Ramayana:నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’ (Ramayana) గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రాన్ని ఆస్కార్ అవార్డుల పరిశీలన కోసం సమర్పించినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థకు చెందిన ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ వార్తతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
అయితే, ఈ ఏడాది భారత్ తరఫున మరాఠీ చిత్రం ‘గోంధాల్’ (Gondhal) ఆస్కార్స్‌లోని ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి అధికారిక ఎంట్రీగా ఎంపికైన విషయం తెలిసిందే. మరి అలాంటప్పుడు ‘రామాయణం’ కూడా ఆస్కార్ బరిలోకి ఎలా ప్రవేశిస్తుందనే సందేహం చాలామందిలో వ్యక్తమవుతోంది.
దీనిపై స్పష్టత ఏమిటంటే.. ఆస్కార్ పోటీల్లో ఒక దేశం నుంచి అధికారికంగా ఎంపికైన సినిమా మాత్రమే కాకుండా, అకాడమీ నిబంధనలకు అనుగుణంగా ఇతర చిత్రాలు కూడా ఆయా విభాగాల్లో స్వతంత్రంగా సమర్పణకు అవకాశం ఉంటుంది. అకాడమీ నిర్దేశించిన అర్హతలు, ప్రమాణాలను పూర్తి చేస్తే నిర్మాతలు తమ సినిమాలను ఆస్కార్ పరిశీలనకు పంపించవచ్చు. ఈ నేపథ్యంలో ‘రామాయణం: పార్ట్ 1’ చిత్రాన్ని ఆస్కార్ పరిశీలనకు సమర్పించినా, అది భారత్ అధికారిక ఎంట్రీగా ఎంపికైన ‘గోంధాల్’కు పోటీగా లేదా ఆ నిర్ణయానికి విరుద్ధంగా భావించాల్సిన అవసరం లేదు. అయితే ఆస్కార్ పరిశీలనకు సమర్పించడం, తుది నామినేషన్‌కు ఎంపిక కావడం రెండూ వేర్వేరు దశలు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఇక ‘రామాయణం’ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కీలక పాత్రల్లో నటించారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రంపై మొదటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ (VFX), గ్రాఫిక్స్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
ఆస్కార్ పరిశీలనకు ఈ చిత్రాన్ని సమర్పించారన్న వార్త నిజమైతే, అంతర్జాతీయ స్థాయిలోనూ ‘రామాయణం’కు గుర్తింపు లభించే అవకాశాలపై చర్చ మరింత పెరగనుంది. అయితే ఈ వార్తపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆస్కార్ బరిలో ఈ చిత్రం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.









