Chipped Teeth – ప్రమాదాల్లో దంతాలు విరిగినప్పుడు ఎలా వాటిని సరిచేసుకోవచ్చు?

By manavaradhi.com

Published on:

Follow Us
Chipped Teeth

కొంతమందికి బైక్ మీద వెళుతున్నప్పుడు యాక్సిడెంట్ అయి ముఖానికి దెబ్బ తగిలి .. ముందు పళ్లు విరుగుతాయి. వాటిలో కొన్ని సగానికి విరిగిపోతే మరికొన్ని చిగురుదాకా విరిగిపోవచ్చు. ఇలా దంతాలు విరిగినందువల్ల నోరు తెరవాలంటే సిగ్గుగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఎదురైనపుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి.

చాలామంది రోడ్డు ప్రమాదాల్లో , ఆటల్లో ముఖానికి దెబ్బలు తగలడం వల్ల పళ్లు విరగడం, ఊడిపోవడం జరుగుతుంది. పళ్లు కొద్దిగా విరిగినా, సగానికి చిట్లినా కంగారు పడాల్సిన పని లేదు. వీటికి లామినేట్స్ ద్వారా గాని, క్రౌన్స్ ద్వారా గాని పూర్వ స్థితికి తీసుకురావచ్చు. ఇవి పంటి రంగులో కలిసిపోతాయి. వరుసగా ఒకటి కన్నా ఎక్కువ పళ్లు విరిగిపోతే ఆ ఖాళీని ‘బ్రిడ్జెస్‌’ ద్వారా పూరిస్తారు. అటుపక్క, ఇటుపక్క ఉండే దంతాల ఆధారంగా వాటిని అంటిపెట్టుకుని ఉండేలా వీటిని రూపొందిస్తారు. అయితే వీటిని కట్టుడుపళ్లలా ఎప్పుడు పడితే అప్పుడు తొలగించటానికి వీలుకాదు. ఇవి చిగుళ్ల వ్యాధి రాకుండా కాపాడుతుంది. నోటి శుభ్రతను పాటిస్తే ఇవి చాలా కాలం బాగుంటాయి.

విరిగిన పళ్లకు క్రౌన్స్‌ కూడా బాగా ఉపయోగపడతాయి. ఇవి పన్ను ఆకారంలో తొడుగులాగా ఉంటాయి. అసలు పన్ను సైజుని అన్ని వైపుల నుంచి కొద్దిగా తగ్గించిన తర్వాత.. దానిపైన వీటిని గట్టిగా అమరుస్తారు. ఈ క్రౌన్స్‌తో పళ్ల ఆకారం, పరిమాణం, బలం, అందం మెరుగవుతాయి. వీటిల్లో పింగాణీ అతికిన లోహం, రెజిన్‌, సెరామిక్‌ వంటి చాలా రకాలున్నాయి. ఒకసారి ఈ క్రౌన్‌ను అమరిస్తే సాధారణంగా 10-15 ఏళ్ల వరకూ సమస్య ఉండదు.

కొన్నిసార్లు దంతాల కొసలు మాత్రమే విరిగినప్పుడు వైద్యులు కేవలం గంటలోపే విరిగిన పంటి కొనల్ని కాంపోజిట్ మెటీరియల్ తో బిల్డప్ చేస్తారు. పన్ను సగం విరిగినప్పుడు కూడా తొడుగు వేయడం ద్వారా పంటిని మామూలు ఆకారంలోకి తీసుకురావచ్చు. కృత్రిమ దంతాలను అమర్చుకోవడానికి రోజులు- వారాలు వేచి ఉండాల్సిన పనిలేదు. పంటి ముక్కలను తీసేసిన సిట్టింగ్‌లోనే ఇంప్లాంట్ అనబడే టైటానియం స్క్రూను పంటి వేరు భాగంలోని ఎముకలోకి బిగించుకుని దాని పైన కృత్రిమ దంతాన్ని అమర్చే అవకాశం ఉంది.

