మన బిఎమ్ఐ సరిగ్గా ఉంటేనే మనం ఎత్తుకు తగ్గ బరువు ఉన్నట్టు లెక్క. ఎత్తుకు తగ్గ బరువు ఎందుకు ముఖ్యమంటే అధిక బరువు మన శరీరంలో ఎన్నో మార్పులకు కారణమవుతుంది. ఈ మార్పు కొన్నిసార్లు మన శరీరానికి నష్టం కలిగించవచ్చు. బరువు ఎక్కువగా ఉండటం వల్ల ముఖ్యంగా బిపి, షుగర్ వంటి సమస్యలు మనకు వలవేస్తాయి. ఆ సమస్యల వలలో చిక్కుకోకూడదంటే ముందుగా చేయవలసింది శరీర బరువుని అదుపులో ఉంచుకోవడం. శరీర బరువుని అదుపు చేయలేక చాలా మంది సతమతమవుతుంటారు. చిట్కాలు, వ్యాయామాల వల్ల ఫలితం లేక శరీరంలో కొవ్వుని తీసివేసే ప్రక్రియ గురించి ఆలోచిస్తారు. అలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతుంది లైపోసక్షన్ .
అధిక బరువు…ఇది నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య. జనాభాలో 30 శాతం మందిని పట్టి పీడిస్తున్న సమస్య. దీన్ని ఆరోగ్య ఉపద్రవంగా వర్ణించడానికి ముఖ్య కారణం శరీరంలోని అన్నీ రోగాలకు, జబ్బులకు ఇదే మూల కారణం. ఈ సమస్య బారిన ఇంతమంది ఎందుకు పడుతున్నారంటే రోజు రోజుకీ మారిపోతున్న మన ఆహారపు అలవాట్లు, జీవనశైలే ముఖ్య కారణం అని చెప్పుకోవాలి. జీవన శైలి గాడి తప్పడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి తత్ఫలితంగా ఇతర శారీరక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. టైప్ 2 డయబెటిస్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు, నిద్రలేమి సమస్యలు మరియు గుండెపోటు వంటి జబ్బులు నేడు చాలా మందిని బాధపెడుతున్నాయంటే దానికి ముఖ్య కారణం ఊబకాయం లేదా అధిక బరువు. ఒక్కమాటలో చెప్పాలంటే ఊబకాయం అనేది సర్వరోగాలకు మూలకారణం. ఇటువంటి జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే శరీర బరువును అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే అధిక బరువుని తగ్గించుకోడానికి ఎన్నో ప్రత్యామ్నాయాలను ఆచరించి విఫలమైనవారు… కృత్రిమంగా శరీరంలోని కొవ్వుని తీసివేసే లైపోసక్షన్ వైపు మొగ్గు చూపుతున్నారు.
చూషణ ప్రక్రియ ద్వారా శరీరంలోని వివిధ ప్రాంతాల్లో పేరుకుపోయిన కొవ్వుని తీసివేయడానికి ఉపయోగపడేదే లైపోసక్షన్. ఆహార నియమాలకు, వ్యాయామాలకు కరగని కొవ్వుని అలాగే పొత్తికడుపు, తొడలు, నడుము, పిరుదులు మరియు మోచేతులు మొదలైన భాగాల్లో పేరుకుపోయిన కొవ్వుని ఈ ప్రక్రియ ద్వారా తొలగిస్తారు. అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, బిపి, షుగర్, మరియు గుండె సంబంధిత జబ్బులతో బాధపడుతున్న వారు ఈ చికిత్సకు దూరంగా ఉండటం మంచిది. ఇటువంటి వారు ఈ చికిత్స చేయించుకున్నట్టయితే అది వారిలో ప్రమాద స్థాయిని పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రొసీజర్ చేయించుకున్న తరువాత కలిగేందుకు అవకాశం ఉన్న దుష్ప్రభావాలనూ ఒకసారి చూద్దాం. కొవ్వుని తీసేయడం వల్ల చర్మం వదులుగా అవుతుంది. చర్మం క్రింది భాగాల్లో నీరు చేరవచ్చు. కొవ్వుని తొలగించిన భాగాల్లో చర్మం తిమ్మిరి పట్టవచ్చు. చర్మానికి ఇన్ఫెక్షన్ సోకవచ్చు. ముక్కలుముక్కలుగా మారిన కొవ్వు రక్తనాలాల్లోకి, మెదడులోకి లేదా కిడ్నీలలోకి ప్రవేశించి ఆయా వ్యవస్థల పనితీరుని దెబ్బతీయవచ్చు.
శరీరంలోని చిన్న చిన్న భాగాల్లో కొవ్వుని తొలగించడానికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. లైపోసక్షన్ చేయించుకున్న తరువాత మళ్ళీ బరువు పెరిగినట్టైతే ఇంతకుముందు భాగాల్లో కాకుండా శరీరంలోని ఇతర భాగాల్లో కొవ్వు చేరవచ్చు. ఈ సర్జరీ తరువాత శరీర ఆకృతిలో కొంత పెరుగుదల ఉంటుంది. ఈ వాపు కొన్ని వారాలు లేదా నెలల వరకు ఉండవచ్చు. వాపు తగ్గిన తరువాత శరీరం మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది. లైపోసక్షన్ సర్జరీ యొక్క పూర్తి ఫలితాలు సర్జరీ జరిగిన వెంటనే కనిపించకపోవచ్చు. కనీసం ఆరు నెలల తరువాతనే దీని తాలూకు రిజల్ట్ ను మనం గమనించవచ్చు. లైపోసక్షన్ సర్జరీ తరువాత చర్మం కొంత వదులుగా అవుతుంది. ఆయా వ్యక్తుల చర్మం యొక్క స్వభావాన్ని బట్టి చర్మం బిగుతుగా అవుతుంది. యుక్తవయసులో ఉన్నవారి చర్మం మిగతావారికంటే కొంత తొందరగా బిగుతుగా మారే అవకాశం ఉంటుంది. చివరిగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే లైపోసక్షన్ సర్జరీ శరీరంలో కొవ్వుని తగ్గించుకోడానికి మాత్రమే, శరీర బరువుని తగ్గించుకోడానికి ఇది ప్రత్యామ్నాయం కాదు.
చేత్తో నోట్లో వేసుకున్నంత ఈజీగా శరీరంలోని కొవ్వుని తీసివేయలేము. సర్జరీలతో కొవ్వుని తీసేయడమనేది అంత సులువైన పని కాదు మరి. అందుకే సహజంగా ఆహార నియమాలను పాటిస్తూ చక్కని జీవన శైలిని అలవర్చుకోడం ద్వారానే వీలైనంత వరకు అధిక బరువుని నియంత్రణలో ఉంచుకోవాలి. మరీ లావైపోతున్నాము కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది అని నిర్ధారణకు వచ్చినపుడే లైపోసక్షన్ వంటి కృత్రిమ చికిత్సల ద్వారా శరీరంలో కొవ్వుని తగ్గించుకోవాలి. లైపోసక్షన్ పుణ్యమా అని కొవ్వు తగ్గింది కదా అని మళ్ళీ ఆహార నియమాలను గాలికొదిలేస్తే అంతే సంగతులు.