Healthy Bones: ఎముకలు బలంగా మారాలంటే ఏం తినాలి?

By manavaradhi.com

Published on:

Follow Us
Bone Health Tips

మనిషి కూర్చోవడం, నుంచోవడం చేయగలుగుతున్నారంటే అది ఎముకల గూడు వలనే సాధ్యం అవుతుంది. ఆమాటకొస్తే మనిషికి ఓ ఆకృతి అంటూ ఉందంటే అది ఎముకల వలనే. శరీర భాగాలను కలిపి ఉంచుతూ.., మనిషికి ఓ ఆకృతినిచ్చేది, సున్నితమైన అవయవాలను కాపాడేది… ఇలా చెప్పుకుంటూ పోతే ఎముకల గూడు వలన ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఇక గుండె, మెదడు, మూత్రపిండాలు, కాలేయం లాంటి సున్నితమైన భాగాలు మనిషి ప్రాణం నిలుపుతాయి. కానీ ఆ సున్నితమైన అవయవాలను కాపాడేది ఎముకలే. చెవులో ఉండే అతి చిన్న ఎముకల నుంచి కాళ్లు, చేతుల్లో ఉండే బలమైన ఎముకల వరకు దాదాపు 206 బోన్స్ శరీరంలో ఉంటాయి. చిన్నతనంలో 270 వరకూ ఉన్నా క్రమంగా తగ్గుతాయి. వయసు పెరిగే కొద్దీ.. ఎముకలు కూడా తమ శక్తిని కోల్పోతుంటాయి. గట్టిగా ఉన్నా ఎముకలు కూడా జీవకణాలే. తమంతట తాము ఎదుగుతూ.. విరిగితే తమంతట తామే బాగుచేసుకోగల లక్షణం ఎముకల సొంతం. ఇంత కీలకమైన ఎముకలను సమస్య వస్తే తప్ప సాధారణంగా పట్టించుకోరు.

గుండెకు, లివర్ లాంటి సున్నిత అవయవాలకు ఏ ఆహారం మంచి చేస్తుందో, చెడు చేస్తుందో తెలుసుకుని జాగ్రత్తలు పడుతుంటారు. కానీ ఎముకల విషయంలో మాత్రం అలాంటి ప్రాధాన్యతలు ఇవ్వరు. కానీ ఒక్కసారి సమస్య వస్తే మాత్రం ఎముకలు ఎంత ముఖ్యమైనవో తెలుస్తుంది. ఎముక విరిగిందంటే మనిషి మూలన కూర్చోవడం తప్ప మరేమీ చేయలేరు. ఎముక నిర్మాణం గురించి, ఎముకలు విరగకుండా పాటించాల్సిన జాగ్రత్తలు, ఎముకలు పటిష్టంగా ఉండటానికి ఏయే ఆహారాలు తినాలో తెలుసుకుంటే జీవితంలో విలువైన కాలాన్ని, శరీర భాగాల్ని కాపాడుకోవచ్చు.

ఎముకల నిర్మాణంలోనూ, గట్టిగా ఉండటంలోనూ ప్రధానపాత్ర పోషించేది కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ డి. ఈ నాలుగు శరీరానికి సక్రమంగా అందితే ఎముకలు బలంగా ఉంటాయి. కాల్షియం ప్రధానంగా పాలు, పాలపదార్ధాల్లో దొరుకుతుంది. చిన్నపిల్లల నుంచి వయసు మళ్లినవారి వరకు అందరూ పాలు తాగడం అవసరమే. చిన్నారుల్లో ఎముకల పెరుగుదలకు, పటిష్టతకు పాలు ఉపయోగపడతాయి. ఇక ముఫ్ఫై ఏళ్లు నిండినవారు, మహిళలు పాలు తాగడం అవసరం. వయసు పెరిగేకొద్దీ ఎముకలు మామూలు ఆహారపదార్ధాల నుంచి కాల్షియం గ్రహించే శక్తిని కోల్పోతాయి. అలాంటి సమయంలో పాలలో ఉండే కాల్షియం సరాసరి ఎముకలకు అందుతుంది. దీంతో ఎముకలు పటిష్టంగా ఉంటాయి.

దాదాపు అన్ని పాల పదార్ధాల్లోనూ కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పెరుగులో 42 శాతం కాల్షియమే. జున్ను, చీజ్, వెన్న, నెయ్యి, లాంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. కాఫీ, టీలను తాగడం కంటే ఆయా సందర్భాల్లో గ్లాసు పాలు తాగడం వలన శరీరానికి మంచి జరుగుతుంది. ఇక గుడ్లు తినడం వలన కూడా ఎముకలు బలంగా తయారవుతాయి. గుడ్లులో ఉండే విటమిన్లు ఎముకల పటుత్వానికి సహకరిస్తాయి. ఆకుకూరల్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాలు ఆకుకూరలు ద్వారానే శరీరానికి అందుతాయి. ఇక కూరగాయల్లో టొమాటోల్లో అధికంగ పొటాషియం ఉంటుంది. ఉల్లిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఈ రెండూ ఎముకల్లో శక్తి పెరగడానికి తోడ్పడతాయి. అలాగే తాజాపండ్లు కూడా మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ, బత్తాయి లాంటి పండ్లలో ఉండే సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

