మనిషి జీవించేందుకు అవసరమైన శ్వాసకు ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేవు. అందుకని స్వేచ్ఛగా, సంతోషంగా జీవంచేందుకు ప్రతీ ఒక్కరూ శ్వాస పట్ల జాగ్రత్తగా ఉండాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎందుకు వస్తుంది..? అలాంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..!
ఊపిరి తీసుకోవడం అంత ముఖ్యమైన ప్రక్రియ. దీన్ని నిర్వహించే శ్వాస వ్యవస్థకు శరీరంలో అత్యంత కీలకమైన స్థానం ఉంది. మానవ మనుగడకు అత్యంత అవసరమైన శ్వాస తీసుకోవడం నిమిషంపాటు నిలిచిపోయినా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. ఇంజిన్‌కు పెట్రోల్ మాదిరిగా మన శరీరాలకు ఆక్సిజన్ కూడా అంతే ముఖ్యమైనది. ఊపిరితిత్తుల్లో సమస్య ఎదురైతే దానికి చికిత్స అందించడం కూడా ఇటీవలి కాలం వరకు క్లిష్టమైన విషయంగాన ఉండేది. అయితే వైద్యరంగంలో వస్తున్న నూతన పరిశోధనలు, ఆధునిక ప్రక్రియలు శ్వాసకోశాలకు, శ్వాస వ్యవస్థకు చికిత్సలను సులభతరం చేశాయి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కేవలం శ్వాసకోశ సమస్యలుగానే భావించవద్దు. శరీరంలో ఇతరత్రా అవయవాలు, వ్యవస్థల్లో మార్పుల కారణంగా కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు రక్తం ద్వారా ఆక్సీజన్ అందుతుంది. ఈ ప్రక్రియ సాఫీగా జరుగాలంటే ఐరన్ పాత్ర ఎంతో ముఖ్యమైంది. కొన్నిసార్లు సరైన ఆహారాలు తీసుకోకపోవడం వల్ల రక్తం సరఫరా సాఫీగా జరుగక కావాల్సన ఐరన్ అందక అనీమియాకు గురవుతారు.
ఇలాంటి సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. దాంతోపాటు ఛాతీలో నొప్పి, బలహీనంగా మారడం, త్వరగా అలసిపోతుంటారు. ఇలాంటి వారికి విటమిన్ సీ, ఐరన్ ఎక్కువగా లభించే డెయిరీ ఉత్పత్తులు, ముదురు ఆకుపచ్చ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా ఆందోళనకు గురైన సందర్భాల్లో కూడా శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. ఫలితంగా సాధారణంగా కన్నా ఎక్కువ మోతాదులో శ్వాస తీసుకొంటారు. దీంతో చెమట పట్టిపోవడం, ఛాతీలో నొప్పి రావడం, మూర్చపోయినట్లుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితిలో అలజడికి గురికాకుండా చూసుకోవాలి. ప్రశాంతంగా ఉంటూ కొద్దిసేపు కదలకుండా కూర్చోవాలి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కొన్ని రకాల అలర్జీల ద్వారా కూడా కలుగుతుంటాయి. ముఖ్యంగా పొప్పడి రేణువులు ముక్కును తాకినప్పుడు కొంత అసౌకర్యంగా అనిపిస్తుంది. కండ్లలో మంట ప్రారంభమై శ్వాసవ్యవస్థను చికాకుపరుస్తుంది. ఇలాంటి సందర్బాల్లో తుమ్ములు రావడం, ముక్కు కారడంతోపాటు ఛాతీలో బిగుతుగా అనిపించడం వంటి లక్షణాలు కొన్ని నిమిషాల నుంచి కొన్ని రోజుల పాటు కొనసాగుతాయి. ఇలాంటిసందర్భాల్లో ముక్కును గుడ్డతో రక్షించుకోవాలి. అదేవిధంగా పీల్చుకొనే గాలి ద్వారా సూక్ష్మక్రిములు ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి ఇన్‌ఫెక్షన్ కలుగజేస్తాయి. వీటి కారణంగా కూడా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. న్యుమోనియా వచ్చినప్పుడు కూడా శ్వాస సమస్యలు కనిపిస్తాయి.
కలుషితమైన ఆహారం, నీరుతాగినప్పుడు, అలాంటి ప్రదేశాల్లో నడిచినప్పుడు హుక్ వార్మ్స్ మన జీర్ణాశయంలో పెరుగుతూ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి సందర్భాల్లో కడుపులో నొప్పి, విరేచనాలు, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉననవారిలో, అలాగే కొన్ని రకాల క్యాన్సర్లు మనపై దండెత్తిన సందర్భాల్లో కూడా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది.
మనం బ్రతుకడానికి అవసరమైన శ్వాస తీసుకోవడంలో ఏమాత్రం ఇబ్బంది తలెత్తినా వెంటనే వైద్యులను సంప్రదించి తగు చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. చిన్న సమస్యే అయినా పెద్ద తలనొప్పులకు దారితీయకముందే పరిష్కారం వెతకడం ఎంతో ఉత్తమం.








