క్యాన్సర్ అనగానే భయపడిపోవడం కన్నా.. అసలు ఎందుకు వస్తుంది.. వచ్చినప్పుడు ఎలా గుర్తించాలి.. రాకుండా ఎలాంటి జీవనశైలిని అలవర్చుకోవాలి… ఎలాంటి ఆహారాలు తీసుకోవడం ద్వారా క్యాన్సర్లకు చెక్ పెట్టొచ్చో తెలుసుకోవాలి. క్యాన్సర్లు రావడానికి కారణాలేవైనా.. వ్యాధి రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
క్యాన్సర్… ఈ మూడక్షరాల్ని తలుచుకుంటే మృత్యువు కళ్లముందు మెదులుతుంది. ఆ భయానికి ముఖ్యకారణం చెడు అలవాట్లు, అపోహలు, అనుమానాలు, అవగాహన రాహిత్యం వల్లనేనని నిపుణులు చెప్తున్నారు. చాలా వరకు క్యాన్సర్లను ఆరంభ దశలో గుర్తిస్తే చికిత్స చేయడం సులభం అవుతుంది. జీవనశైలితో పాటు మనం తీసుకునే ఆహారాలు కూడా ఈ వ్యాధికి ప్రధాన కారణం. మనం తీసుకునే ఆహారపదార్థాల ద్వారా క్యాన్సర్ ను చాలా వరకూ నిరోధించుకోవొచ్చని సెలవిస్తున్నారు వైద్యనిపుణులు. చాలా రకాల క్యాన్సర్లు మానవ తప్పిదాల వల్లనే వస్తుంటాయి. వాతావరణ కాలుష్యం, కల్తీ ఆహారం వంటివి మనిషి శరీరంలోని క్యాన్సర్ కారకాలను ప్రేరేపించి వ్యాధికి గురిచేస్తాయి.
మనం తీసుకునే ఆహార పదార్థాలతో క్యాన్సర్లు వస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ బీ ఎక్కువగా లభించే ఆహారాలు, ఉదయం అల్పాహారంగా తీసుకొనే తృణధాన్యాలు, గోధుమ ఉత్పత్తుల్లోని ఫోలేట్ అనే రసాయనం కోలన్, రెక్టమ్, బ్రెస్ట్ క్యాన్సర్లు రాకుండా మనల్ని రక్షిస్తాయి. వెల్లుల్లి జాతికి చెందిన ఆహారాలతో పాటు ఒమెగా 3-ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మన్ చేపలు, వాల్నట్, లిన్సీడ్ ఆయిల్‌తో మెదడు క్యాన్సర్లను నివారించవచ్చు. ముదురురంగు పండ్లు, ఆకుకూరలతో పాటు విటమిన్ ఏ ఎక్కువగా ఉండే బొప్పాయి, క్యారట్, మామిడి వంటి తాజాపండ్లతో నోరు, గొంతు క్యాన్సర్లను నివారించవచ్చు. గుడ్లు ఎక్కువగా తీసుకొనే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుందని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. విటమిన్-సి అధికంగా ఉండే నిమ్మ, నారింజ, ద్రాక్ష, జామ ఎక్కువగా తినడం వల్ల చర్మక్యాన్సర్ తగ్గే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహార పదార్ధాలు కాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని గుర్తించారు. ప్రోటీన్లను అధికంగా కలిగి ఉన్న సోయా, ఫ్లేవర్డ్ సోయా పాలు, స్నాక్స్ వంటి వివిధ రకాలలో మార్కెట్లో ఇప్పుడు అందుబాటులో దొరుకుతున్నాయి. అధికంగా కాల్షియం లభించే పెరుగు, పాలు, అరటిపండ్లు, వంటి వాటిని ఆహారంలో తప్పక భాగం చేసుకోవాలి.పాలీఫీనాల్స్ ఎక్కువగా ఉండే గ్రీన్-టీ, దానిమ్మ కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ కణాల వ్యాప్తిని సమర్థంగా అదుపు చేస్తాయి. బ్రకోలీ, కాలీఫ్లవర్‌తో ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించవచ్చుని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. బెర్రీలు, చెర్రీలు, టొమాటో, బ్రాకోలీతోపాటు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే మాంసాహారం, చేపలు, గుడ్లతోనూ ఎముక క్యాన్సర్ నివారించుకోవచ్చు. బీన్స్, అవిసె, సోయా, ద్రాక్షపండ్లు తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు.
క్యాన్సర్ నియంత్రణకు ఆహారం ప్రాధాన్యం ఎంతో ఉన్నది. మన ఆహారపుటలవాట్లలో మార్పులు చేర్పులు చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చని చెప్తున్న నిపుణుల మాటల్ని విందాం. భవిష్యత్‌లో క్యాన్సర్ రాకుండా చూసుకుందాం.








