సెల్ ఫోన్ అతిగా వాడితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా ?

By manavaradhi.com

Updated on:

Follow Us

మొబైల్ ఫోన్లు మన జీవితంతో విడదీయరాని భాగం అయ్యాయి. మనం ఇంట్లో ఉన్నా లేదా ఆఫీసులో ఉన్నా, సెల్ ఫోన్ ను ఉపయోగించకుండా ఏ పని పూర్తి కాదు. సెల్ ఫోన్ లేకపోతే అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ప్రపంచంలోని సెల్ ఫోన్ ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకు స్థిరంగా పెరుగుతూనే ఉంది. ఈ సెల్ ఫోన్ మన జీవితం మీద చూపిస్తున్న ప్రభావం అంతా ఇంతా కాదు. సెల్ ఫోన్లు మన జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చినప్పటికీ, అవి హానికరమైన రేడియేషన్ను విడుదల చేస్తాయనేది కొట్టిపడేయలేని వాస్తవం. సెల్ ఫోన్ల వాడకం అధికమైతే, మెదడులో కణితులు ఏర్పడే అవకాశం ఉందనే వార్తలను మనం తరచుగా వింటుంటాము. సెల్ పోన్ రేడియేషన్ శరీరంలో మెదడు నరాల్లో కణితులకు ఆస్కారాన్ని కల్పిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సెల్ ఫోన్ ద్వారా వచ్చే రేడియేషన్ డి.ఎన్.ఏ.లో కూడా మార్పులు చేయడానికి ఆస్కారం ఉంది అంటున్నారు.

సెల్ ఫోన్ వాడితే క్యాన్సర్ వస్తుందా అన్నాదానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని పరిశోధనలు .. సెల్ ఫోన్ వాడకానికి క్యాన్సర్ కు మధ్య సంబంధం లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. సెల్ ఫోన్ ఇచ్చే రేడియేషన్, మిగతా రేడియేషన్ తో పోలిస్తే చాలా తక్కువ అనేది వీరి వాదన. అయితే అధికంగా వాడడం వల్ల మాత్రం సమస్యలు తప్పకపోవచ్చని కూడా వాదిస్తున్నారు. సెల్ ఫోన్లు పూర్తి భద్రం కాకపోయినా, ఏ విధమైన ఇతర అనారోగ్య సమస్యలు కలిగించడానికి ఆస్కారం లేదు. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి వాటికి సెల్ ఫోన్ అనేక కారణాల్లో ఒకటే తప్ప…. అదే పూర్తి కారణం కాదని తేలింది. అయితే దీని మీద మరింత సమగ్రంగా అధ్యయనం జరగాలనే విషయాన్ని మాత్రం పరిశోధకులు అంగీకరించారు. అయితే పిల్లలు, వృద్ధుల విషయంలో మాత్రం సెల్ ఫోన్ రేడియేషన్ చూపిస్తున్న ప్రభావం ఎక్కువే.

స్మార్ట్ ఫోన్ వాడకాన్ని ఆపే పరిస్థితుల్లో ప్రస్తుత సమాజం లేదు కాబట్టి, కొన్ని రకాల మార్పులను వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ఫోన్ అధికంగా వాడే వారు ఇంట్లో, ఆఫీస్ లో ల్యాండ్ లైన్ ఫోన్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. అన్నీ ఫోన్లోనే అన్నట్లు కాకుండా, కొన్ని అవసరాలను కంప్యూటర్ లో తీర్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఎక్కువ సమయం ఫోన్ లో మాట్లాడే వారు దాన్ని చెవి దగ్గర పెట్టుకోవడం కంటే, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడ్డం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగింది. ఇంటర్నెట్ 24 గంటలు ఆన్ లో ఉంచి, అదే ఫోన్ తో మాట్లాడ్డం, ఇంటర్నెట్ వాడకం ఉన్న ఫోన్ ఆన్ లో ఉంచి తల దగ్గర పెట్టుకోవడం లాంటివి చేయకూడదు. అదే విధంగా ఎక్కువగా ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ లాంటివి వాడడం కూడా రేడియేషన్ నుంచి బయట పడే మార్గం. పిల్లలు, పెద్ద విషయంలో తక్కువ రేడియేషన్ కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తేలింది. అందుకే పిల్లలకు, వృద్ధులకు సాధ్యమైనంత వరకూ సెల్ ఫోన్ ను దూరంగా ఉంచాలి. ఇలా చిన్న పాటి జాగ్రత్తలు తీసుకో గలిగితే, సెల్ ఫోన్ రేడియేషన్ ద్వారా వస్తాయి అని భావిస్తున్న సమస్యలను దూరంగా పెట్టవచ్చు.

ఏదైనా ఒక స్థాయిని మించి వాడడం మంచిది కాదు. అది ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. అందుకే చిటికీ మాటికీ సెల్ ఫోన్ వాడేయకుండా అవసరమైన మేరకే దాన్ని వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

Leave a Comment