Eating Food – ఆహారం.. ఇలా తీసుకోండి.. పోషకాలున్న ఆహారం తినడం ఎంత వరకు అవసరం ?

By manavaradhi.com

Published on:

Follow Us
Eating Food

మనం జీవించేందుకు… శరీర జీవన క్రియలన్నీ సజావుగా జరగడానికి శక్తి కావాలి. ఆ శక్తి ఆహారం ద్వారా లభిస్తుంది. అందుకే మనం జీవించడానికి ఆహారం ఎంతో అవసరం. మనం తీసుకునే ఆహారంలో సరైన నియమాలు పాటించకపోవడం వల్లనే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఏ ఆహారం ఎందుకు తీసుకోవాలి…? ఆయా ఆహారాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయి…? వేటిని దూరం పెట్టడం ద్వారా ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు… అనే అంశాలపై దృష్టి సారించడం ఆవశ్యం.

శరీర జీవన క్రియలు సక్రమంగా జరిగేందుకు అవసరమైన శక్తి పొందేందుకు ఆహారం తీసుకోవాలి. అయితే అదే ఆహారం.. ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టేవుగా ఉండకూడదు. మనం తీసుకునే ఆహారం నుంచి వీలైనంత ఎక్కువ ప్రయోజనం పొందేలా చూసుకోవాలి. పోషకాలు లేని ఆహారం తీసుకుని… తద్వారా ఆరోగ్యసమస్యలు కొనితెచ్చుకోకుండా చూసుకోవాలి.

సరైన పోషకాలున్న ఆహారం తినడం ఎంత అవసరమో.. ఏ సమయంలో తినాల్సిన ఆహారాన్ని అదే సమయంలో తీసుకోవడం కూడా అంతే అవసరం..! ఆహార విషయంలో నియమ నిబంధనలు, సమయపాలన పాటించకపోతే పోషకాలున్న ఆహారాన్ని ఎంత తీసుకున్నా వేస్టే అని గుర్తెరగాలి..! పైగా ఇలాంటి ఆహారం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకని ఏ ఆహారం ఏ సమయంలో తీసుకుంటే మంచిదో తెలుసుకోవడం బెటర్.

ఎప్పుడు, ఎలాంటి, ఎంత ఆహారం తినాలి అనే విషయాలను ముందుగా తెలుసుకోవాలి. వ్యాధులను నిరోధించటానికి.. శరీరం చురుకుగా పనిచేయడానికీ.. ఆరోగ్యంగా ఉండటానికీ ఆహారం అవసరం. నిత్యం ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ తప్పకుండా తీసుకోవాలి. అల్పాహారం తీసుకునే ముందుగా తాజా నిమ్మరసాన్ని వేడినీళ్ళల్లో కలుపుకుని తాగడం వల్ల ఆకలి వృద్ధిచెందుతుంది. రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఉదయం నిద్రలేవగానే తాగే నిమ్మరసం స్థూలకాయం తగ్గటానికి తోడ్పడుతుంది. నిమ్మరసంలో తేనెను కలిపి త్రాగవచ్చు. బ్రేక్‌‌ఫాస్ట్‌లో శరీరానికి శక్తిని సమకూర్చే పోషక విలువలు కలిగిన పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఆవిరి మీద ఉడికించిన ఇడ్లీలు, గోధుమ రవ్వతో చేసిన ఉప్మాతో పాటు తాజా పళ్ళను తీసుకోవడం ఆరోగ్యకరం. తాజా కూరగాయల రసాలను కూడా తీసుకోవచ్చు. ఓట్స్‌తో చేసిన పదార్థాలను తీసుకోవడం మంచిది. బ్రేక్‌ఫాస్ట్‌ ద్వారా శరీరానికి తగినంత శక్తిని అందించడం వల్ల.. పనులు అధికంగా ఉన్నా చురుకుగా, ఉత్సాహంగా, వేగంగా పూర్తిచేయగలుగుతారు.

మధ్యాహ్నం భోజనంలో అన్నం లేదా గోధుమ రొట్టెలు, తాజా ఆకుకూరలు, కూరగాయలతో చేసిన పదార్థాలు ఉండాలి. పోషక విలువలు పుష్కలంగా లభించే పదార్థాలు, శరీరపు బరువును పెంచని పదార్థాలను తీసుకోవాలి, మీగడ తీసేసిన పెరుగు, వెన్న తీసేసిన చిక్కని మజ్జిగతో ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారపదార్థాల తయారీలో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, నిమ్మరసం వాడాలి. వాటి వల్ల జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది. తీపి, నూనె, ఉప్పు, మసాలాలు తగ్గించి వాడాలి. కడుపునిండేంత వరకూ తినకుండా… కడుపులో కొంత ఖాళీ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే జీర్ణక్రియ చక్కగా సాగుతుంది.

 • ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయంలో ఆహారం తీసుకోవాలి.
 • వేళా పాళా లేకుండా ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆహారం తీసుకోవడమన్నది ఆరోగ్యహేతువు కాదు.
 • ఆహారం తీసుకున్న తర్వాత 4 గంటల కాలవ్యవధి తర్వాతనే ఏదయినా తినాలి.
 • అదే పనిగా చిరుతిళ్ళు, ఫాస్ట్‌ఫుడ్స్‌ తినకూడదు.
 • రాత్రి భోజనంలో తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి.
 • భోజనం చేసిన వెంటనే పడుకునేందుకు ఉపక్రమించకూడదు.
 • బరువు ఎక్కువ ఉన్నవారు రాత్రి పూట అన్నం తినకపోవడం మంచిది. రాత్రిపూట అన్నం తినడం వల్ల శరీరంలో అదనపు కొవ్వు చేరుతుంది.
 • రాత్రిపూట పాలు తీసుకుంటే ఎంతో మంచిది. దీనివల్ల చక్కగా నిద్ర పడుతుంది.
 • వ్యాయామం, శారీరకశ్రమ ఎక్కువగా చేసేవారు ఉదయంపూట పాలు తాగవచ్చు.
 • నిత్యం పరిగడుపునే యాపిల్స్ తినాలి. దీనివల్ల మలబద్దకం సమస్య తొలగిపోతుంది. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అలాగే శరీరంలోని విషపదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి.
 • యాసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తయ్యే ప్రమాదమున్నందున రాత్రి వేళల్లో యాపిల్స్ జోలికి వెళ్లకూడదు.
 • పెరుగు మధ్యాహ్న భోజనంలోనే తీసుకోవాలి. రాత్రిపూట తింటే శరీరంలో మ్యూకస్ వృద్ధి చెంది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
 • ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు సంపూర్ణంగా అందే వాల్‌నట్స్‌ సాయంత్రం వేళలోనే తినాలి.
 • అరటిపండ్లు మధ్యాహ్న భోజనం వెంట తీసుకోవాలి. జీర్ణ ప్రక్రియను మెరుగుపర్చడమే కాకుండా… జీర్ణాశయ సంబంధ అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు కూడా తొలగిపోయేందుకు అరటిపండు తోడ్పడుతుంది. రాత్రిపూట తింటే మ్యూకస్ పొర పెరిగి.. జలుబు వంటివి వచ్చే అవకాశాలున్నాయి. అలాగే పరగడపుననే అరటిపండ్లు తినడం ఆరోగ్యకరం కాదు.
 • శనగపప్పు, వేరుశనగ పప్పు, కందిపప్పు, చిక్కుడు తదితర గింజలు.. పప్పు జాతికి చెందిన ధాన్యాలను మధ్యాహ్నం పూట తీసుకోవాలి. ఫలితంగా శరీరానికి కావాల్సిన పీచు పదార్థం అధిక మొత్తంలో అందుతుంది. జీర్ణ ప్రక్రియ మెరుగుపడటమే కాకుండా… కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి.
 • మాంసం జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతున్నందున మధ్యాహ్న భోజనంగానే తినడం ఉత్తమం. దీనివల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు సరిగ్గా అందుతాయి.
 • మసాలా పదార్థాలను తరచూ ఆహారంలో తీసుకోకూడదు.
 • నిలువ ఊరగాయల్ని ప్రతిరోజూ మధ్యాహ్నం, రాత్రి ఆహారపదార్థాల్లో చేర్చకూడదు.
 • ఫ్రిజ్‌లో నిలవవుంచిన పదార్థాలను తినకపోవడం మంచిది.
 • ఆహార పదార్థాలలో ద్రవపదార్థాలను కూడా చేర్చాలి.
 • వారానికి ఒకసారి జీర్ణకోశానికి విశ్రాంతి నివ్వాలి.
 • పండుగలు, శుభకార్యాల సమయంలో ఆహారం అధికంగా తీసుకున్నప్పుడు… మరుసటి రోజు తేలికగా జీర్ణమయ్యే పదార్థాలను , ఆకుకూరలను తినాలి.
 • ఆకలిగా లేనప్పుడు ఆహారాన్ని తినకపోవడమే మంచిది.
 • రుచిగా ఉన్నాయనో… ఇష్టమనో అతిగా భుజించకూడదు.
 • భోజనం చేసిన అర గంట తర్వాత మంచినీరు తాగడం జీర్ణక్రియకు మంచిది.
  అలాగే, పోషక విలువలు లభించే, త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి. కొవ్వును పెంచే పదార్థాలను పక్కన పెట్టాలి. బరువును పెంచే పదార్థాలను తీసుకోకూడదు. సమీకృత ఆహారాన్ని తీసుకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

మనం ఎలా తింటున్నామన్నది … ఏమి తింటున్నాం అన్నంత ముఖ్యమైన విషయం. ఆహారాన్ని తీసుకునే విధానం, తీసుకునే ఆహారం, ఆహారపు నియమాలు, ఆహారపు అలవాట్లపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్నది మరిచిపోవద్దు.

Leave a Comment