నోటి ఆరోగ్యమే మహా భాగ్యం. నోరు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతామని ఆధునిక వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ చాలామంది నోటి ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువగా చూపించరు. దీంతో చిగుళ్ల వాపు, ఎగుడు దిగుడు, ఎత్తు పళ్లు, నోటి అల్సర్లు, పూతలు, పిప్పి పళ్లు లాంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఫలితంగా నోటి ఆరోగ్యం దెబ్బతిని మిగిలిన శరీరభాగాలను కూడా అనేక రకాల సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి ఏయే నోటి సమస్యలు మనల్ని ఇబ్బంది పెడతాయి? వీటినుంచి ఎలా జాగ్రత్తగా ఉండవచ్చో..!
నోరు .. అన్ని రకాల ఆహారాలు కడుపులోకి వెళ్లే ద్వారం . శుభ్రమైన, శుచియైన ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు. నోరు శుభ్రంగా ఉన్నప్పుడే కడుపులోకి అంతే పరిశుభ్రంగా ఆహారం వెళ్తుంది. అంతేకాదు నోటిలో లాలాజలంతో ఎప్పుడూ తడిగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా, వైరస్ లాంటివి దాడిచేసే అవకాశం ఎక్కువ. కాబట్టి నోటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆహార పదార్థాలు తిన్న వెంటనే నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. రాత్రి పూట కచ్చితంగా బ్రష్ చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించినా శారీరక మార్పులు బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల కలిగే ఇబ్బంది వల్ల నోటిలో కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.
నోరు, కళ్ల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. దీనికి కారణం నోటి, కళ్ల అనారోగ్య సమస్యలు చాలా సాధారణంగా ఉంటాయి. పైగా ఎక్కువ కాలం వీటి వల్ల సమస్య ఉండదు. కొద్దికాలంలోనే వాటంతట అవే తగ్గిపోతాయి. నోటిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. వాటిలో ప్రధానంగా కోల్డ్ సోర్స్ ఒకటి. ఇవి నోటిలో వేడి పొక్కులుగా ఏర్పడతాయి. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు ఇవి కనిపిస్తాయి. అందుకే వీటిని జ్వరం, పొక్కులు అని కూడా పిలుస్తారు. ఇవి వైరస్ వల్ల వ్యాప్తి చెందుతాయి. ఒకరినొకరు నోరులో నోరు పెట్టి ముద్దు పెట్టుకోవడం వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తాయి. దీన్ని తగ్గించుకునేందుకు రకరకాల క్రీములు, ఆయింట్మెంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
త్రష్ అనేది మరో రకమైన నోటి అనారోగ్య సమస్య. ఇది కేండిడా అనే ఈస్ట్ వల్ల వ్యాపిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల్లో ఈ సమస్య కనిపిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ తగ్గిన వారిలో మధుమేహ వ్యాధి ఉన్నవారిలో ఈ సమస్య వస్తుంది. చిగుళ్లు, నాలుకపై ఎర్రబారి మంట అనిపిస్తుంది. ఏమీ తిన్నా తీవ్రమైన మంటగా ఉంటుంది. ఐతే దీనికి తగిన మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. బ్లాక్ హెయిరీ టంగ్ . . ఇది కూడా బ్యాక్టీరియా వల్ల వ్యాప్తి చెందుతుంది. నాలుకపై చిన్న గడ్డలు ఏర్పడతాయి. మొత్తంగా నాలుకను చూస్తే వెంట్రుకల్లా ఉంటాయి. యాంటీబయాటిక్స్ వాడే వారితోపాటు నోటిని పరిశుభ్రంగా ఉంచుకోని వారికి పొగ తాగేవారికి మద్యం తీసుకునే వారిని ఈ సమస్య వేధిస్తుంది. అలాగే ఎక్కువగా టీ లు, కాఫీలు తాగే వారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమస్య ఉన్న వారిలో ఎక్కువ లాలాజలం ఉత్పత్తి కాదు. దీంతో సమస్య మరింత తీవ్రమవుతుంది. ఐతే నాలుకను శుభ్రపరుచుకోడమే దీనికి పరిష్కార మార్గం. ఒక వేళ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే వైద్యుల సూచనల మేరకు మందులు వాడుకోవాలి.. .
ఓరల్ కేన్సర్ ..నోటి అనారోగ్య సమస్యల్లో ఇది చాలా ప్రధానమైనది. ఈ సమస్య ఉన్నవారు ఏ ఆహార పదార్థాలను నమలలేరు, మింగలేరు. చివరకు మాట్లాడడం కూడా కష్టమే అవుతుంది. స్మోకింగ్, పొగాకు తినడం, మద్యం తాగడం, ఎక్కువ సూర్యరశ్మిలో తిరిగే అలవాట్లు ఉన్నవారిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. స్త్రీలలో ఈ సమస్య హ్యూమన్ పాపిలో వైరస్ కి లింక్ గా ఉంటుంది. ఐతే ఈ సమస్యను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
TMJ.. దీన్ని వైద్య పరిభాషలో టెంపరో మాండిబ్యులర్ జాయింట్ సిండ్రోమ్ అంటారు. ఈ సమస్య ఉన్న వారికి దవడల్లో విపరీతంగా నొప్పి ఉంటుంది. ముఖం కూడా నొప్పితో స్వెల్లింగ్ వస్తుంది. ఈ సమస్యకు ఒక్కోసారి శస్త్రచికిత్స కూడా అవసరం పడవచ్చు. కొన్నిసార్లు విశ్రాంతిగా ఉండడం లేదా వేడి కాపడం ద్వారా తగ్గిపోతుంది. ప్రతిరోజూ సాధారణ దంత పరీక్షలు చేసుకోవాలి. బ్రష్ చేయడం, దంతాలు, చిగుళ్ల మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలను ప్రక్షాళన చేయడం వల్ల పళ్లు రంగు మారడం లాంటి సమస్యలను నివారించుకోవచ్చు. నోటిలో ఇన్ఫెక్షన్లు ముఖంతోపాటు తల ఇతర అవయవాలకు కూడా హాని కలిగిస్తాయి. వాటితో జ్వరం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రోజూ పళ్లను బ్రష్ ద్వారా శుభ్రం చేయకపోతే వాటి చుట్టూ ఆహార కణాలు మిగిలిపోయి అవి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. అంతే కాకుండా దుర్వాసనను కలిగిస్తాయి. నిరంతర చెడు శ్వాస లేదా నోటిలో చెడు రుచి కారణంగా దంత క్షయం, చిగుళ్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే రోజూ దంతాలు, నాలుకను బ్రష్ ద్వారా శుభ్రం చేసుకోవాలి. రోజూ మౌత్ వాష్ తో శుభ్రం చేసుకుంటే మంచిది. దుర్వాసన అనిపిస్తే దంత వైద్యులను సంప్రదించాలి.
నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే తీపి పదార్థాలు తినటం తగ్గించాలి. దంతాల చుట్టూ అంటుకుపోయే కేకులు, స్వీట్లు, చాక్లెట్లు వంటి అతి మెత్తని పదార్థాలను తినకూడదు. ఆహారం తిన్న వెంటనే నోరును నీటితో పుక్కిలించాలి. క్రమం తప్పకుండా రోజుకి రెండుసార్లు ఉదయం, రాత్రి బ్రష్ చేసుకోవాలి. ప్రతి ఆరుమాసాలకోసారి ఓరల్ చెకప్ చేయించుకోవాలి. ప్రతి రెండేళ్లకు ఓసారి దంతాల మీద పేరుకున్న గారను తొలగించుకోవాలి.








