Salt in Food: ఉప్పు ఎక్కువైతే ముప్పే.. రోజుకు ఎంత తీసుకోవాలో తెలుసా?

By manavaradhi.com

Published on:

Follow Us
Salt in Food

ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ వంటల్లో తప్పనిసరిగా వాడే పదార్థం ఏదంటే వెంటనే ఉప్పు అని సమాధానమిస్తారు. ఈ ఉప్పునే సైంధవ లవణం అని కూడా పిలుస్తారు. ప్రతి కూరకు రుచి రావాలంటే ఉప్పు తప్పనిసరి. ఐతే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగని మోతాదుకు మించితే అనారోగ్య సమస్యలు తప్పవు.. అందుకే ఉప్పును మితంగా తీసుకోవాలి.

వండుకున్న ఆహారంలో అన్ని పదార్థాలు సమపాళ్లలో పడినా కూరకు తగిన రుచి రావాలంటే ఉప్పు తప్పకుండా వేయాలి. ఉప్పు లేని కూర ఎంత బాగా వండినా ప్రయోజనం శూన్యం. అంతటి ప్రాధాన్యం ఉన్న ఉప్పును చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. శరీరానికి కావాల్సిన పరిమాణంలోనే తీసుకోవాలి. రోజూ 5 నుంచి 6 గ్రాముల కంటే ఎక్కువగా ఉప్పు తీసుకుంటే ఆరోగ్యపరంగా అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజానికి ఉప్పును ఎంత మితంగా తీసుకుంటే అంత నయం అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం కూరల్లో వేసుకునే ఉప్పుతో పాటు పలు కూరగాయలు, ఆకుకూరల్లోనూ కొంచెం పరిమాణంలో ఉప్పు ఉంటుంది. బయటి నుంచి ఉప్పును అధికంగా వేయడం వల్ల కూర రుచిపోవడంతోపాటు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

శరీరంలో ఉప్పు శాతం ఎక్కువైతే తొలుత డీ హైడ్రేషన్ కు గురవుతారు. ఆ తర్వాత రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. అంటే రక్తపోటు నియంత్రణ స్థాయి కంటే మించిపోయి రక్తపోటుకు దారి తీస్తుంది. శరీరంలో ఉప్పు శాతం పెరిగితే జీవక్రియలన్నీ ఒకదాని వెంట ఒకటి మారిపోతాయి. ఉప్పు ఎక్కువగా తీసుకునేవారు ఎక్కువ నీరు తాగాల్సి ఉంటుంది. అందుకు సరపడా నీరు తాగకపోతే శరీర కణాల నుంచి నీటిని లాగేస్తుంది. ఫలితంగా రక్తంలో ఘనపరిమాణం పెరుగుతుంది. దాంతో గుండెకు పని ఎక్కువవుతుంది. రక్తనాళాలపై ఒత్తిడి ఎక్కువై క్రమంగా రక్తపోటు సమస్య మొదలవుతుంది. శరీరంలో నీరంతా చెమట రూపంలో వెళ్లిపోవడంతో అధిక దాహం , తల నొప్పి, అలసట లాంటి సమస్యలు వస్తాయి.

అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతింటాయి. దీంతో గుండెలోని భాగాలకు ఆక్సిజన్తోపాటు పోషకాల సరఫరా ఆగిపోతుంది. ఫలితంగా గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. ఆహారంలో ఉప్పు పరిమితి కంటే మించితే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. సాధారణంగా మూత్రపిండాలు రక్తంలోని మలినాలను శుభ్రం చేసి వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. ఐతే శరీరంలో ఉప్పు శాతం ఎక్కువైనప్పుడు కాల్షియంను కూడా వడపోసి శరీరం నుంచి బయటకు పంపిస్తాయి. దీంతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే శరీరం నుంచి అధికంగా క్యాల్షియం బయటకు వెళ్లిపోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ వ్యాధి వచ్చే ముప్పు ఎక్కువ. ఫలితంగా ఎముకలు పలుచబడటం, గుల్లబారడం జరుగుతుంది…. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. అధిక ఉప్పు వాడకం.. జీర్ణాశయ గోడల్ని దెబ్బ చేస్తుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లు, వాపులు, క్యాన్సర్ సమస్యలు ఎదురవుతాయి…

శరీరంలో జీవక్రియలు అన్నీ సమర్ధంగా పని చేయాలంటే ఉప్పు చాలా అవసరం. ఐతే శరీరంలో నీరు, ఉప్పు శాతం సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. శరీరంలో నీరు ఎక్కువైతే సోడియం తగ్గిపోతుంది. అలాగే నీరు తగ్గితే సోడియం పెరిగిపోతుంది. దీని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉప్పు వినియోగం ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది. ఇది శరీరాన్నిబట్టి మారుతుంది. ఎవరి శరీర లక్షణాలనుబట్టి వారు ఉప్పు పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. మొత్తంగా మితంగా ఉప్పు తీసుకుంటేనే ఆరోగ్యం . మధుమేహ రోగులు ఉప్పు పరిమాణాన్ని తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలి… అయితే ఇవ‌న్నీ ఆరోగ్య‌ప‌రంగా క‌లిగేవి. కానీ ఆరోగ్యం కాకుండా మిగ‌తా విష‌యాల్లో చూస్తే ఉప్పు మ‌న‌కు చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దాంతో మ‌నం ప‌లు ఇబ్బందుల‌ను ఎదుర్కోవచ్చు.

చ‌ర్మంపై ఉన్న మృత క‌ణాల‌ను తొల‌గించేందుకు ఉప్పు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతేకాదు ఉప్పు వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా కూడా మారుతుంది. స్నానం చేశాక కొద్దిగా ఉప్పును తీసుకుని మోచేతులు, మోకాళ్లు, ఇంకా ఇత‌ర న‌ల్ల‌గా ఉన్న ప్ర‌దేశాల్లో ఉప్పును రుద్ది ఆ త‌రువాత క‌డిగేయాలి. దీంతో అక్క‌డ ఉన్న చ‌ర్మ మృత క‌ణాలు పోతాయి. ఆ భాగాల్లో చ‌ర్మం మృదువుగా మార‌డ‌మే కాదు, కాంతివంతంగా కూడా అవుతుంది. కీటకాలు కుట్టిన ప్ర‌దేశంలో నొప్పి, మంట, ద‌ద్దుర్లను తగ్గించుకునేందుకు కూడా ఉప్పుతో ఉప‌శ‌మ‌నం పొందవచ్చు. సముద్రపు ఉప్పు మాడును పొడిబారకుండా కాపాడుతుంది. దీనివలన చుండ్రు సమస్య ఏర్పడదు. అయితే వైద్యుల సలహాతోనే ఈ ఉప్పును వాడే మోతాదును నిర్ణయించుకోవాలి.

ఆరోగ్యకరమైన వ్యక్తులు రోజూ 2 గ్రాముల నుంచి 6 గ్రాముల వరకు ఉప్పు వాడుకోవచ్చు. అలాగే నిల్వ ఉండే పచ్చళ్లు తరచుగా తీసుకోవడం మంచిది కాదు. వీటిలో ఉప్పు శాతం అధికంగా ఉంటుంది. అలాగే చిరుతిళ్లు కూడా తగ్గించుకోవాలి.

Leave a Comment