నేటి ఉరుకుల పరుగుల జీవనం కారణంగా కీళ్లపైన విపరీతంగా ఒత్తిడి పెరుగుతోంది. ఎక్కువ సమయం కూర్చోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం, సరైన పోషకాహారం తీసుకోలేకపోవడం లాంటి కారణాల వల్ల ఈ సమస్యలు మరింతగా పెరుగుతున్నాయి. మరి కీళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి?
కాళ్ళు చేతులలో ఉన్న కీళ్ళు మన శరీర కదలికకు మనం వివిధ రకాలైన పనులు చేయడానికి తోడ్పడతాయి. కీళ్లు కదిలేవిగా, కదలనివిగా ఉంటాయి. 55 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళలో ముఖ్యంగా కీళ్ళ వ్యాధుల వలన బాగా నడవలేని స్థితి వస్తుంది. కీళ్లనొప్పులు సాధారణంగా వృద్ధాప్యంలో ఎవరికైనా వస్తాయి. మోకాళ్లు, పాదాలు, తుంటి, మోచేయి, భుజాలు తదితర భాగాల్లో ఉండే కీళ్లు నొప్పులకు గురవుతాయి. అయితే నేటి తరుణంలో యుక్త వయస్సులో ఉన్నవారిని కూడా కీళ్ల నొప్పులు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒకటి కంటే ఎక్కువ కీళ్ళు వాయడాన్ని ఆర్థరైటిస్ అని వ్యవహరిస్తారు. మన శరీరంలోని కదలికలకు వెన్నెముక, మోకాలి కీలు, తుంటి కీలు చాల ముఖ్యమైనవి. కీళ్లు బలంగా ఉండాలంటే, కండరాలు, లిగమెంట్లు, టెండాన్లు బలంగా ఉండాలి. వ్యాయామం, సరైన ఆహారం, ఇతర రక్షణ పద్థతుల ద్వారా కీళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోలేని పక్షంలో దీర్ఘకాలిక నొప్పితో బాధపడతారని వైద్య నిపుణులు సెలవిస్తున్నారు.
కదలికల అవసరాన్ని బట్టి కీళ్ళు శక్తిని పొందడమా లేదా కోల్పోవడం జరుగుతుంది. నిర్దిష్టమైన విధానంలో కీళ్లను కదిలించడం వల్ల అవి బలంగా తయారవుతాయి. శరీరం భౌతికంగా ఉత్తేజితం కావడనానికి వ్యాయామం చేయడం వల్ల కీళ్ల చలనశక్తి పెరిగి బలంగా తయారవుతాయి. నిత్యం వ్యాయామం చేయడం వల్ల కీళ్లలో రక్తం, సైనోవియల్ అనే ద్రవం ప్రసరణ జరిగి కీళ్లు సాఫీగా పనిచేస్తాయి. మితిమీరి వ్యాయామం చేయకూడదు. శరీరం బరువు తగ్గించుకుదుకు తేలికపాటి వ్యాయామాలు ఎంచుకోవాలి. భారీ బరువులు ఎత్తకుండా జాగ్రత్తపడాలి. ఎక్కువ కూర్చొని, ఎక్కువ నిల్చుని చేసే పనుల్లో కీళ్లపై ఎక్కువగా భారం పడుతున్నందున వాటికి మధ్యమధ్య విశ్రాంతి ఇవ్వాలి. కంప్యూటర్ పై పనిచేసే వారు సరైన భంగిమలో కూర్చోవాలి. కంప్యూటర్ల వద్ద ఆర్మ్ రెస్ట్ తప్పనిసరిగా వినియోగించాలి.
కీళ్ల ఆరోగ్యానికి భౌతిక వ్యాయామంతోపాటు మానసిక ఒత్తిడి నివారణ కూడా జరుగాలి. నోప్పికీ ఇంకా ఒత్తిడి, ఆతృత, మరియు సంక్షోభం లాంటి భావోద్వేగ ఆరోగ్య సమస్యలకు ఒకదానికి మరొకటి ముడిపడి ఉంటుంది. యోగ సాధన ద్వారా కీళ్లపై ఒత్తిడి తగ్గించుకోవచ్చు. అలాగే థాయ్‌చీ, పైలేట్స్ వంటి సున్నిత వ్యాయామాలతో కీళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. నిత్యం ఎనిమిది గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవడం వల్ల కీళ్లు బలంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి.
పెద్దపనులు చేసిన తర్వాత, వ్యాయామం తర్వాత కీళ్లపై చల్లని, లేదా వేడి వార్మ్ ప్యాక్‌తో విశ్రాంతి కల్పించాలి. కీళ్లకు అలసట తగ్గించడానికి మసాజ్ కూడా చేయించుకోవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా కూడా కీళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కాల్షియం అధికంగా లభించే పాలు, పెరుగు, అత్తి పండ్లు, సాల్మన్ చేపలు ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్ సీ అధికంగా ఉండే సిట్రస్ జాతి పండ్లతో పాటు విటమిన్ బీ3, ఈ తోపాటు నీరు అధికంగా తీసుకోవాలి. విటమిన్ డీ లభించేలా ఉదయం నీరెండలో కొద్దిసేపు గడపాలి. మద్యం, శీతలపానీయాలు, సిగరెట్ పూర్తిగా మానుకోవాలి.







