Eyesight : కంటి ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

By manavaradhi.com

Updated on:

Follow Us
Eyesight

మానవ శరీరంలో అన్ని అవయువాలకంటే కళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కంటిచూపు లేకుంటే జీవితమే అంధకారం అవుతుంది. ఈ ఆధునిక ప్రపంచంలో రోజురోజుకు చాలామంది కంటి జబ్బులకు గురవుతున్నారు. శాశ్వత చూపులేని వారు కొందరైతే.. దృష్టిలోపంతో మరికొందరు ఈ అందమైన ప్రపంచాన్ని చూడలేకపోతున్నారు. అసలు ఈ దృషి లోపాలని కారణాలు ఏంటి… దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

ఏటా లక్షల సంఖ్యలో కంటి చూపునకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ వైద్యులను సంప్రదిస్తున్నారు. వీటిలో కొన్ని శాశ్వత అంధత్వానికి దారితీసేవి కూడా ఉంటున్నాయి. కొందరికి కళ్లద్దాలు, మందులతోనే సమస్యకు చెక్ పెట్టవచ్చు. కొందరికి సర్జరీలతో నయం చేయడానికి అవకాశం ఉండవచ్చు. కొందరి విషయంలో అప్పటికే చేయి దాటి ఉండవచ్చు.కొన్ని సమస్యలు పైకి కనిపించవు. అయితే, కొంత కాలానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అదే వైద్యులను సంప్రదించినట్టయితే పరీక్షల ద్వారా సమస్యలను గుర్తించేందుకు వీలుంటుంది. కాంప్రహెన్సివ్ డైలేటెడ్ ఐ ఎగ్జామ్ ద్వారా చాలా వరకు కంటి సమస్యలు బయటపడతాయి.

గ్లకోమా, డయాబెటిక్, వయసును బట్టి వచ్చే మాక్యులర్ డీజనరేషన్ ఏఎండీ సమస్యలు తెలుస్తాయి. కొన్ని వ్యాధులు వారసత్వంగా సంక్రమిస్తుంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమాచారాన్ని వైద్యులకు తెలియజేయడం అవసరం. అప్పటికే కుటుంబంలో ఎవరైనా కంటి వ్యాధులతో బాధపడుతుంటే అవి వారసత్వంగా వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అప్పటికే ఏదైనా కంటి సమస్య ఉన్నట్టు బయటపడితే అది వారసత్వంగా వచ్చిందా, కాదా? అన్నది తెలుస్తుంది. దాన్నిబట్టి వైద్యం చేసేందుకు వీలుంటుంది.

ప్రస్తుతం చాలామంది అనేక కంటి సమస్యలతో సతమతమవుతున్నారు. చిన్న వయస్సులోనే దృష్టి లోపాలతో ఇబ్బంది పడుతున్నారు. క‌ంటి స‌మ‌స్య‌ల‌కు ప్ర‌ధానంగా పౌష్టికాహార లోపం, విటమిన్ల లోపం, నడి వయస్కులైన వారికి బీపీ, షుగర్‌ వ్యాధులు. కంటినరాల జబ్బు, నీటికాసులు, రేచీకటి, కలర్‌బ్లైండ్‌నెస్‌ వంటివి ప్రధానంగా వస్తాయి. కంటి జబ్బులను సకాలంలో గుర్తించకపోవడంతోనే దృష్టిలోపం అధికమవుతోంది.

వంశపారపర్యం, పౌష్టికాహారం లోపం, కంప్యూటర్లు, టీవీల ముందు, ఎక్కువ సేపు కూర్చోవడం వంటి కారణాలతో పిల్లల్లోనూ దృష్టిలోపాలు పెరుగుతున్నాయి. ముందుగా తలనొప్పితో బాధపడుతారు. బోర్డు సరిగా కనిపించదు. వీరిలో క్రమంగా మెల్ల కన్ను వస్తుంది. పరీక్షలు చేసి అద్దాలు వాడకపోతే ఐదేళ్లలోపు అంధత్వం వచ్చే ప్రమాదం ఉంది. సాయంత్రం 5 గంటలు దాటితే వీరికి కళ్లు సరిగ్గా కనిపించవు. ఇలాంటి విద్యార్థులకు ప్రతీ సంవత్సరం పరీక్షలు చేసి అవసరమైతే అద్దాలు మారుస్తూ ఉండాలి. 18 ఏళ్ల తర్వాత లేజర్ చికిత్స ద్వారా ఆపరేషన్ చేసి దృష్టి లోపాన్ని సవరిస్తారు. ఆ తర్వాత అద్దాలు వాడే అవసరం ఉండదు.

కంటి సమస్యలపై అశ్రద్ధ వహించకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. గదిలో లైట్లు ఆఫ్ చేసి చీకట్లో టీవీని వీక్షించకూడదు. ఒకవేళ చీకట్లో టీవీ వీక్షిస్తే నేరుగా కంటిపై టెలివిజన్ వెలుతురు పడి దృష్టిలోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళ్ళలో మంట ఏర్పడి ఎరుపెక్కినపుడు తోచిన మందులు, చిట్కాలు వాడకుండా కంటి డాక్టరును సంప్రదించాలి. కంటికి సరిపడా నిద్ర, విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం.

కళ్ళకు ఐ లైనర్ వాడేటప్పుడు కంట్లో చిన్న చుక్క కూడా పడకుండా జాగ్రత్త పడాలి. కంటికి ఎక్కువగా ఎండ తగలనివ్వక పోవడం, కళ్ళలో దుమ్ము లాంటివి పడకుండా చూసుకోవడం లాంటివి చేస్తుండాలి. విటమిన్ ఏ, పౌష్టికాహార లోపం వలన దృష్టిలోపం సంభవిస్తుంది. కాబట్టి స్వచ్ఛమైన ఆకుకూరలు, గుడ్లు, పాలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఏడాదిలో ఒకసారైనా తప్పనిసరిగా పూర్తి కంటిపరీక్షలు జరిపించుకోవాలి.

కంటి సమస్యలపై అశ్రద్ధ వహించకుండా జాగ్రత్తలు పాటించాలి. ఏ-విటమిన్, పౌష్టికాహార లోపం వలన కూడా దృష్టిలోపం సంభవిస్తుంది. చాలా మంది అవగాహన లోపంతో కంటి పరీక్షలు చేసుకోరు. దీనివల్ల కంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీని పట్ల అవగాహాతో దృష్టి లోపం ఉంటే తక్షణమే డాక్టర్‌ను సంప్రదించి తగు వైద్యం చేయించుకోవాలి.

Leave a Comment