Oats Health Benefits – నిజంగా ఓట్స్ తింటే మంచిదేనా?

By manavaradhi.com

Published on:

Follow Us
Health Benefits of Oatmeal

నేడు ఓట్స్ వాడకం ఎంతో పెరిగిపోయింది. ఇది సంవత్సరం పొడవునా పెరిగే ఆరోగ్యకరమైన పంట. వీటిలో కార్బోహైడ్రేట్స్‌, మాంసకృత్తులు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు వీటిలో విటమిన్ B1, B2, B3, B5, B6, B9 పుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటిస్, గుండె సమస్యలు, నిస్సత్తువ, నరాల బలహీనత ఉన్న‌వారికి ఎంతగానో మేలు చేస్తాయి. ఓట్స్ తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెర‌గ‌కుండా నియంత్రణలో ఉంటాయి. దీంతో మ‌ధుమేహాన్ని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చు. అందువ‌ల్ల ఓట్స్‌ను వారికి మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు.

అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఓట్స్ మంచి ఆహారం. అధిక బరువును, వికారమైన పొట్టను కరిగించుకోవాలనుకునే వారికి చక్కని అల్పాహారం ఓట్స్.. ఇవి శరీరంలోని చెడు కొవ్వు నిల్వలు తగ్గించడానికి.. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించడానికి చక్కగా ఉపయోగపడతాయి. అందువల్ల పోషకాహార నిపుణులు వీటిని తప్పనిసరిగా తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. గుప్పెడు ఓట్స్‌ తీసుకుంటే అందులో ఉండే బీటా గ్లూకాన్ కొవ్వుని కరిగించేందుకు, జీర్ణశక్తిని మెరుగుపరిచేందుకు సాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఓట్స్ లో మెగ్నీషియం ఉంటుంది. ఈ మెగ్నీషియం రక్తపోటును నియంత్రిండానికి, రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఉండటానికీ తోడ్పడుతుంది. దీనివల్ల అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. దీంతో శ‌రీర క‌ణ‌జాలం దెబ్బతినకుండా ఉండటమే కాకుండా నొప్పులు, వాపులు త‌గ్గుముఖం పడతాయి. ఆస్తమా వ్యాధి నుంచి మొదలుకొని క్యాన్సర్‌ వరకు ఓట్స్‌ వల్ల మనకెన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి. కండరాలను ఆరోగ్యకరంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇవేకాక ఎన్నోరకాల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మంచి ఔషధంగా పనిచేస్తుందని ఓ సర్వేలో తేలింది. రెగ్యులర్ డైట్ మెనూలో భాగంగా ఫైబర్ మరియు పోషకాలతో.. తక్కువ పిండి పదార్ధాలున్న ఓట్స్ ను తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతిరోజూ ఆహారంలో ఓట్స్ ను తీసుకోవడం వల్ల నడుము చుట్టుకొలత తగ్గుతుంది. జీవక్రియల రేటు పెరుగుతుంది. ఇవి సులభంగా జీర్ణమవడమే కాకుండా శరీరంలోని జీవక్రియల రేటును పెంచడానికి.. అనేక అనారోగ్యాలు, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను తగ్గించడానికి చక్కగా తోడ్పడతాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. కేవలం ఓట్స్ ని మాత్రమే తినడం వల్ల మన శరీర వ్యవస్థలు నియంత్రణలో ఉండవు. జీవనశైలిలో మార్పులు కూడా చేసుకోవాలి. కంటినిండా నిద్ర, పోషక విలువలుండే కూరగాయలు, పండ్లు తీసుకుంటూ.. క్రమం తప్పకుండా వ్యాయామం చేసినట్లైతే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఓట్స్ లో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల పెద్దపేగు పనితీరు మెరుగుపడుతుంది. దీంతోపాటు చర్మం మృదువుగా, తేమగా ఉండటానికి కూడా సహాయపడతాయి.

Leave a Comment