్ట్రాల్‌ పెరుగుతుంటే థైరాయిడ్‌ పరీక్ష చేయించటం మంచిది.

థైరాయిడ్‌ హార్మోన్ల మోతాదులు తగ్గితే గుండెకు తగినంత రక్తం అందదు. గుండె కండర సామర్థ్యం, కొట్టుకునే వేగమూ తగ్గుతాయి. ఇవి గుండె వైఫల్యానికి దారితీయొచ్చు. పంపింగ్‌ వ్యవస్థ బలహీనపడటం వల్ల గుండెకు చేరుకోవాల్సిన రక్తం సిరల్లోనే ఉండిపోవచ్చు. ఊపిరితిత్తుల్లో రక్తం, ద్రవాలు పోగుపడొచ్చు. దీంతో ఆయాసం, పాదాల వాపు, బలహీనత, నిస్సత్తువ వంటి గుండె వైఫల్య లక్షణాలు కనిపిస్తాయి.హైపోథైరాయిడిజమ్‌ మూలంగా పేగుల కదలికలు నెమ్మదిస్తాయి. దీంతో మల పదార్థం సరిగా ముందుకు కదలక మలబద్ధకం తలెత్తుతుంది. అరుదుగా కొందరికి విరేచనాలూ పట్టుకోవచ్చు.

థైరాయిడ్ పనితీరులో వచ్చే మార్పులు చాలారకాల సమస్యలను సృష్టిస్తాయి. అయితే థైరాయిడ్ గ్రంథిని గురించిన అవగాహన ఉంటేనే ఆ సమస్యలు దాని పనితీరులో లోపం వలన కలుగుతున్నాయని అర్థమవుతుంది. థైరాయిడ్ గ్రంథి వాపు కనబడుతున్నా…నిర్లక్ష్యం చేయకుండా డాక్టరుని సంప్రదించి చికిత్స తీసుకోవటం ఉత్తమం.

Leave a Comment