Make up Tips:మేకప్ వేసుకొనేవాళ్ళు ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి

By manavaradhi.com

Published on:

Follow Us

మహిళలు అందరికంటే ప్రత్యేకంగా ఉండాలని కోరుకోవడం సహజం. అందానికి, అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. బ్యూటీపార్లర్‌కు వెళ్లి అలంకరించుకొనే వారు ఎందరో. సౌందర్యం కోసం ఎన్నో రకాల సౌందర్య సాధనాలు, మేకప్‌ పరికరాలు వినియోగిస్తున్నారు. రకరకాల కాస్మోటిక్స్ తో తమ అందానికి మెరుగులు దిద్దుతూ ఉంటారు. చర్మానికి ఎక్కువ పౌడర్’లను పూయటం అంత మంచిది కాదు. వీటి వలన చర్మ కణాల మద్య ఉండే గీతల మధ్యలో పౌడర్ ఇరుక్కుపోతుంది. మీ చర్మం మృదువుగా కనపడాలి అనుకుంటే వీటిని ఎక్కుగా వాడకూడదు.

కొందరు ఎక్కువగా ముఖం కడుక్కోవడం, మర్దన చేసుకోవడం వంటివి చేస్తుంటారు. అలాంటప్పుడు కొన్ని పొరపాట్లూ చేస్తుంటారు. అయితే ఆ పొరపాట్లు జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖం కడుక్కోవడానికి, మేకప్‌ వేసుకోవడానికి ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. లేదంటే చేతులకున్న మురికి, పైన పేరుకుపోయిన బ్యాక్టీరియా వంటివి చర్మంపై ప్రభావం చూపుతాయి. పొడి చర్మం వాళ్లు ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే సబ్బులో ఉండే ఘాటైన రసాయనాలు చర్మం మరింత పొడిబారేలా చేస్తాయి. తరచూ మాయిశ్చరైజర్లు రాసుకోవడం, నిపుణుల సలహాతో మంచి ఫేస్‌ వాష్‌ ని వాడాలి.

  • శరీరాన్ని శుభ్రపరచడానికి, అందంగా ఆకర్షణీయంగా కనిపించేలా చేయడానికి, శరీరం కనిపించే తీరును మార్చడానికి రకరకాల కాస్మటిక్స్‌ను వాడతారు. వీటివల్ల అనేక రకాలైన ఆరోగ్యసమస్యలు, ఇబ్బందులూ కలిగే ప్రమాదం ఉంది.
  • అందానికి మెరుగులు దిద్దుకునే టప్పుడు ముఖ్యంగా అందరి దృష్టి తల వెంట్రుకలపైనే ఉంటుంది. మార్కెట్లో దొరికే రకరకాల రంగులు, డైలు వాడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడడం మంచిది కాదు. దాని వల్ల జుట్టు సహజసిద్ధంగా ఎండిపోయినట్లుగా తయారు కావడానికి ఆస్కారం ఉంటుంది.
  • మస్కారా, ఐషాడో, కాజల్ వంటి పదార్థాలన్నీ కంటి అందానికి ఉపయోగిస్తుంటాం. ఇవి కంటి అందాన్ని రెట్టిపు చేస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ రోజంతా వీటితోనే ఉంటే కళ్ల నుండి నీరుకారడం, ఎర్రగా మారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చెప్పలంటే దురదలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది.

చర్మంపై ముడతలు, డార్క్ స్పాట్స్ పోవడానికి సౌందర్య సాధనాల్లో ఎక్కువగా హైడ్రోక్వినోన్ రసాయనం ఉన్న వాటిని వాడుతుంటారు. ఐతే హైడ్రోక్వినోన్ ఎక్కువ వాడకం వల్ల కేన్సర్ వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తవహించాలి. చాలామంది మేకప్‌ లాంటివి వేసుకున్నా రాత్రి పడుకునే ముందు శుభ్రం చేసుకోవడం మరిచిపోతారు. అలా రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోకపోతే ఎన్నో సమస్యలు తలెత్తె అవకాశం ఉంది. రాత్రిపూట మేకప్‌ తొలగించుకోకుండా పడుకుంటే మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. మేకప్‌ రాత్రంత పెట్టుకోవడం వల్ల చర్మం పొడిబారుతుంది. అంతేకాక నిర్జీవంగా తయారవుతుంది.

రోజూ మేకప్ చేసుకునే వారు దాన్ని శుభ్ర పరచుకునే విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే చర్మ రంథ్రాలు మూసుకుపోయి, సమస్యలు ఎదురు కావడానికి ఆస్కారం ఉంది. చర్మం విషయంలో అందం కోసం కంటే, ఆరోగ్యం మీద ప్రాధాన్యత ఉంచి ఆరోగ్యం దానంతట అదే మేలు చేస్తుంది. మేకప్‌లను ఇతరులతో పంచుకోకూడదు. ఒకరు వాడిన మేకప్‌లను మరొకరు వాడటం వల్ల చర్మంపైన వాడే కాస్మటిక్‌ బ్రష్‌లు, స్పాంజ్‌ల ద్వారా బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉంది. ముఖ సౌందర్యాలకు మెరుగులద్దడానికి ఉపయోగించే మేకప్ బ్రష్ ల వాడకం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం.. లేదంటే చర్మం సమస్యలు బాధించే ప్రమాదం ఉంటుంది.

మేకప్‌ ఎవరైనా సరే తరచూ వేసుకోకూడదు. ఎప్పుడో ఒకసారి మాత్రమే. నిత్యం మేకప్‌ వేసుకోవడం వల్ల చర్మ గ్రంథులు మూసుకుపోతాయి. చాలా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ప్రత్యేక సందర్భాల్లో వేసుకున్నా నాణ్యమైన, పేరున్న ఉత్పత్తుల్ని ఎంచుకోవాలి. నాసిరకం ఉత్పత్తుల్ని ఎంచుకుంటే అనేక రకాల ఆరోగ్యసమస్యలు కొనితెచ్చుకున్నట్లే. కాబట్టి మేకప్‌ విషయంలో తగిన జాగ్రత్తలను పాటించండి చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండి.

Leave a Comment