నేటి గ్లోబెల్ యుగంలో అనేకమంది ఫ్యాషన్ మోజులోపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. వెనుకటి తరం పెద్దలు తీసుకున్న ఆహార పదార్థాలను, నియమాలను తప్పకుండా పాటించి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి. ప్రతి నిత్యం వ్యాయామం చేస్తూనే.. పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా వయసుపైబడుతున్నవారు పోషకాహార నిపుణుల సలహామేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి?
మనం ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎంత ఆరోగ్యంగా జీవించామన్నదే ముఖ్యం. మరి మనం ఆరోగ్యంగా జీవించాలంటే చిన్నప్పటినుంచే సమతుల ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మన ఆహార నియమావళి గతి తప్పితే రోగాల పాలు కావడం ఖాయం అంటున్నారు. ముఖ్యంగా వయసు పైబడుతున్నవారు తప్పనిసరిగా కొన్ని ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. వయసుపైబడుతున్నకొద్దీ కొందరికి రకరకాల రుచులతో కూడిన వంటకాలు ఎంతగానో ఇష్టపడుతుంటారు. కానీ వీరికి వయసుతో పాటే రకరకాల వ్యాధులు పలకరిస్తుంటాయి. వద్ధాప్యంలో శరీరంలోని మెటబాలిక్ రేటు తగ్గిపోవడం, శారీరక శ్రమ లేకపోవడం లాంటి కారణాల వల్ల యువకుల కన్నా వృద్దులకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. మంచి, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, తగిన వ్యాయామం వృద్ధాప్యపు అనారోగ్యాలను తగ్గిస్తాయి. ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో కచ్చితమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది.
![](https://manavaradhi.com/wp-content/uploads/2024/12/image-36.png)
బ్లూ బెర్రీస్ లో విటమిన్ సి, విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. వీటివల్ల శరీర కణాల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వీటిని తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు నడుము చుట్టూ కొవ్వును కూడా తగ్గించుకోవచ్చు. తక్కువ కొలెస్ట్రాల్, రక్తంలోని గ్లూకోస్‌ని కూడా నియంత్రణలో ఉంచుతాయి. ఈ బెర్రీలు తినడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
50 ఏళ్లకు ముందు ఎలాంటి ఆహారం తీసుకున్నా, 50 దాటిన తరువాత మాత్రం తాము తీసుకునే ఆహారంలో కచ్చితంగా పీచు ఉండేలా చూసుకోవాలి అంటున్నారు పరిశోధకులు. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకున్న వారిలో ఎక్కువమంది మునుపటి కన్నా మరింత ఆరోగ్యంగా ఉండగా, పీచు తీసుకోని వారిలో రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చాయని అంటున్నారు. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ సరిగ్గా సరుగుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను మరియు బీపీని నియంత్రిస్తుంది. మధుమేహాన్ని తగ్గిస్తుంది.
వయసుపైబడుతున్నవారు తీసుకునే నీళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మన శరీర జీవక్రియలు చురుగ్గా పనిచేయాలంటే శరీరానికి నీరు అనే ఇంధనం చాలా అవసరం. శరీరానికి సరిపడా నీరు అందలేదంటే శరీరం జరిగే జీవక్రియలన్ని పనిచేయడం మానేస్తాయి. రక్తం చిక్కబడుతుంది. రక్తప్రసరణ సరిగా జరగదు. హైబిపి వస్తుంది. డీహైడ్రేషన్ వల్ల చర్మ మీద వివిధ రకాలుగా ప్రభావం చూపుతుంది. అందువల్ల వయసుపైబడినవారు ప్రతిరోజూ తప్పనిసరిగా తగు మోతాదులో వైద్యుల సలహా ప్రకారం నీళ్లు తీసుకోవాలి. షుగర్ సమస్య ఉన్నవారు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
![](https://manavaradhi.com/wp-content/uploads/2024/12/image-37.png)
చేపలో కూడా ఇనో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయి.. వైద్య నిపుణులు కూడా చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు. వీటి వల్ల మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. ముఖ్యంగా చేపల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంతోపాటు మెదడును చురుగ్గా ఉండేలా చేస్తాయి. కాబట్టి వయసుపైబడుతున్నవారు కనీసం వారంలో రెండు సార్లు చేపలను తింటే మంచిది. దీంతో మీకు ఎలాంటి గుండె జబ్బులు రావని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన ఒక పరిశోధనలో తెలిసింది.
![](https://manavaradhi.com/wp-content/uploads/2024/12/image-38.png)
ఆలివ్ ఆయిల్ కూడా వయసుపైబడుతున్నవారికి ఎంతో మంచిదని చెబుతున్నారు వైద్య నిపుణులు . ఇది యాంటిడిప్రజెంట్ గా పనిచేస్తుంది. సెరోటోనిన్ స్థాయిని పెంచుతుంది. ఈ నూనెలో ఒమేగా-3 మరియు ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉండటం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇది అల్జీమర్స్ వ్యాధిని కూడా నిరోధిస్తుంది. యోగర్ట్ లో ప్రోటీన్, క్యాల్షియం, రిబోఫ్లేవిన్, విటమిన్ B6 మరియు విటమిన్ B12 వంటి పోషకాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణకోశ వ్యాధులు మరియు విరేచానాలను నిరోధించడంలో ఉపయోగపడుతుంది.
టొమాటోలోని విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. వయసుతోపాటు అంధత్వం ఆవహించకుండా కాపాడుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ , లంగ్ క్యాన్సర్ నివారణలో సహకరిస్తుంది. బ్రొకోలిని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా గుండెకు చాలా మంచిది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ విషయం ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో తెలుపబడింది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు అధికంగా ఫైబర్ ఉంటాయి. అలాగే రెడ్ వైన్ కూడా రోజుకు ఒకసారి మాత్రమే తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దీంతోపాటు బ్లడ్ క్లాట్స్ ను ప్రివెంట్ చేస్తుంది. వయసుపైబడుతున్నవారు తీసుకోవాల్సిన మరో ముఖ్య ఆహారం నట్స్. ఇందులో ఒమేగా 3s, అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఈ నట్స్ గుండె ఆరోగ్యానికి ఎంతగానో సహకరిస్తాయి.
ఎక్కువ మొత్తంలో నీరు, పండ్లు, పండ్ల రసాలు, తక్కువ నూనెతో చేసిన పదార్థాలు తీసుకొని ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి. పిజ్జాలు, బర్గర్లు, వివిధ రకాల కూల్ డ్రింక్స్‌తో ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడమే కాకుండా స్థూలకాయంతో జీవితాన్నే ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇప్పటికైనా ఆరోగ్యం పట్ల జాగ్రత్తపడి సద్ది అన్నం, జొన్నగట్క, పండ్లు, కూరగాయలు, పాలు, పెరుగు తిని ఆరోగ్యంగా జీవిస్తారు.