ఇటీవలి కాలం వరకు దంతాలకు క్యాప్‌లు వేసినప్పుడు కాని, కృత్రిమదంతాలను అమర్చినప్పుడు కాని అవి మిగిలిన పంటిరంగులో కలిసిపోకుండా చూడగానే పెట్టుడు పళ్లు అని తెలిసిపోయేవి. కానీ ఈ సమస్యకు కూడా ఆధునిక దంతవైద్యంలో పరిష్కారం లభిస్తోంది. అవసరమయితే ముందు పళ్లను స్మైల్ డిజైనింగ్ ద్వారా సరిచేసి ముఖానికి అదనపు ఆకర్షణ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ కృత్రిమ దంతాల తయారీకోసం అత్యాధునిక జర్కోనియం టెక్నాలజీ వాడడం ద్వారా అలర్జీ రావడం, మెటల్ వల్ల చిగుళ్లు నల్లబడడం, మందంగా ఉండడం వంటి సమస్యలు లేకుండా సహజసిద్ధమైన పళ్లలాగానే కనపడతాయి. దంత వైద్యంలో అత్యాధునిక చికిత్సా విధానం ‘ఈస్తటిక్ డెంటిస్టీ’ అని పేర్కొనవచ్చు. ఈ ప్రక్రియలో డెంటల్ ఇంప్లాంట్స్‌ను అమరుస్తారు.

గతంలో దంతాలను తొలగించవలసి వచ్చినప్పుడు ఆ భాగంలో కృత్రిమ దంతాలను అమర్చేవారు. పూర్తిగా దంతాలు లేనివారికి తీసి పెట్టుకోవడానికి ఉపకరించే డెంచర్స్‌ను అమర్చేవారు. ఒకటి, రెండు దంతాలను అమర్చాల్సి వచ్చినప్పుడు ప్రక్కనున్న దంతాల ఆధారంగా బ్రిడ్జిని తయారుచేసి అమర్చేవారు. ఇంప్లాంట్స్ ప్రక్రియ అందుబాటులోకి వచ్చిన తొలి నాళ్ళల్లో నోటిలోని వెనుక భాగంలో దంతాలను అమర్చడానికి దీనిని ఉపయోగించేవారు. క్రమంగా ముందుభాగంలో కూడా దంతాలను అమర్చడానికి ఈ ప్రక్రియను వైద్యులు ఉపయోగించి ఈ సమస్యకు పరిష్కారం చూపుతున్నారు.

పాడైపోయిన, దెబ్బతిన్న దంతాలకు చేసే చికిత్స మరింత సౌందర్యపరమైన మెళకువలతోనూ, మరింత సులువుగానూ చేయడానికి, దంతాలకు పూర్వపు రూపం ఇవ్వడానికి ఈస్పటిక్ డెంటిస్ట్రీని ఉపయోగిస్తారు. పూర్వపు రూపం కల్పించడానికి వాటిని రుద్దడం లేదా కొన్ని ద్రవాలు దంతాలు పీల్చుకునేలా చేయడం వంటి చర్యలను చేపట్టారు. దీనివలన చిగుళ్ళు వాపునకు గురికావచ్చు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా దంత వైద్యులు ఈస్పటిక్ టెంటిస్ట్రీని వాడుతున్నారు.

కృత్రిమ దంతాల అమరికపై ఎటువంటి భయాందోళనలు పడవద్దు. ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా పోయిన పళ్ల స్థానంలో పక్కపళ్లను అరగదీసే అవసరం లేకుండానే వాటి సపోర్ట్‌తో పనిలేకుండా ఎముకలోకి చిన్న స్క్రూలను అమర్చి ఎంతో సహజంగా కృత్రిమ దంతాలను అమర్చవచ్చు. వీటితో మామూలు పళ్లలాగే కొరకవచ్చు, నమిలి తినవచ్చు. ఒకప్పుడయితే ఈ చికిత్స ఖరీదైనదైనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది.

Leave a Comment