సాధారణంగా మనం తీసుకొనే రకరకాల ఆహారాలు మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సమతుల ఆహారం తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఈ ఆహారం అందరికీ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందిస్తుంది. అయితే కొన్నిఆహారాలు స్త్రీ, పురుషులకు వారు చేసే రోజువారీ పనులను , వారి శరీర తత్వాన్ని, ఆరోగ్య స్థితిని బట్టి వేరువేరుగా ఉంటాయి. అయితే ఈ డైట్ విషయంలో పురుషులు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. ఈ ఆహారాలు వారి ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపెడతాయి.
ఆడవారితో పోలిస్తే.. పురుషులు మరింత దృఢంగా ఉంటారు. మగవారు చేసే పనులు.. శ్రమించే సమయం కూడా ఎక్కువే. అందుకే వారికి మరింత బలవర్ధకమైన ఆహారం అవసరం. మగవారు అన్ని రకాల కూరగాయలు తీసుకోవడం కూడా ఎంతో అవసరం. వీటి నుంచి సైటో కెమికల్స్ లభిస్తాయి. ఇవి శరీరంలోని కణజాలానికి ఇంధనంలా పని చేస్తుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. క్యారెట్ నుంచి బీటా కెరోటిన్, ల్యూటిన్, విటమిస్ C ఎక్కువగా లభిస్తాయి. ఇవి ప్రొస్టేట్ గ్రంథి సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. పాలకూర లాంటి ఆకుపచ్చని కూరల నుంచి మనకు అధికంగా ల్యుటిన్, జెక్సాంతిన్ లభిస్తాయి. ఇవి కంటిలో కాటరాక్ట్ సమస్యలు రాకుండా రక్షిస్తాయి.
కూరగాయలతోపాటు గుడ్డు తీసుకోడమూ ముఖ్యమే. గుడ్డు ద్వారా ల్యుటిన్, ప్రొటీన్, ఐరన్ లభిస్తాయి. రోజూ ఒక గుడ్డు తింటే 185 మిల్లీ గ్రాముల వరకు కొలెస్ట్రాల్ లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు పోషకాహార నిపుణులు. ఐతే ఇప్పటికే శరీరంలో అధిక కొలస్ట్రాల్ ఉన్న వారు మాత్రం వైద్యుల సలహా తీసుకుని గుడ్డును డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నారు.
పురుషులు ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. అధిక ప్రోటీన్లు ఎక్కువగా మాంసాహారాల్లో లభిస్తాయి. రెడ్ మీట్ తీసుకోవడం వల్ల లియోసిన్ అనే అమైనో యాసిడ్ లభిస్తుంది. ఇది కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే నత్తలు, పీతలు, రొయ్యల లాంటివి కూడా ఎక్కువగా తీసుకుంటే మంచిది. వీటి నుంచి శరీరానికి జింక్ లభిస్తుంది. ఇది కండరాలు, గుండె, ప్రత్యుత్పత్తి ప్రక్రియలో ఉపయోగపడుతుంది. జింక్ లోపాలు ఉన్న మగవారిలో శుక్రకణాల ప్రమాణం పడిపోయి సంతాన వైఫల్యం కలిగే అవకాశం ఉంది. ఐతే సీఫుడ్స్ ఇష్టపడని వారు.. చికెన్, నట్స్, గింజ ధాన్యాలు తీసుకోవడం ద్వారా జింక్ లోపాలను సరి చేసుకోవచ్చు.
ఆహారంలో మంచి ఫైబర్ లభించేలా చూసుకోవాలి. పీచు పదార్థాలు సరిగ్గా ఉన్న ఆహారం తీసుకుంటే జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. ఇది అన్ని జీవక్రియలు సాఫీగా సాగేలా ఉపయోగపడుతుంది. బ్రౌన్ రైస్.. లీన్ మీట్, పాలకూర, పైన్ యాపిల్, చిరు ధాన్యాల లాంటి వాటి నుంచి పీచు అధికంగా లభిస్తుంది. పీచు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. గుండె సమస్యలు, టైప్ – 2 డయాబేటీస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి.. పీచు అధికంగా లభించే పదార్థాలు తీసుకోవాలని న్యూట్రీషియన్స్ సూచిస్తున్నారు.
మగవారికి కండరాలు బాగా పెరగాలంటే ల్యూసిన్ లాంటి అమినో యాసిడ్స్ చాలా అవసరం. ఇది పాలు, మజ్జిగ నుంచి లభిస్తుంది. అలాగే చెర్రీ జ్యూస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ గా పనిచేస్తుంది. అరటి పండ్లు ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడడమే కాకుండా రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. తాజా పండ్లతోపాటు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. వాటి నుంచి ప్రొటీన్, ఫైబర్, జింక్ లభిస్తాయి. వీటి నుంచి లభించే ఖనిజ లవణాలు శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలను సరిగ్గా ఉంచుతాయి.
శరీరం ఒకే బరువున్న స్త్రీ పురుషులు ఒకే రకమైన కొవ్వు నిల్వలు కలిగివున్నా, వారు వ్యాయామం ద్వారా ఖర్చుచేసే క్యాలరీలు కూడా ఒక్కటే అయినా స్త్రీపురుషులకు క్యాలరీల అవసరం మాత్రం వేరువేరుగా ఉంటుంది. పురుషుల్లో కండరాలు పెద్దగా ఉండటం వలన వారు వ్యాయామం చేయకపోయినా కండరాలు యథాస్థితిగా ఉండటానికి క్యాలరీలు అవసరం అవుతాయి. అందుకే పురుషులకు మహిళలకంటే ఎక్కువ క్యాలరీలున్న ఆహారం అవసరముంటుంది.