Health Tips : చలికాలంలో సాధారణ జలుబు – తీసుకోవలసిన జాగ్రత్తలేవి…?

By manavaradhi.com

Published on:

Follow Us
common cold in winter

శీతాకాలం వచ్చిందంటే చాలు… గొంతులో మంట, ముక్కుదిబ్బడ, జ్వరం, తలనొప్పి, తుమ్ములు, వణుకు, శరీర నొప్పులు, నీరసం.. ఇవన్నీ సర్వసాధారణం. మరీ ముఖ్యంగా ఈ కాలంలో జలుబు నుంచి తప్పించుకోవడం అసాధ్యం. జలుబుకు మందులు వాడ్డం వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుంది. మునుపెన్నడూ లేనంతగా ఈ మధ్యకాలంలో… శీతాకాలంలో జలుబు సమస్య బాగా పెరిగింది. దీనికి ఆహార, వ్యాయామాల పట్ల నిర్లక్ష్యంతో పాటు… నిద్రలేమి కూడా ప్రధాన కారణం. ఇవే గాకుండా… పెరుగుతున్న వాయుకాలుష్యం మరో కారణం. ఈ స్థితికి వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం మూలకారణం. అయితే ఈ పరిణామాలన్నీ శీతాకాలంలోనే కనిపించడానికి ఎన్నో కారణాలు దోహదం చేస్తాయి.

శీతాకాలంలో మంచు కురవడం వల్ల వాతావరణంలో తేమశాతం పెరుగుతుంది. దీంతో వాయుకాలుష్యం అధికమౌతుంది. ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఫలితంగా వ్యాధికారక సూక్ష్మజీవులు విజృంభిస్తాయి. దీంతో జలుబు, దగ్గు తదితర వ్యాధులు ఎక్కువగా బాధిస్తాయి. జలుబు రావడానికి 350 రకాల వైరస్ లు కారణమౌతాయి. ఇవి ఏటేటా తమ స్వరూప స్వభావాలను మార్చుకుంటూ ఉంటాయి. అందుకే జలుబుకు మందు తయారు చేయడం సాధ్యం కాలేదు. ఒకవేళ తయారు చేసినా… ఒకేసారి అన్ని రకాల మాత్రలు వేసుకోవడం సాధ్యం కాదు. అందుకే వైద్యశాస్త్రానికి జలుబు అందనంత ఎత్తులోనే ఉంటోంది. దేనికీ లొంగకుండా మనిషిని సతమతం చేస్తూనే ఉంది. శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. సూర్యుడు ఉండే సమయం కూడా బాగా తక్కువ. ఫలితంగా విటమిన్ డి తక్కువగా ఉండడం వల్ల జలుబు వ్యాపిస్తుందనేది ఒక వాదన.

శీతాకాలంలో జలుబు ఓ సాధారణ సమస్యగా భావించి, చాలా మంది నిర్లక్ష్యంగా ఉండిపోతారు. మరీ ఎక్కువగా ఉంటే… మెడికల్ షాప్ నుంచి టాబ్లెట్లు తెచ్చుకుని సొంత వైద్యం మీద ఆధారపడుతుంటారు. నిజానికి సమస్య ఏమిటన్న విషయాన్ని వైద్యులు నిర్ధారించిన తర్వాతే దానికి తగిన యాంటిబయాటిక్ ను వారు సూచిస్తారు. అంతేగానీ… తమకు తాముగా యాంటిబయాటిక్స్ వాడడం వల్ల ఫలితం ఉండకపోగా… అనేక దుష్ప్రభావాలు ఎదురయ్యే ఆస్కారం ఉంది. అనవసరంగా యాంటిబయాటిక్స్ వాడుతూ ఉండడం వల్ల… బాక్టీరియా వ్యాధినిరోధకతను పెంచుకుని చివరకు మందులు పనిచేయడం మానేస్తాయి. సీజన్ లో ఎప్పుడే ఒకసారి జలుబు చేయడం సహజమే. కానీ తరచూ జలుబు వేధిస్తుంటే మాత్రం డాక్టర్ ను కలవాల్సిందే. సైనస్ సమస్య పెరగడానికి ప్రధాన కారణం జలుబును నిర్లక్ష్యం చేయడమే. మందులు వాడిన తర్వాత జలుబు నుంచి కాస్త ఉపశమనం కలగగానే చాలా మంది మందులు వాడ్డం ఆపేస్తారు. ఇలా చేయడం వల్ల జలుబు పూర్తిగా తగ్గకపోగా… ఆ ప్రభావం తర్వాత కనిపిస్తుంది. జలుబుకు సంబంధించిన వైరస్ శరీరలోనే తాత్కాలిక విశ్రాంతి స్థితిలో ఉండి, మళ్ళీ దానికి అనుకూల వాతావరణం రాగానే తిరిగి విజృంభిస్తుంది.

శీతాకాలంలో వాతావరణ పరిస్థితులకు తట్టుకుని అనారోగ్యాల పాలుకాకుండా ఉండాలంటే… కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి.

  • చల్లగాలి తగలకుండా తలకు క్యాప్, చేతులకు గ్లౌజుల లాంటివి ధరించాలి.
  • గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలి. అతిగా వేడి లేదా చల్లని నీటిని వాడరాదు.
  • ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారానికి, శీతల పదార్థఆలకు దూరంగా ఉండాలి.
  • కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల జోలికి వెళ్ళకూడదు.
  • ప్రయాణాల్లో కాలుష్యం బారిన పడకుండా హెపా ఫిల్టర్ లను వినియోగించడం మేలు.
  • వాతావరణంలో మంచు, కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు వ్యాయామం లాంటివి తగ్గించాలి. అదే విధంగా బయట తిరగడం కూడా తగ్గించాలి.
  • విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.

స్వీయ శుభ్రతను పాటించడం ద్వారా జలుబు నుంచి మంచి ఉపశమనాన్ని పొందవచ్చు. చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. అపరిశుభ్రమైన చేతులతో కళ్ళు, ముక్కు నలుపుకోవడం లాంటివి చేయకూడదు. అదే విధంగా జలుబు ఉన్న వారికి షేక్ హ్యండ్ ఇవ్వడం, వారితో ఎక్కువ సేపు గడపడం లాంటివి చేయకూడదు. ముఖానికి తొడుగులు ధరించడం వల్ల కూడా కాస్తంత ఉపశమనాన్ని పొందవచ్చు. మనం వాడే దుస్తులు, కర్చీఫ్, టవల్స్ లాంటి వాటిని ఎప్పటికప్పుడు ఉతుకుతూ ఉండాలి. ఒకలి తువ్వాళ్ళు, దుస్తులు మరొకరు వాడడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉంది గనుక చాలా జాగ్రత్తగా ఉండాలి.

Leave a Comment