పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం లాంటివి. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసు. అయితే మనం రెగ్యులర్ డైట్ లో ఎంత మేరకు ఫైబర్ రిచ్ ఫుడ్స్ చేర్చుకుంటామో అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రయోజనాలు పొందవచ్చు.
మన ఆరోగ్యానికి ప్రాణం లాంటివి పీచు పదార్థాలు. వివిధ రకాల క్యాన్సర్లు, గుండె జబ్బులు, మధుమేహం లాంటి వాటి నుంచి కాపాడతాయి. ఈ పీచు పదార్థాలు కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడతాయి. ఆహారాన్ని సరైన పద్ధతిలో తీసుకోవాలి. ఈ పీచు శాకాహారాల్లోనే లభ్యమవుతుంది. ఇవి పండ్లు, కూరగాయలు, గింజలు, సుగంధ ద్రవ్యాలు మొదలైన వాటిలో ఎక్కువగా లభిస్తుంది. అందుకే ప్రకృతి సిద్ధంగా ఆయా కాలాల్లో లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. దీనివలన శరీరానికి కావలసిన అన్నీ రకాల పోషక విలువలు అంది ఆరోగ్యంగా ఉండగలుగుతామని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఆహార పదార్థాలలో పీచు కరిగే ఫైబర్, కరగని ఫైబర్ అని రెండు రకాలుగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో కరిగే పీచును తీసుకున్నట్లైతే చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. గుండె సమస్యలు తగ్గుతాయి, అదేవిధంగా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరిగే పీచు మనకు ఓట్స్, బ్రౌన్ రైస్, చిక్కుడు, కాయగూరలు, ఆపిల్, ఆరెంజ్, క్యారెట్స్ లాంటి వాటిలో లభిస్తాయి. కరగని పీచు తొక్క తీయని ధాన్యాలు, పెసలు, ఉలవలు, గోధుమ పొత్తు, జొన్న పొత్తు, పండ్ల తొక్కలలో ఎక్కువగా లభిస్తుంది. వీటిని తీసుకోవడం వలన ఎక్కువ ఆహారం తినకుండా కదిపు నిండిన భావన కలుగుతుంది. విరేచనాలు సాఫీగా జరుగుతాయి.
మనకు ఆహారం అనగానే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, నూనెలు, ఖనిజాలు అనుకుంటాం. వీటిని తింటే చాలు శరీరానికి కావలసిన శక్తి లభిస్తుందనుకుంటాం. కానీ పీచు ఉన్న ఆహార పదార్థాల గురుంచి అంతగా పట్టించుకోము. రోజురోజుకీ జీవనశైలిలో మార్పులు, జంక్ ఫుడ్ కు బాగా అలవాటు పడటం వలన అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాం. కాబట్టి పీచు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలపై దృష్టిని సారించాల్సిన అవసరం ఉంది.

పీచును తినాలి కదా అని అదేపనిగా తినకూడదు. పిల్లలకు ఎక్కువ మోతాదులో ఇవి పెడితే త్వరగా కడుపు నిండిపోయినట్టు అనిపించి సరిపడిన ఆహారం తీసుకోలేరు. దీనివలన శరీరానికి కావలసినంత శక్తి లభించక ఎదుగుదల సమస్యలు వస్తాయి. అందుకే పీచు పదార్థాలను తీసుకున్న తర్వాత వీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఫైనాఫిల్ లో కంటే సపోటాలో పీచు అధికంగా ఉంటుంది. కాయగూరల కంటే ముడి ధాన్యంలో, పప్పులలో అధికంగా లభిస్తుంది. స్వీట్ కార్న్ అక్నెది చాలా ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో కూడా పీచు అధికంగా ఉంటుంది.
ఫైబర్ అనేది గొప్ప యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. పీచు పదార్థం క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మలబద్ధకం, పిత్తాశయంలో రాళ్ళు, కొలాన్ క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువ. పీచు జీర్ణకోశంలో ఉండే మంచి బ్యాక్టీరియాకు సహాయపడి ఇన్ ఫెక్షన్ల బారి నుండి రక్షిస్తుంది. పీచు పదార్థం తిన్నప్పుడు అది కడుపులో ఎక్కువ నీటిని గ్రహించి మలం యొక్క పరిమాణాన్ని పెంచుతుంది. అందువల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఆహారంలో ఉండే పీచు సిరం ఫైబ్రినోజన్ స్థాయిలను తగ్గించి గుండె రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది, గుండెపోటు రాకుండా చేస్తుంది. కాబట్టి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్న ఫైబర్ ఫుడ్స్ ప్రతి ఒక్కరూ రోజువారీ డైట్ లో తప్పనిసరిగా భాగం చేసుకోవాలి.








