సాధారణంగా మన గుండె మామూలుగా నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి. అలా కాకుండా 60 కన్నా తగ్గినా లేదా 100 కన్నా పెరిగినా ఆ కండిషన్ను అరిథ్మియా అంటారు. కానీ ఎవరైనా తీవ్ర భయాందోళనలకు గురైనప్పుడు, వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం 100 నుంచి 160 మధ్యన ఉంటుంది. దీన్ని సైనస్ టాకికార్డియా అంటారు. ఇలా కాకుండానే గుండె వేగం దానంతట అదే ఇంకా పెరిగితే అది జబ్బువల్ల కావచ్చు. కార్డియాక్ అరిథ్మియా గురించి మరిన్ని వివరాలు…
ఒక్కోసారి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒక్కోసారి గుండె రిథం దెబ్బతింటుంది. కానీ, తరచుగా వీటిని గురించి చాలా మంది పట్టించుకోరు. ఇది ఎక్కువగా ఒత్తిడి, ఆందోళన, అధిక వ్యాయామం, ఎక్కువ కెఫిన్ లేదా ఆల్కహాల్ తీసుకోవడం వంటి వాటి వలన జరుగుతుంది. కానీ, గుండె విద్యుత్ వ్యవస్థలో మార్పుల వల్ల కలిగే అసాధారణ గుండె కొట్టుకోవడం వల్ల కూడా ఈ పరిస్థితి రావచ్చు. ఈ కారణంగా, వేగవంతమైన లేదా నెమ్మదిగా హృదయ స్పందన రేటు ఉండవచ్చు. అసాధారణ హృదయ స్పందనను అరిథ్మియా అంటారు. గుండె విద్యుత్ వ్యవస్థలో ఇటువంటి మార్పుల కారణంగా, అసాధారణ హృదయ స్పందన లేదా లయను అరిథ్మియా అంటారు. అరిథ్మియా ప్రభావం ఒక్కోరిపై ఒక్కోరకంగా ఉంటుంది. ఇది కొంతమంది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదు, కానీ కొంతమందికి ఇది ప్రాణాంతకమవుతుంది. అరిథ్మియా ప్రధానంగా రెండు రకాలు.. మెుదటిది టాచీకార్డియా .. గుండె చాలా వేగంగా కొట్టుకున్నప్పుడు, అంటే నిమిషానికి 100 కంటే ఎక్కువ బీట్స్, టాచీకార్డియా సంభవిస్తుంది. కొంతమందిలో, టాచీకార్డియాకు సులభంగా చికిత్స చేయవచ్చు, కానీ మరికొందరిలో ఇది ప్రాణాంతకం కావచ్చు. ఇది సాధారణ శారీరక శ్రమ ద్వారా కూడా ప్రేరేపించబడుతుంది, ఇది వైద్య సమస్యలను సూచిస్తుంది. ఇక రెండవది.. బ్రాడీకార్డియా. గుండె చాలా నెమ్మదిగా కొట్టుకున్నప్పుడు బ్రాడీకార్డియా సంభవిస్తుంది, నిమిషానికి 60 బీట్ల కన్నా తక్కువ. ఈ పరిస్థితి చాలా తీవ్రమైనది ఎందుకంటే దీనిలో గుండె మొత్తం శరీరానికి తగినంత ఆక్సిజనేటెడ్ రక్తాన్ని పంప్ చేయలేకపోతుంది. అయినప్పటికీ, సమస్య తీవ్రంగా లేకపోతే, ఒత్తిడి లేదా ఆందోళనను తగ్గించడానికి ధ్యానం, యోగా వంటి కొన్ని జీవనశైలి మార్పులు అవసరం అవుతాయి.
