ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని భయపెడుతున్న రోగం క్యాన్సర్ అయితే అందులోనూ మహిళల్ని ఎక్కువ కలవరాన్ని కలిగిస్తోంది రొమ్ము క్యాన్సర్. మగాడితో పోటీపడి ఉన్నత స్థానాలు అందుకుంటున్న మహిళలకు ఈ రొమ్ము క్యాన్సర్ పెనుభూతంలా మారింది. ప్రాథమిక దశలోనే నిర్ధారణ, అవగాహన పెంచుకోవడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ ను నయం చేసుకునే అవకాశం ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో సమాజంలో అవగాహన కంటే అపోహలే ఎక్కువ ఉన్నాయి. దీంతో ఈ వ్యాధి సోకిన వారు మానసిక ఆందోళనతోనే ఎక్కువ నీరసించిపోతున్నారు. మన దేశంలో ప్రతి పది మంది స్ర్తీలలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తున్నట్టు తేలింది. కానీ దీనిపై అవగాహన మాత్రం వందలో ఒకరికి కూడా ఉండటం లేదని సర్వేలు చెబుతున్నాయి.
క్యాన్సర్ ఉంది అని చెప్పగానే సగం జావగారిపోతారు. ఇక దానికయ్యే వైద్య ఖర్చులు.., ట్రీట్ మెంట్ ఇబ్బందులు తెలుసుకునే కొద్దీ మరింత నీరసపడిపోతారు. జీవితం అయిపోయిందనే భావనలోనే చాలా మంది ఉంటారు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో అవగాహన పెంచుకుంటే నిక్షేపంగా సంపూర్ణ జీవితం అనుభవించవచ్చు. పాపులర్ హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలీ కూడా రొమ్ము క్యాన్సర్ బాధితురాలే. చికిత్స తరువాత సాధారణంగానే సినిమాల్లో నటిస్తోంది. అంతే కాదు.., తన ట్రీట్ మెంట్ గురించి బహిరంగంగా చెప్పి మహిళల్లో మనోధైర్యం పెంచే ప్రయత్నం కూడా చేసింది ఎంజెలీనా.
క్యాన్సర్ కణాలు పుట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తికి క్యాన్సర్ రావడానికి ఇదీ ఫలానా కారణం అని ఇతిమిద్ధంగా చెప్పడం సాధ్యం కాదు. బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలోనూ ఇంతే. శరీరంలో ఏ భాగంలో అయినా కణజాలం అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతూ ఉంటే దానిని క్యాన్సర్ అంటారు. రొమ్ము భాగంలోనూ.., స్తనం చివరన ఉండే పాల నాళాల్లోనూ ఇలా కణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతే దానిని రొమ్ము క్యాన్సర్ గా నిర్ధారిస్తారు. హార్మోన్ల సమతుల్యం దెబ్బతినడం వలన రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువ. అందుకే దీనిని వంశపారంపర్య జబ్బు అని కూడా చెప్పలేరు. రొమ్ము క్యాన్సర్ సోకిన వారిలో పది నుంచి పదిహేను శాతం మాత్రం జన్యుపరమైన కారణాలు ఉంటే.., 85శాతం మందికి కుటుంబ వారసత్వంతో సంబంధం లేకుండా ఈ వ్యాధి సోకుతోంది.
ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో యాభై సంవత్సరాలు దాటిన తరువాత ఈ బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ మన దేశంలో మాత్రం నలభై ఏళ్ళకే రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా సంపన్న వర్గాలకు చెందిన స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తేలింది.
