Health Tips – తృణ ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు..!

By manavaradhi.com

Published on:

Follow Us
Health Benefits of Millets

ఈ ఆధునిక కాలంలో అన్నీ ప్రాసెస్ చేసిన ఆహారాలే ఎక్కువగా తీసుకుంటున్నాం. పాలిష్ చేసిన బియ్యాన్ని రోజూ.. అన్నంగా వండుకుని తింటున్నాం. వీటి వల్ల .. మన శరీరానికి పిండి పదార్థం తప్ప .. మిగతా ఏ పోషకాలు లభించడం లేదు. అందుకే రోజువారీ డైట్ లో తృణధాన్యాలు తీసుకుంటే శరీరానికి విటమిన్లు , ఖనిజ లవణాలు, లభిస్తాయని ఆహార నిఫుణులు సూచిస్తున్నారు. రాగులు, సజ్జలు, జొన్నలు, గోధుమలు ..ఇలాంటి వాటిని తృణ ధాన్యాలుగా పిలుస్తారు. వీటిని రోజూ ఆహారంలో తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. తృణ ధాన్యాలలోని ప్రోటీన్లు శరీరానికి అందడమే కాక పీచు పదార్థాలు ఉండడం వలన త్వరగా జీర్ణం అవుతాయి. మూత్రాశయంలో రాళ్లు ఏర్పడకుండా కాపాడతాయి. గుండె జబ్బుల్ని దూరం చేసుకోవచ్చు. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తహీనత ఉన్న వారిలోనూ ఎర్ర రక్తకణాలు వృద్ధి చెందుతాయి…

తృణ ధాన్యాలలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, విటమిన్ లు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి విలువైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇలా అత్యధికంగా ప్రోటీన్లు, కాల్షియం, అధిక శాతంలో ఫైబర్ లాంటి పోషక పదార్థాలు లభిస్తుండడంతో శరీరం వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు ఆహార నిపుణులు. తృణధాన్యాలను రాత్రంతా నానబెడితే విత్తనాలు మొలకెత్తుతాయి. ఇలా మొలకెత్తిన విత్తనాల్లో బి కాంప్లెక్స్కు సంబంధించిన విటమిన్లు మాత్రమే కాకుండా ఐరన్, క్యాల్సియమ్, ఫైబర్లు అధిక స్థాయిలో లభిస్తాయి. ఈ విత్తనాలతో పాటు రుచికరమైన క్యారేట్, బ్రీట్రూట్, దోసకాయలు జతచేసి ఉదయాన్నే అల్పాహారంగా చేసుకోవచ్చు.. రోజులో ఇలాంటి ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం కల్పిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందంటున్నారు ఆహార నిపుణులు….

తృణ ధాన్యాలు ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా తినడానికి రుచి గా కూడా వుంటాయి. ఇందులో రాగులు సులభంగా జీర్ణమవుతాయి. జీర్ణ వ్యవస్థకు, కాలేయానికి మేలుచేసి చక్కటి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. వీటిలో ఉండే ఐరన్ రక్తహీనతను దరి చేరకుండా చూస్తుంది. మెగ్నీషియం మైగ్రేన్ తలనొప్పి, గుండె సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. కాల్షియం ఎముకల పటుత్వాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలనూ దూరం చేస్తుంది. రాగుల్లో ఉండే విటమిన్ బి3, అమినో ఆసిడ్ కొలెస్టరాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఆకలిని తగ్గించి ఊబకాయం రాకుండా చూస్తుంది. ముఖ్యంగా పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఫలితంగా మలబద్దకం దూరమవుతుంది.

రాగుల్లోని ఆంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ కారకాలను బయటికి నెట్టి వేసి ఆరోగ్యానికి తోడ్పడుతాయి.. తృణ ధాన్యాలలో ఓట్స్ కూడా ప్రధానమైనవే. ఓట్స్ లో పీచు పదార్థం, విటమిన్ బి-2, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్స్ కూడా ఓట్స్ లో ఎక్కువే. ముఖ్యంగా పిల్లలకు ఆహారంలో ఓట్స్ను ఏదో ఒక రూపంలో అందించడం వలన వారికి మంచి పోషక విలువలు లభిస్తాయి. అలాగే ఓట్స్తో రకరకాల రుచికరమైన పదార్థాలు చేసుకోవచ్చు. ప్రధానంగా నీటిలో కరిగే పీచుతో పాటు కరగని పీచు కూడా ఓట్స్ లో ఉంటుంది. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉండేలా ఈ ఓట్స్ మనకు సహకరిస్తాయి. అంతేకాకుండా ఓట్స్.. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర మోతాదు హఠాత్తుగా పెరగకుండా చేస్తాయి. నెమ్మదిగా జీర్ణమవుతూ రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తాయి. కాబట్టి మధుమేహం రాకుండా కాపాడతాయి. ఓట్స్ల్లో జింక్, విటమిన్ ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి…

ఇంత చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తృణధాన్యాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. శరీరానికి కావాల్సిన సమతుల పోషకాలు అందించండి. తృణధాన్యాలను నానబెట్టి, ఉడికించి వివిధ పద్ధతులలో ఆహారంగా తీసుకోవచ్చు. కానీ వీటిలో ఉండే పోషకాలు నశించేలా ఉడికించకూడదు. అప్పుడే సహజ సిద్ధమైన పోషక విలువలు మనకు అందుతాయని గుర్తుంచుకోండి.

Leave a Comment