స్ట్రాబెర్రీ పండ్లలో ఉండే కొల్లాజెన్ అనే ప్రొటీన్ ఎముకలు బలంగా ఉంచడానికి సహకరిస్తుంది. ఇటీవల ఓట్స్ వినియోగం పెరిగింది. ఇవి కూడా ఎముకలకు మంచి చేస్తాయి. డ్రై ఫ్రూట్స్… ముఖ్యంగా ఆఫ్రికాట్లు ఎముకల్లో బలం పెంచుతాయి. వీటిలో పొటాషియం అధికంగా ఉండటం వలన ఎముకలు పటుత్వాన్ని సంపాదించుకుంటాయి. ఎముకలు బలహీనంగా ఉన్నవాళ్లు వారానికోసారయినా ఆఫ్రికాట్ తినాలి. వీటితో పాటు చేపలు తినడం అవసరం. చేపల్లో ఉండే ప్రొటీన్లు ఎముకల ఎదుగుదలకు, పటిష్టానికి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మాంసాహారాల్లో మిగతావాటి కంటే చేపలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.

ఎముకలు బలంగా ఉండాలంటే ప్రధానంగా ఉండాల్సిందే కాల్షియం. దాన్ని ఆహారాల ద్వారా సంపాదించుకోవడమే ఉత్తమం. కొంతమంది ఎముకల గట్టిదనానికి సప్లిమెంట్లను ఆశ్రయిస్తారు. వైద్యుల సలహా లేకుండా సొంతంగా ఇలాంటి సప్లిమెంట్లు తీసుకోవడం వలన లాభం కంటే ఎక్కువ నష్టం ఉంటుంది. కాల్షియం ఎముకలకు అవసరం. కానీ శరీరంలో మిగతా భాగాలకు దీని అవసరం మరీ ఎక్కువ ఉండదు. శరీరంలో కాల్షియం నిల్వలు ఎక్కువయితే అవి కిడ్నీలో రాళ్లుగా పేరుకుపోవచ్చు. కాబట్టి సప్లమెంట్ల జోలికి పోకుండా కాల్షియం సమృద్ధిగా దొరికే ఆహారాలను తినాలి.

తిన్న ఆహారంలో ఉండే కాల్షియంను ఎముకలు శోషించుకోవాలంటే అందుకు డి విటమిన్ అవసరం. ఈ విటమిన్ ఆహార పదార్ధాల కంటే సూర్యరశ్మి ద్వారానే మనకు సులభంగా అందుతుంది. కాబట్టి ఎప్పుడూ నీడపట్టున ఉండటం ఎముకలకు మంచిది కాదు. రోజూ కాసేపయినా శరీరానికి ఎండ తగలాలి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వాకింగ్, జాగింగ్, వ్యాయామాలు చేయడం వలన అటు సూర్యరశ్మితో పాటు శరీరంలోనూ కొత్త ఉత్తేజం నిండుతుంది. ఎముకలు జీవకణాలు. మనం వాటిని ఉపయోగించేకొద్దీ అవి సామర్ధ్యాన్ని పెంచుకుంటాయి. శరీరంలోకి వచ్చే ఆహారంలో తమకు కావాల్సినవి తీసుకుంటాయి. అంటే నడక, వ్యాయామం లాంటివి చేయడం వలన ఎముకలపై అవసరమైనమేర ఒత్తిడి పడుతుంది. దీంతో ఎముకల్లో ఉండే జీవకణాలు యాక్టివ్గా మారి పటిష్టంగా ఉంటాయి.

ఎముకలకు ధూమపానం.. పెద్ద శత్రువు అని చెప్పాలి. ధూమపానం వలన శరీరంలో ఎముకలు గుల్లబారిపోతాయి. చిన్న చిన్న దెబ్బలకు, ప్రమాదాలు జరిగినప్పుడు… స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి ఎముకలు త్వరగా విరిగిపోతాయి. సామాన్యుల్లో ఎముకలు విరిగితే మూడు నెలల్లో అతుక్కుంటే, ధూమపానం అలవాటు ఉన్నవారికి ఆరునెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం కావాల్సి వస్తుంది. ఇక ఎముకలపై కొంత అవగాహన, శ్రద్ధ అందరికీ అవసరం. ఆటల్లోనూ, ప్రయాణ సమయంలో జరిగే ప్రమాదాల్లోనూ ఎముకలు విరగడం సహజం. కాబట్టి ఆయా సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వయసు పెరిగేకొద్దీ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. నలభై ఏళ్ల వయసు తరువాత నుంచి ఎముకల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. బోన్ డెన్సిటీ ఎలా ఉంది అనే పరీక్షలు రెండు, మూడేళ్లకోసారి చేయించుకుని.. అందుకు తగ్గట్టు జాగ్రత్తలు పాటించాలి.

ఎముకలు గట్టిగా ఉంటాయి. వాటికి ఏ రోగం రాదని అనుకోనక్కర్లేదు. శరీరంలో అన్ని భాగాల్లో ఉన్నట్టే ఎముకల్లోనూ కణజాలం ఉంటుంది. ఆ కణజాలం అన్ని శరీరభాగాలు స్పందించినట్టే స్పందిస్తుంది. తీసుకునే ఆహారాన్ని బట్టి, చేసే వ్యాయామాలబట్టి ఎముకల పటుత్వం ఆధారపడి ఉంటుంది. కాబట్టి శరీరంలో అన్ని భాగాలు ఆరోగ్యంగా ఉండాలని ఎలా కోరుకుంటామో.. అలాగే ఎముకల పటిష్టత కోసం కూడా ప్రత్యేక ఆహారాలు తీసుకోవాలి.

Leave a Comment