రొమ్ము క్యాన్సర్ నివారించలేనిదేమీ కాదు. అయితే ఈ వ్యాధి లక్షణాలను వీలైనంత త్వరగా పసిగట్టడమే ముఖ్యమైన అంశం. తొలి దశలోనే బ్రెస్ట్ క్యాన్సర్ ని గుర్తిస్తే నయం చేయవచ్చు. ఈ వ్యాధి సోకిన వారిలో ప్రధానంగా కనిపించే లక్షణం రొమ్ము, చంకల్లో గడ్డలు తగలడం. ముఖ్యంగా వయసు మీరిన మహిళల్లో రొమ్ముల్లో గడ్డలు తగులుతున్నట్టు అనిపిస్తే జాగ్రత్త పడాలి. రొమ్ములు పెద్దవిగా ఉండటం లేదా కుచించుకుపోవడం, స్తనం ఆకారం మారడం, చను మొనలు నుంచి ద్రవాలు స్రవించడం, చర్మం ఎర్రబారడం, పుండు పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇవన్నీ ప్రాథమిక దశలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి యాభై సంవత్సరాలు దాటిన మహిళలు ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేసుకోవాలి. అంటే అద్దం ముందు నిలబడి తమకు తాముగా రొమ్ముల్లో గడ్డలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని పరీక్షించుకోవాలి.
ధూమపానం, ఆల్కహాల్ అలవాటు ఉన్నవారిలోనూ.., లేటు వయసులో సంతానం కలగడం, ఊబకాయం, చిన్న వయసులో రజస్వల అయినవారిలో, మోనోపాజ్ లేటుగా వచ్చిన వారిలో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయి. సంతానం అస్సలు లేకపోయినా.., పిల్లలకు తల్లి పాలు పట్టని మహిళలల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ కారణాలు, లక్షణాలు లేనంత మాత్రాన రొమ్ము క్యాన్సర్ బారిన పడరు అని చెప్పడానికి లేదు. స్క్రీనింగ్ పరీక్ష గురించి అవగాహన పెంచుకోవడం ద్వారానే మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ ను తొలి దశలో గుర్తించవచ్చు.
బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా మహిళలకే సోకుతుంది తప్ప పురుషులకు రాదు అని చెప్పలేం. అరుదుగా పురుషుల్లోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. అవగాహన పెంచుకోవడం, హార్మోన్ల సమతుల్యత లోపించకుండా చూసుకోవడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ కు దూరంగా ఉండవచ్చు. కుటుంబంలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా.., తమకే ఇతర శరీరావయవాలకు క్యాన్సర్ సోకినా కూడా ఈ వ్యాధి రావచ్చు. కాబట్టి అలాంటివారు మరింత అప్రమత్తంగా ఉండాలి. తొలి దశలోనే వైద్యుల్ని సంప్రదించడం ద్వారా వివిధ రకాల చికిత్స మార్గాలను సూచిస్తారు.
చికిత్స అనంతరం తాజా పదార్ధాలనే ఆహారంగా తీసుకోవాలి. అతిగా ఉడికించినవి.., అసలు ఉడికించనవి కూడా తినకూడదు. మసాలా పదార్ధాలను పూర్తిగా మానేయడం మంచిది. పంచదార, మైదా, ఉప్పు వాడకాన్ని వీలయినంత తగ్గించాలి. అప్పుడే క్యాన్సర్ కణాలు అదుపులో ఉంటాయి. నలభై ఏళ్ళ వయసు దాటిన మహిళలు ఏడాదిన్నర.. రెండేళ్ళకోసారయినా వైద్యుల్ని సంప్రదించడం, ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ పరీక్ష చేసుకోవడం ముఖ్యం. రొమ్ములో గడ్డలు ఉన్నాయని గుర్తిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. సాధారణ గడ్డలయితే వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ క్యాన్సర్ కణాలు అయితే తొలి దశలోనే గుర్తించాలి. వ్యాధి ముదిరే కొద్దీ చికిత్స ఖర్చుతోనూ, బాధతోనూ కూడిన వ్యవహారం. కాబట్టి రొమ్ము క్యాన్సర్ కు అవగాహనే పరిష్కారం అని నిపుణులు సూచిస్తున్నారు.
పింక్ రిబ్బన్ అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతోంది. ఈ పింక్ రిబ్బన్ ఉద్ధేశం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంచడమే. తొలి దశలో స్క్రీనింగ్ పరీక్ష ద్వారా రొమ్ము క్యాన్సర్ గుర్తిస్తే జబ్బు నుంచి విముక్తి పొందవచ్చు. ఈ అంశంతోనే అక్టోబర్ నెలను ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ మంథ్ గా గుర్తిస్తున్నారు. అంతర్జాతీయంగానూ, మన దేశంలోనూ అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి.