మనం తీసుకునే ఆహారంతోనే ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం గుండె జబ్బుల నివారణకు ఒక చక్కని మార్గం. రోజూ తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం మంచిది. అలాగే పలు ఆరోగ్యకరమైన ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల కూడా గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు. మరి గుండె సంరక్షణ కోసం నిత్యం మనం తినాల్సిన ఆ ఆహారాలు ఏంటి..?
మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి. ఇది శరీరంలోని అవయవాలకు రక్తాన్ని పంప్ చేస్తుంది. దీంతో అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. అయితే ప్రస్తుత తరుణంలో అస్తవ్యస్తమైన మన జీవన విధానంతోపాటు పలు ఇతర కారణాల వల్ల మనకు గుండె జబ్బులు వస్తున్నాయి. చాలా మంది హార్ట్ ఎటాక్‌ల బారిన పడి చనిపోతున్నారు. అయితే గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే.. మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి. దీనికి తోడు.. నిత్యం వ్యాయామం చేయడం, సరైన పౌష్టికాహారం తీసుకోవడం చేయాలి.
గుండె సంరక్షణలో కీలక పాత్ర వహించే ఆహారాల్లో ప్రధానమైనవి ఆకు కూరలు. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి ఇబ్బందికరమైన మలినాలను సులభంగా శుభ్రపరుస్తుంది. ఫలితంగా గుండెకు మంచి ఆరోగ్యాన్ని అందించగలం. ముదురు రంగులో ఉండే బీన్స్… గుండెకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. వీటిలో ఉండే ఫొలేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నీషియం అల్పరక్తపోటు నుంచి విముక్తి కల్పిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ మరియు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. సాల్మన్ చేపలు కూడా గుండె ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. ఇందులో ఒమేగా త్రీ ఎస్ ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె లయను అదుపులో ఉంచడంతో పాటు, రక్తపోటును తగ్గిస్తుంది.
గుండెకు ఎలాంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు, సరైన జీవనశైలిని అలవర్చుకోవాలి. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. అందులో చక్కెర, ట్రాన్స్ ఫాట్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది కొవ్వుని తగ్గించి, రక్త ప్రసరణను పెంచుతుంది. గుండె ఆరోగ్యం గురించి ఆలోచించే వారు నూనెల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ ను అధికంగా వాడడం మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, రక్తనాళాలను రక్షిస్తుంది. చిక్కుడు కాయల్లో ఉండే ప్రొటీన్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. పైబర్ ను కూడా అందించడం వల్ల ఉడకపెట్టి తీసుకునే చిక్కుళ్ళు గుండెకు మేలు చేస్తాయి.
బాందంలో క్యాల్షియం పాళ్లు ఎక్కువ. విటమిన్ ఇ కూడా ఎక్కువే. అందుకే బాదాం గుండెకు మేలు చేస్తుంది. మన ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదంలోని ఒమెగా 3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. కరోనరీ గుండెజబ్బులను నివారిస్తుంది. ఘాటయిన వాసన ఇచ్చే వెల్లుల్లి గుండెకు నేస్తం. ఇందులో సల్ఫర్ పరిమాణము ఎక్కువ ఉన్నందున ఘాటైన వాసన వస్తుంది. రోజుకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తిన్నట్లయితే కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది.
పండ్లలో ఆరెంజ్ లు గుండెకు మేలు చేస్తాయి. ఆరెంజ్ రసం రక్తనాళాలను సరైన స్థాయిలో ఉంచుతుంది. మనకు లభించే బచ్చలి కూరలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. రక్తపోటును తగ్గించడంలో ఇవి సాయం చేస్తాయి. ఫైబర్ తో పాటు విటమిన్ ఎ, యాంటి ఆక్సిడెంట్స్ లాంటివి గుండెకు మరింత మేలు చెస్తాయి. పెరుగులోనూ గుండెకు మేలు చేసే పోషకాలు అధికంగా ఉంటాయి. క్యాల్షియం, పొటాషియం లాంటి ఖనిజలవణాలు ఆరోగ్యాన్ని అందిస్తాయి. చెర్రీలు, బ్లూబెర్రీ లాంటి పండ్లను తీసుకోవడం వల్ల కూడా గుండెకు మేలు జరుగుతుంది.వాల్‌నట్స్‌ను నిత్యం గుప్పెడు మోతాదులో తింటే వాటిలో ఉండే మోనో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.
నిత్యం ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్ మీల్ తినాలి. ఓట్స్‌లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. డార్క్ చాకొలెట్లను తినడం వల్ల కూడా గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తం గడ్డకట్టకుండా చూస్తాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్‌లు రావు. అయితే ఈ ఆహారాలను మన ఆరోగ్యపరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, వైద్యుని సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. మనం తినే ఆహారం గుండె ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపుతుంది. గుండె ఆరోగ్యంగా వుండాలంటే రోజు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి.