Arthritis – కీళ్లనొప్పులు బాధిస్తున్నాయా..!

By manavaradhi.com

Published on:

Follow Us
Arthritis Types, Symptoms, Diagnosis & Treatments

శ‌రీరంలోని ప్రతి క‌దలిక‌కూ మూలం… కీలు. జాయింట్లు… మృధువుగా, స‌జావుగా క‌దులుతుంటేనే మ‌న జీవితం హాయిగా, సుఖంగా, సౌక‌ర్యవంతంగా సాగుతుంది. జాయింట్స్ ప‌ట్ల చాలా జాగ్రత్త అవసరం. కీలు చిన్నగా డ్యామేజ్ అయినా మొత్తం శరీరం లేవలేని స్థితికి చేరుకుంటుంది. కీళ్ల వాపుల నుంచి రక్షించుకునేందుకు ఏంచేయాలి…?

నేటి ఆధునిక జీవనం.. కీళ్లపై మరింత ఒత్తిడి తీసుకువస్తున్నది. కీళ్ల సమస్య ఉన్నప్పుడు ముందుగా కీళ్లు అతుక్కునే భాగమైన ఆర్టిక్యులర్ కార్టిలేజ్ నుంచే మార్పులు మొదలవుతాయి. ఏ కారణం వల్ల కీళ్లు ప్రభావితమైనా… ఈ కార్టిలేజ్ పలుచబడి, సాగి, ముడతలు పడుతుంది. కీళ్ల భాగంలో పొలుసుల మాదిరిగా ఏర్పడతాయి. ఫలితంగా కీళ్ల కదలికలకు అంతరాయం ఏర్పడుతుంది. దీని పక్క భాగంలోని రక్తనాళాలు ఉబ్బడం ద్వారా కార్టిలేజ్‌కు ఎక్కువగా రక్తసరఫరా జరుగుతుంది. ఈ మార్పుల వల్ల ఆస్టియోసైట్స్ ఏర్పడతాయి.

సాధారణంగా ప్రతి 40 రోజులకు పాత ఎముక కణాలు చనిపోయి, కొత్తవి పుడుతుంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఉన్నప్పుడు ఈ కణాలు ఎముక అరిగిన దగ్గర కాకుండా వేరేచోట ఏర్పడతాయి. తద్వారా ఈ ఆస్టియోపైట్స్ కీళ్లను రాపిడికి గురిచేస్తాయి. దీనివల్ల కీళ్లు గట్టిపడటం, వాపు మొదలైనవి కలుగుతాయి. కీళ్ల లోపలి ద్రవం సన్నని రంధ్రాల ద్వారా ఎముకల మధ్యకు వెళ్లి గడ్డలుగా తయారవుతాయి. ఈ కారణంగా ఎముకలోని ట్రాబిక్యులే అనే భాగానికి నష్టం వాటిల్లుతుంది. క్రమంగా కీళ్లలోని జిగురు పదార్థం తగ్గడం వల్ల కీళ్లు గట్టిగా మారి కదలికలో ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఆర్థరైటిస్ ఎక్కువగా తుంటి, వెన్నెముక, పాదం, చేతుల్లోనూ, వేళ్లలోనూ, మోకాలి జాయింటుల్లోనూ ప్రభావం చూపిస్తుంది.

ఆర్థరైటిస్ సాధారణంగా… ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్ , సోరియాటిక్ ఆర్థరైటిస్… గా వస్తుంది. ఎముకల చివరన కార్టిలేజ్ అరిగిపోయి, ఎముకలు ఒకదానికొకటి ఒరుసుకుపోయి… అక్కడ నొప్పి, వాపు వస్తుంది. కూర్చుని లేచినప్పుడు, ఉదయం పూట లేచినప్పుడు జాయింట్లు పట్టినట్లుగా ఉంటాయి. నడుస్తుంటే కీళ్లలో టక్ టక్ మనే శబ్దం వస్తుంది. కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మోకాళ్లపై ఒత్తిడి భరించలేకపోవడం, కదల్చలేకపోవడం, నిల్చోలేకపోవడం, నడవలేకపోవడం వంటి సమస్యలుంటాయి. స్త్రీలలో ముఖ్యంగా నెలసరి ఆగిపోయిన వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. చిన్న వయసులో గర్భాశయం తొలగించిన వారిలో, హార్మోన్ల అసమతుల్యత, వంశపారంపర్యత, కొన్ని సొరియాసిస్, థైరాయిడ్ వ్యాధుల ప్రభావం వల్ల, కీళ్ల పైన ఒత్తిడి పెరిగి ఎప్పుడూ నొప్పి, వాపు, జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది. అస్టియో ఆర్థరైటిస్ నేరుగా కీళ్లపైన ప్రభావం చూపించడం వల్ల మనిషి కదల్లేని పరిస్థితులు వస్తాయి.

రుమటాయిడ్ ఆర్థరైటిస్.. ఒక కీలుకు పరిమితం కాకుండా శరీరంలోని అన్ని జాయింట్స్‌కూ విస్తరిస్తుంది. పురుషుల్లో కంటే స్త్రీలలో సాధారణంగా కనిపిస్తుంది. 30 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సులో ఎక్కువగా కనిపిస్తుంది. శరీరంలోని సహజ రక్షక వ్యవస్థ కీళ్లపైన దాడి చేస్తుంది. వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశమున్నందున దీనిని.. ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అని కూడా అంటారు. చలి కాలంలో దీని బాధ ఎక్కువగా ఉంటుంది. చిన్న కీళ్లు అయిన చేతివేళ్ళు, మోకాలి జాయింట్స్‌కు, మణికట్టు కీలుకు, కాలివేళ్ల కీళ్లకు ఎక్కువగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఉదయం పూట నొప్పులు ఎక్కువగా ఉండి, కదల్లేని పరిస్థితి కనిపిస్తుంది. నిరంతరం ఒళ్లు వేడిగా ఉంటుంది. ఆకలి తగ్గుతుంది. మూత్రవిసర్జన అధికంగా ఉంటుంది. నీరసం, బరువు తగ్గిపోవడం, జ్వరం, ఆకలి లేకపోవడంలాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అయితే, ఈ వ్యాధి లక్షణాలు స్థిరంగా ఉండవు.

