Belly Fat Effects On Health : పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలంటే ఏంచేయాలి

By manavaradhi.com

Published on:

Follow Us
Belly Fat Effects On Health

ఒకప్పుడు ఐదు పదులు దాటాల వచ్చే కొవ్వు సమస్యలు… ఇప్పుడు మూడు పదుల వయసుకే ముప్పిరిగొంటున్నాయి. అందంతో పాటు ఆరోగ్యానికి అనేక సవాళ్ళు విసురుతున్న ఈ సమస్యను చిన్న పాటి జాగ్రత్తలతో రాకుండా చూసుకోవచ్చు అంటున్నారు వైద్యులు.

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఇతర భాగాలతో పాటు పొట్ట కూడా పెరుగుతూ ఉంటుంది. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల తెలియకుండానే క్రమంగా పొట్ట పెరుగుతూ ఉంటుంది. పురుషుల కంటే స్త్రీల విషయంలో ఇది మరింత ఇబ్బందిగా మారుతుంది. పెరిగే పొట్ట వల్ల ఆరోగ్యంతో పాటు, అందం కూడా చెడిపోతుంది. ఫలితంగా ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. దీని వల్ల మానసికంగానూ కుంగిపోతారు. అంతే కాదు గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా పొట్ట మీద పేరుకునే కొవ్వు కారణం అవుతుంది. జీవక్రియలు అస్తవ్యస్తంగా మారడం, పిత్తాశయ సమస్యలు, అధిక రక్తపోటు లాంటివి ఎదురౌతాయి.

పొట్టవద్ద పేరుకునే కొవ్వు కణాలు ఇన్సులిన్ నిరోధకతను ప్రేరేపించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఫలితంగా పొట్ట వల్ల మధుమేహం దాడి పొంచి ఉంటుంది. మరికొన్ని కణాలు మోనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ ను ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల రొమ్మ క్యాన్సర్ రావచ్చు. నిజానికి వయసు పెరిగే కొలదీ జీవక్రియలు మందగిస్తూ ఉంటాయి. దీని వల్ల శరీరంలో కొవ్వు మోతాదు నెమ్మదిగా పెరుగతూ వస్తుంది. 40 ఏళ్ళు దాటిన స్త్రీలలో ఇది మరింత ఎక్కువ. రుతుక్రమం ఆగిన స్త్రీలలో జరిగే హార్మోన్ల మార్పులు కూడా పొట్ట పెరగడానికి దోహదం చేస్తాయి. కొంత మందిలో బరువు పెరగకపోయినా, పొట్ట మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఇది మరింత ప్రమాదకరమని గుర్తించాలి. వెంటనే సరైన చర్యలు చేపడితే ప్రయోజనం ఉంటుంది.

శరీరంలోని అన్ని భాగాల్లోనూ కొవ్వు పేరుకుపోతుంటుంది. ముఖ్యంగా బాడీలో పేరుకుపోయే కొవ్వులో రెండు రకాలు ఉంటాయి. అందులో విసెరల్ కొవ్వు అత్యంత ప్రమాదకరమైనది. ఈ రకం ఫ్యాట్ పొత్తికడుపు పైన.. చుట్టూ పేరుకుపోతుంది. ఇది శరీరం లోపల పెరుగుతుంది కాబట్టి దీన్ని గుర్తించడం అసాధ్యం. పొత్తికడుపు చుట్టూ పెరుగుతూ పోయే ఈ విసెరల్ ఫ్యాట్‌ మొదట్లో కనిపించదు. అయితే కొంత కాలం తర్వాత పొట్ట బాగా ముందుకు పొడుచుకొచ్చాక దీని గురించి అవగతమవుతుంది.

పొట్టలోని విసెరల్ ఫ్యాట్ శరీరంలోని సర్వ రోగాలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమవుతుందని పరిశోధనలు తేల్చాయి. ఇది విచ్ఛిన్నమైనప్పుడు, విసెరల్ కొవ్వు కొన్నిసార్లు రక్తంలోకి చాలా కొవ్వు ఆమ్లాలను ఉంచుతుంది, ఇది గుండె జబ్బులు, అల్జీమర్స్ మరియు అధిక కొలెస్ట్రాల్ అవకాశాలను పెంచుతుంది. ఇది శరీరాన్ని ఇన్సులిన్‌కు మరింత నిరోధకతను కలిగిస్తుంది, ఇది టైప్ 2 డయాబెటిస్ లేదా ప్రీ-డయాబెటిస్‌కు దారితీయవచ్చు. అదనంగా, విసెరల్ కొవ్వు నుండి ప్రోటీన్లు శరీర కణజాలాలను మరియు ఇరుకైన రక్త నాళాలను మంటను కలిగిస్తాయి, ఇది రక్తపోటును పెంచుతుంది.

వయసుతో పాటు పొట్టపెరగడానికి కారణం మనం తినే ఆహారము, జీవనశైలి ప్రధానకారణం. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం, వ్యాయామం చేయకపోవడం లాంటివి దీనికి కారణం అవుతాయి. సాధారణంగా ఎత్తు బరువుల నిష్పత్తిని బట్టి బరువు గుర్తించవచ్చు. కానీ నడుం చుట్టుకొతల ద్వారా మాత్రమే పొట్ట పెరుగుదలను గుర్తించగలం. 35 అంగుళాలు దాటిందంటే ప్రమాదకర స్థితికి దగ్గరయ్యామనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కొన్ని రకాల వ్యాయామాలతో పాటు ఆహారంలో మార్పులతో పొట్టను తగ్గించుకోవచ్చు. ఆహారం కంటే కూడా పొట్ట తగ్గేందుకు వ్యాయామమే అత్యుత్తమ మార్గం.

వ్యాయామం వల్ల బరువు, పొట్ట రెండూ తగ్గుతూ వస్తాయి. ముఖ్యంగా బరువులు ఎత్తే వ్యాయామాలు పొట్టకు ఉపయోగపడతాయి. ఎంతసేపు ఏయే వ్యాయామాలు చేయాలన్నది వారి శరీర స్థితిని బట్టి, వారి వృత్తులను బట్టి నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. పొట్ట చుట్టూ కొవ్వును అదుపులో పెట్టేందుకు ప్రత్యేకమైన శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు ఉంటాయి. నిపుణుల పర్యవేక్షణలో వీటిని చేయాలి. రోజూ చేసే వ్యాయామంతో పాటు కనీసం రోజుకు 3 కిలోమీటర్ల నడక మంచి వ్యాయామం. దీంతో పాటు ఎత్తు పల్లాల్లో పరుగుల వల్ల కొవ్వు బాగా తగ్గుతుంది. పొట్ట రాకుండా ఉంటుంది. అన్నింటి కంటే ముఖ్యంగా తగినంత నిద్ర, విశ్రాంతి వల్ల శరీర ఆకృతి అదుపులో ఉంటుంది. ప్రారంభంలోనే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

Leave a Comment