కివి ఏన్నో పండ్లలో దొరుకని పోషకాలు వీటిలో దొరుకుతున్నందున వీటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండండంటూ పోషకాహార నిపుణులు సెలవిస్తున్నారు. నిజంగా కివీ పండులో ఎలాంటి పోషకాలు లభిస్తాయి..?
కివి పండు.. వీటిని ఎక్కువగా న్యూజిలాండ్ వంటి చల్లని ప్రదేశంలో పండిస్తుంటారు. అందువల్లనే వీటికి కివీ పండు అని పేరొచ్చింది. చైనీస్ గూస్బెర్రీస్ అని కూడా పిలిచి ఈ కివీ కాయలు చూడటానికి ముదురు గోధుమరంగు జూలుతో కోడిగ్రుడ్డు ఆకారంలో ఉండి లోపల అనేక గింజలతో నిండిన ఆకుపచ్చని లేదా పసుపుపచ్చని గుజ్జు కలిగివుంటుంది. కమలాలకు రెట్టింపు ‘విటమిన్ సి’, ఆపిల్‌లోకన్నా అయిదు రెట్లు ఎక్కువ పోషకాలూ దీని సొంతం. పీచు పదార్థం, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మరెన్నో పోషకాల నిలయం ఈ కివీ పండు.
కివి పండులో పెద్ద మొత్తంలో విటమిన్లు, ప్లావనాయిడ్స్, ఖనిజలవణాలు ఉన్నాయి. వీటిని రోజుకు 2-3 చొప్పున తింటే కంటిసంబంధిత, వయసు పెరుగుదలతో వచ్చే మాక్యులార్ క్షీణత తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. కాన్సర్ కు దారితీసే జన్యుమార్పులను నిరోధించే పదార్ధము ఈ పండులో ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఉండే గ్లుటథియోన్ క్యాన్సర్ కు దారితీసే క్రమాన్ని నిరోధిస్తుందని అంటారు ఆహారనిపుణులు. శరీరములో ఏర్పడే నైట్రేట్ ఫ్రీరాడికిల్ ప్రభావాన్ని నిరోధిస్తుంది. ఈ పండు నుంచి తీసిన రసం.. చర్మ క్యాన్సర్ ను నిరోధిస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. వీటిలోని అమినోయాసిడ్ ‘ ఆర్జినిన్” శుద్ద రక్తనాళాల్లో గట్టి పదార్థం ఏర్పడకుండా నిరోధిస్తుంది.

కొవ్వులూ, సోడియం తక్కువగా ఉండటంవల్ల హృద్రోగులూ, మధుమేహ వ్యాధిగ్రస్తులూ కూడా దీన్ని తినొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. బరువు తగ్గించుకోవాలనుకునేవారికీ ఇది మంచి నేస్తమే. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలవల్ల బీపీ, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. పోషకాలే కాదు, నోరూరించే రుచి కూడా కివీ సొంతం. కివి పండు శ్వాస సంబంధిత ఆస్త్మా వంటి సమస్యలను తగ్గిస్తుంది. కివి పండులో తక్కువ కొవ్వు శాతంతో లభించే విటమిన్ ఈ.. అధిక యాంటీ ఆక్సిడంట్లను అందించి గుండె ఆరోగ్యం కాపాడుతుంది. గర్భిణీలు వీటిని తీసుకోవడం వల్ల ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా లభిస్తుంది. ఈ పండులో దొరికే జింక్.. మగవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ పెంపుదలకు. అలాగే చర్మం, వెంట్రుకలు, దంతాలు, గోళ్ళు ఆరోగ్యకర పెరుగుదలకు జింక్ సహకరిస్తుంది.
కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడమే కాకుండా ఆహారంలోని ఐరన్‌ను త్వరగా శరీరం గ్రహించేలా చేయడంలో గొప్పగా పనిచేస్తుంది. ఎంతో అద్భుత ప్రయోజనాలు ఉన్న కివీ ఫ్రూట్‌ను నిత్యం తీసుకోవడం ఆరోగ్యరీత్ర శ్రేయస్కరం.