Home oxygen therapy – హోమ్ ఆక్సిజన్ థెరపీ ఎలాంటి పరిస్థితుల్లో అవసరం..?

By manavaradhi.com

Published on:

Follow Us
Oxygen Therapy

రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోవడం… వినడానికి కాస్తంత వింతగా ఉన్నా… ఇదో అనారోగ్య సమస్య. ఊపిరితిత్తులకు ఏర్పడే దీర్ఘకాలిక జబ్బుల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఇలా సమస్య ఉన్న వారికి… హోమ్ ఆక్సిజన్ థెరఫి చికిత్సను సూచిస్తారు. కనీసం గాలిని పీల్చుకుని కూడా బ్రతకలేని ఈ పరిస్థితి ఎలా ఎదురౌతుంది.

మనిషి జీవనానికి అత్యంత ముఖ్యమైనది ఆక్సిజన్. ఊపిరి పీల్చకుండా మనిషి జీవించడం అసాధ్యం. పెరిగిపోతున్న కాలుష్యం, తలమునకలై పోతున్న మనిషి బిజీ షెడ్యూలు… ఊపిరి తీసుకోనివ్వకుండా చేస్తున్నాయి. ఊపిరి తీసుకోవాలంటే కూడా ఒక్క క్షణం ఆలోచించాల్సిన పరిస్థితి. ట్రాఫిక్ లో నిత్యం తిరిగే ఉద్యోగాలు చేస్తున్న వారి పరిస్థితి మరీ ఘోరం. దుమ్ము, పొగతో ఊపిరితిత్తుల ఊపిరి తీసేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఎన్నో వ్యాధులు ఒక దాని తర్వాత ఒకటిగా తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఊపిరి పీల్చుకోలేని పరిస్థితుల్లోకి మనల్ని నెట్టేసే ప్రమాదకరమైన వ్యాధి హైపో ఆక్సియా. ఈ వ్యాధి సోకిందంటే… హోమ్ ఆక్సిజన్ థెరఫి తప్ప మరో పరిష్కారం లేదు. ఊపిరితిత్తుల్లోకి ప్రాణవాయువును నేరుగా పంపించే ఈ ప్రక్రియ అవసరమయ్యే పరిస్థితి ఏర్పడిందంటే… దినదిన గండంగా జీవితాన్ని సాగించాల్సిందే.

సాధారణంగా మనం 21 శాతం ఆక్సిజన్‌తో జీవిస్తున్నాం. ఈ ప్రాణవాయువు మన ఊపిరితిత్తుల నుండి రక్తంలో కలుస్తుంది. ఇలా కలవడానికి ఒక్కొక్కరి ఊపిరితిత్తుల్లో ఓ ప్రదేశం ఉంటుంది. ఇది సుమారు ఒక చిన్న టెన్నిస్‌కోర్ట్‌ అంత వైశాల్యం ఉంటుంది. వివిధ కారణాల వల్ల ఈ వైశాల్యం తగ్గిపోతే అప్పుడప్పుడు ఆయాసం వస్తుంది. సాధారణంగా ఏదైనా ఊపిరితిత్తులకు దీర్ఘకాలిక జబ్బు వచ్చినప్పుడు లంగ్‌ ఫైబ్రోసిస్‌ ఏర్పడుతుంది. దీన్నే స్కార్‌ టిష్యూ అని పిలుస్తారు. అంటే దెబ్బ తగిలినప్పుడు ఏర్పడిన మచ్చలాంటిది. దీనివల్ల ఆ ప్రదేశం ఆక్సిజన్‌ మార్పిడికి పనికిరాదు. దీర్ఘకాలిక జబ్బులున్న వారిలో దగ్గు వస్తుంటుంది. క్రమంగా ఆయాసం పెరుగుతూ వస్తుంది. వ్యాయామం చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. రోజువారీ కార్యక్రమాలు కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.

