చాలా వ్యాధులకు జన్యుపరమైన కారణాలు వుంటాయి. క్యాన్సరు జబ్బు ఒకటి లేక అనేక జన్యువుల సముదాయంలో మార్పులు కలగడం వల్ల రావచ్చు. ఈ మార్పులు వాటంతట అవే కలిగి వుండవచ్చు లేదా వాతావరణ కాలుష్యాలు కారణభూతమవుతాయి. ధూమపానం,పరిశ్రమల నుండి వెలువడే రసాయనాల పొగ మొదలగునవి. జన్యుపరంగా వచ్చిన వ్యాధులను సైతం జీవనశైలి మార్పులతో తరిమికొట్టవచ్చు.
ఒక జన్యువు ఒకతరం నుంచి ఇంకొక తరానికి వ్యాధులతో పాటు ఇతర లక్షణాలను కూడా భవిష్యత్తు తరాలకు తీసుకెళ్తుంది. ఈ క్రమంలో అనేక వ్యాధులను కలుగజేస్తూ ఉంటాయి. ఇతర జన్యువుల అపసవ్యాలు కూడా క్రోమోజోములలోని సమస్యలు వల్ల కలుగుతూ వుంటాయి. గుండె వ్యాధి ఉన్నవారి కుటుంబంలో మళ్లీ గుండెపోటు వచ్చే అవకాశం ఉందా? అంటే లేదు అని చెప్పొచ్చు. మీరు చేయాల్సిందిల్లా జీవనశైలి మార్పులే. కొన్ని రకాల జీన్స్ ప్రాణాంతక వ్యాధులకు దారి చూపిస్తాయి. జీవనశైలి మార్పులతో అంతర్లీనంగా ఉన్న ఎలాంటి వ్యాధినైనా అధిగమించొచ్చు అని వైద్యులు చెబుతున్నారు.
గుండె వ్యాధులను 100 రకాల జీన్స్ ప్రభావితం చేస్తాయి. ఇవి కొన్నిసార్లు చిన్న పాత్ర పోషిస్తాయి. మరికొన్నిసార్లు పెద్ద పాత్ర పోషిస్తాయి. అయితే జీవనశైలి మార్పులు చేసుకుంటే మాత్రం ప్రాణాంతక వ్యాధులను సైతం పారద్రోలవచ్చని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. మనం తినే ఆహారం , చేసే వ్యాయామం చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. సిగరెట్ తాగే అలవాటు ఉన్న వాళ్లు త్యజిస్తే మంచిది. ఎందుకంటే స్మోకర్స్ కి గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని కార్డియాలజిస్ట్ లు చెబుతున్నారు. గుండె వ్యాధి ఉన్న రక్తసంబంధీకులు ఒకసారి చెకప్ చేయించుకోవాలి. వీళ్లంతా డాక్టరు సూచన ప్రకారం జీవనశైలి మార్పులు చేసుకోవాలి. ఇలా కొనసాగినప్పుడు మాత్రం జీవితాంతం గుండె వ్యాధి రాదని రుజువయ్యింది.
టైప్ 2 డయాబెటీస్ సైతం జీన్స్ వల్లే వస్తుంది. కానీ జీవనశైలి మార్పులు చేసుకుంటే మంచిది. వ్యాయామం , బరువును బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం ఉండే విధంగా చెక్ చేసుకోవాలి. ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలి. దీంతో మంచి ఫలితాలు సిద్దిస్తాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్ ఉన్నవారికి కూడా జీవన శైలి మార్పులతో ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. వ్యాయామం ఒక్కటి చేస్తే సరిపోదు. వయసుపైబడుతున్నవాళ్లు వ్యాయామంతో బాటు ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలి. దీనివల్ల గుండె వ్యాధి రాకుండా నివారించవచ్చు. 65 ఏళ్లు దాటినవారికి సహజంగానే కరోనరీ ఆర్టరీ డిసీజ్ రావచ్చు. దీనివల్ల గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. 60 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్నవారంతా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనేక అధ్యయనాలు, పరిశోధనలు ఈ విషయాన్ని రుజువు చేశాయి.
డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధిలో ఈ క్రోమోజోముల జత ఒకటి అధికంగా ఉంటుంది. క్రోమోజోమ్ 21 ఒకటి అదనంగా ఉండటం వల్ల ఉత్పన్నమయ్యే మానసిక, భౌతిక చిహ్నాల సముదాయం ఇది. మహిళలలో వయస్సు పెరిగే కొద్దీ, ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలను కనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఐతే ఇది వంశపారంపర్యంగా వచ్చే సమస్య కాదు. సాధారణంగా ఈ సిండ్రోమ్ తో బాధపడేవారిలో మానసిక, భౌతిక వికాసం ఆరోగ్యవంతులతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది..వీరికి ఇతర ఆరోగ్య సమస్యలు సైతం ఎక్కువగా ఉంటాయి.
పుట్టడమే గుండె సమస్యతో పుట్టవచ్చు. మతిమరుపుతోనో, వినికిడి లోపంతోనో పుట్టవచ్చు, పేగులలో లేదా దృష్టి లోపంతో, థైరాయిడ్ సమస్యతోనో ఎముకలలో సమస్యతోనో పుట్టవచ్చు. ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్న పెద్దవారిలో అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ. అంతేకాదు వీరిలో మెదడు లోపం వల్ల జ్ఞాపకశక్తి తగ్గటం, నిర్ణయం తీసుకోలేక పోవడం, పనిచేయలేక పోవడం ఎక్కువగా ఉంటుంది. ఈ సిండ్రోంను తగ్గించుకోలేకపోతే అనేక సమస్యలు రావచ్చు. ఈ సిండ్రోమ్ కారణంగా గ్రహణ మొర్రి అనే సమస్య రావచ్చు. ఇది పుట్టుకతో వచ్చే లోపం. ఇది జన్యుపరంగా, పర్యావరణ అంశాల వల్ల ఏర్పడే లోపం. గ్రహణ మొర్రితో పుట్టిన పిల్లలకు రకరకాల సేవలవసరమౌతాయి. ఎలాంటి మందులు వాడకుండా కొన్ని రకాల థెరపీలు, సర్జరీల ద్వారా గ్రహణం మొర్రిని తగ్గిస్తున్నారు వైద్యులు. అయితే దీనికి కాస్త సమయం పడుతుంది. వయస్సు రీత్యా ఒక్కొక్కరికి ఒక్కో చికిత్సా విధానం ఉంటుంది.
తరతరాలుగా వస్తున్న వ్యాధులను సైతం కూకటి వేళ్లతో పెకిలించే శక్తి ఒక్క ఆరోగ్యకర జీవనశైలి మార్పులతోనే సాధ్యం. జన్యుపరమైన సలహాలనిచ్చి వంశపారంపర్యంగా ఆ వ్యాధిని రాకుండా తగ్గింపజేయాలి.