గుండె కొట్టుకోవటంలో మార్పు రావటానికి ముందు అది ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు. మామూలు వైద్య పరీక్షలు చేస్తున్నప్పుడుగాని, ఇతర సమస్యలకోసం పరీక్షిస్తున్నప్పుడు గాని బైటపడవచ్చు. సాధారణంగా కనబడే లక్షణాలలో గుండె చాలా వేగంగా కొట్టుకోవటం, ఛాతీనొప్పి, ఒక్కోసారి గుండె చాలా నెమ్మదిగా కొట్టుకోవటం, చెమటపట్టటం, స్పృహ తప్పినంత పనికావటం, తలతిరుగుతున్నట్టు అనిపించటం లాంటివి ఉంటాయి. మన గుండె మామూలు లయ ప్రకారం కాకుండా కొట్టుకుంటుందని అనిపిస్తే మాత్రం తప్పకుండా ఇదొక సమస్య అని అనుమానానించాల్సిందే. వేగంగా నడవటం, పరుగెత్తటం, ఏదైనా కంగారు పడే వార్త వినటం లాంటి సందర్భాలలో గుండె వేగంగా కొట్టుకోవటం మామూలే. కానీ అకారణంగా వేగంగా కొట్టుకున్నా, బాగా నిదానించినా డాక్టర్ కు చూపించుకోవటం ఉత్తమం. రక్తాన్ని పంప్ చేయగుండానే అలా కొట్టుకోవటం వలన గుండె బలహీనపడి దెబ్బతింటుంది. ఒక్కోసారి ఈ సమస్యతో మనిషి క్షణాల్లోనే కుప్పకూలిపోయే ప్రమాదముంది. ఈ సమస్యకి కారణాలు రకరకాలుగా ఉంటాయి. గుండెపోటు, అధిక రక్తపోటు, పొగతాగటం, ఎక్కువగా ఆల్కహాల్ సేవించటం, మాదక ద్రవ్యాల వాడకం, వత్తిడి, మధుమేహం. జన్యుపరమైన కారణాలు, నిద్రసంబంధమైన సమస్యలు కారణం కావచ్చు.
లక్షణాలను పరిశీలించి గత వైద్య చరిత్రను సమీక్షించి డాక్టర్లు కార్డియాక్ అరిథ్మియా లేదా గుండె లయబద్ధత లోపం అనే ఈ సమస్యను నిర్ధారించగలుగుతారు. ఇతరత్రా గుండె సమస్యలు గాని, థైరాయిడ్ గ్రంధి సమస్యలుగాని ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటారు. ఇసిజి తీయటం క్రమబద్ధమైన వేగం ఉన్నదీ లేనిదీ గుర్తిస్తారు. అయితే, ఎక్కువ సేపు ఆ పరిస్థితిని ద్వారా సమీక్షించాలనుకున్నప్పుడు మాత్రం హోల్టర్ మానిటర్ అని పిలిచే పోర్టబుల్ ఇసిజి పరికరాన్ని అమర్చుతారు. మనం రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉన్నా, అది తనపని తాను చేసుకుంటూ పోతుంది. ఇదే పరికరాన్ని మనకు లక్షణాలు కనబడినప్పుడు మాత్రమే ఆన్ చేసి కూడా ఫలితాలు రాబట్టవచ్చు. దీన్ని వైద్య పరిభాషలో ఈవెంట్ మానిటర్ అంటారు. ఎకోకార్డియోగ్రామ్ ద్వారా శబ్దతరంగాలతో గుండె పరిమాణం, ఆకృతి, కదలికలు తెలుసుకుంటారు. ఛాతీ ప్రాంతంలో చర్మం కింద అమర్చే లూప్ రికార్డర్ ద్వారా అసాధారణమైన గుండె శబ్దాలను నమోదు చేసే అవకాశముంటుంది. ఒత్తిడిని పరీక్షించటానికి ట్రెడ్ మిల్ పరీక్ష కూడా చేయవచ్చు. ఇన్ని రకాల పరీక్షల సాయంతో గుండె కొట్టుకోవటంలో విపరీతమైన తేడాలకు కారణాలను నిర్ధారిస్తారు. ఆ విధంగా అది కార్డియాక్ అరిథ్మియా సమస్య అవునా, కాదా అనేది తేలిపోతుంది. ఇతర వైద్య పరమైన సమస్యలేవీ కారణం కాదనుకున్నప్పుడు అరిథ్మియాస్ కు చికిత్స చేస్తారు. గుండె వేగం తగ్గి ఉంటే పేస్ మేకర్ సాయంతో వేగం పెంచుతారు. కాలర్ బోన్ సమీపంలో దీన్ని అమర్చుతారు. ఇది తప్ప దీనికి ఎలాంటి మందులూ లేవు. ఒకవేళ గుండె అతి వేగంగా కొట్టుకుంటూ ఉంటే కొన్ని మందుల ద్వారా నియంత్రించటానికి ప్రయత్నిస్తారు. అయితే, ఈ మందులు కచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలో, సూచించిన డోస్ మేరకే వాడాలి. రక్తాన్ని పలుచబరచే మందులవలన కూడా ఆశించిన ఫలితం ఉంటుంది. పేస్ మేకర్, ఐసిడి వంటి పరికరాలతో కూడా ఫలితం రాబట్టలేని స్థితిలో సర్జరీ అనివార్యమవుతుంది.