గౌట్… జీవక్రియ వల్ల ఉత్పన్నమయ్యే యూరిక్‌ ఆసిడ్‌ అధిక మోతాదులో ఉండటం వలన క్రిస్టల్స్‌ రూపంలో ఏర్పడతాయి. ఈ సమస్య స్త్రీల కంటే పురుషుల్లోనే ఎక్కువగా వస్తుంది. రక్తంలో అధిక మోనోసోడియం క్రిస్టల్‌ రూపంలో కీళ్లలోనికి చొచ్చుకుపోయి ఆయా భాగాలలో వాపు, నొప్పి వస్తుంది. గౌట్‌ సాధారణంగా కాలి బొటన వేలులో మొదలై మిగిలిన కీళ్లపై ప్రభావం చూపుతుంది. ఇందులో వాపు, ఎరుపుదనం, వేడి, తీవ్రమైన నొప్పి ఉంటుంది. అలాగే, సొరియాసిస్‌ అనే చర్మవ్యాధి బారిన పడిన వారిలో సోరియాటిక్ ఆర్థరైటిస్ కనిపిస్తుంది. తల, మోచేయి, మోకాలు, మెడ ప్రాంతాల్లో పొలుసుల మాదిరిగా చర్మం ఎర్రగా మారుతుంది. రెండు చేతులు, కాళ్లలోని జాయింటులు దీని ప్రభావానికి లోనవుతాయి. చేతి వేళ్ళు, కాలి వేళ్లల్లో నొప్పి , వాపు ఉంటుంది. పాదం నొప్పిగా ఉంటుంది. కొందరిలో స్పాండిలైటిస్ డెవలప్ అయి నడుం నొప్పి మొదలవుతుంది.

ఎక్కువ సమయం కూర్చోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం వంటి కారణాలు కీళ్ల జబ్బులకు పరోక్షంగా దోహదపడుతున్నాయి. వంశపారంపర్య కారణాల వల్ల కూడా ఈ సమస్యలు చుట్టుముట్టే అవకాశం లేకపోలేదు. శరీర రక్షణ వ్యవస్థకు సంబంధించిన లోపాలు, సమస్యలు కూడా కీళ్లజబ్బులను పెంచుతాయి. వీటన్నింటికి తోడు కొన్ని రకాల వ్యాధులు ప్రమాదాల్లో గాయపడడం వల్ల కీళ్లు దెబ్బతిని చాలా సందర్భాల్లో అంగవైకల్యాన్ని కూడా సంభవించవచ్చు. కీళ్లలో సమస్య ఉన్నప్పుడు మోకాళ్లు, ఇతర కీళ్ల భాగం విపరీతమైన నొప్పి, వాపు, బిగుతుగా ఉండడం, నడవడానికి ఇబ్బంది వంటివి బాధిస్తాయి. మెల్లమెల్లగా కీళ్లు దాని రూపాన్ని కోల్పోవడంతో కాలు నిర్మాణంలో కూడా తేడా కనిపిస్తుంది. సకాలంలో దీనికి చికిత్స తీసుకోకపోతే అంగవైకల్యం వచ్చే అవకాశముంది. కీళ్లలో అరుగుదల, నష్టం ఎక్కువైన తరువాత కీళ్ల కదలిక తగ్గుతుంది. కండరాల పటుత్వంలో అసమానతలు ప్రారంభమవుతాయి. కూర్చుని లేచినప్పుడు, మెట్లు ఎక్కడం, దిగడం వంటి సందర్భాల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మన టాయిలెట్లు ఉపయోగించడం కూడా సమస్య అవుతుంది.

కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభించాలంటే వారానికి రెండుసార్లు చేపలు తినాలని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. సాల్మొన్‌, తాజా ట్యూనా వంటి చేపల్లో అధికంగా లభ్యమయ్యే ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు కీళ్ల నొప్పుల నివారణకు ఉపయోగపడుతుంది. కాల్షియం అధికంగా ఉండే పాలు, పెరుగు, కోడిగుడ్లు, కీర, బొప్పాయి, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి అధికంగా ఉండే జామ, నారింజ, నిమ్మ వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. క్యారెట్ జ్యూస్, క్యాబేజ్ సూప్ తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి. మసాలా వస్తువులు తినడం మానేయాలి. అధిక బరువును తగ్గించుకోవాలి. నడుం ముందుకు వంచకుండా నిలబడేలా చూసుకోవాలి. పడుకునేటప్పుడు మోకాళ్ల కింద మెత్తటి దిండు పెట్టుకోవాలి. బరువులు ఎత్తకూడదు.

అందరికీ పనులుంటాయి. అయితే పని వత్తిడి లేకుండా చూసుకోవడం ముఖ్యం. శరీరం బరువును తగ్గించుకోవాలి. నిత్యం వ్యాయామం చేస్తూ శరీరంలోని కీళ్లన్నీ ఇబ్బంది లేకుండా కదిలేట్లుగా ఉంచుకోవాలి. అప్పుడే కీళ్లు సక్రమంగా పనిచేస్తాయి… మనకూ ఇక్కట్లు తొలిగిపోతాయి.

Leave a Comment