హైపోఆక్సియా ఏర్పడటంవల్ల గుండె నుంచి చెడు రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకుని వెళ్లే రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల గుండె మీద చాలా ఒత్తిడి పెరుగుతుంది. కాలక్రమేణా కుడివైపు గుండె పెరుగుతుంది. జబ్బు ముదిరేకొద్దీ గుండెలో కుడి భాగానికి సమస్యలు ఏర్పడుతాయి. దీనివల్ల ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా చిన్న చిన్న లక్షణాలు కనపడగానే పల్మనాలజీ వైద్యున్ని సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారిస్తారు. చిన్న చిన్న ఇన్‌ఫెక్షన్లు మళ్లీ మళ్లీ వస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మనం బాగానే ఉన్నా కొన్ని రోజులకి స్కార్‌టిష్యూ ప్రతిసారి కొంచెం కొంచెం ఏర్పడటం వల్ల చివరికి హైపో ఆక్సియా పరిస్థితి ఏర్పడుతుంది.

హైపో ఆక్సియా పరిస్థితికి గురైన వారికి హోమ్ ఆక్సిజన్ థెరఫిని డాక్టర్లు సిఫారసు చేస్తారు. దీన్నే లాంగ్ టర్మ్ ఆక్సిజన్ థెరఫీ అని కూడా అంటారు. రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ చికిత్స సూచిస్తారు. ఈ చికిత్స రెండు రకాలుగా ఉంటుంది. ఓ ఆక్సిజన్ సిలిండర్ నుంచి చిన్న పైప్ లేదా మాస్క్ ద్వారా రోజుకి 18 గంటలు ఆక్సిజన్ పీల్చాలి. ఇక రెండో విధానం ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్. ఇది వాతావరణంలో ఆక్సిజన్ ను గ్రహించి ఎక్కువ మొత్తంలో రోగికి అందేలా చేస్తుంది. ఇది సుమారుగా 95 శాతం వరకూ ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది. దీనివల్ల గుండెలో కుడిభాగంపై ఒత్తిడి పెరగకుడా కొంతకాలం అదుపు చేసుకోవచ్చు. అంతే కాకుండా జబ్బు తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే… ఫైబ్రోసిస్ పెరగకుండా మందులు వాడాలి. ఆయాసం వస్తే రిలీవర్ మెడిసిన్ తీసుకోవచ్చు. ఇలాంటి వారిలో చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు రాకూడదు. అందుకే అలాంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ వ్యాధి గురించి తెలియగానే నివారణ చర్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. దీని నివారణ కోసం వైద్యుణ్ని సంప్రదించి టీకాలు వేయించుకోవాలి. నిజానికి ఆరోగ్యంగా ఉన్న వారు ఆక్సిజన్ ను 100 శాతం పీల్చుకోకూడదు. ఇలా పీల్చుకుంటే కొన్ని గంటల్లోనే చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్నే ఆక్సిజన్ టాక్సిసిటీ అంటారు. అంటే బతకడం కోసం పీల్చుకునే ఆక్సిజన్ చావు సమస్యలను కూడా కొనితెస్తుంది. అయితే… ఊపిరి తిత్తుల సమస్యలు ఉన్న వారికి మాత్రం హోమ్ ఆక్సిజన్ పద్ధతిలో ఆక్సిజన్ ను అందించడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకూడదు అనుకుంటే… ప్రస్తుతం పొల్యూషన్ మన మీద పడకుండా గట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రాఫిక్ లో ఎక్కువగా తిరిగే వారు హెల్మెట్ లాంటివి కచ్చితంగా వాడుతుండాలి. దుమ్ము, కాలుష్యం నుంచి రక్షించుకునేందుకు కచ్చితంగా ముక్కుకు అడ్డంగా గుడ్డను కట్టుకుంటూ ఉండాలి. దీని వల్ల సమస్యలను వీలైనంత మేర తగ్గించుకోవచ్చు.

Leave a Comment