వయసుపైబడుతున్నకొద్దీ చాలామందికి మతిమరుపు రావడం సహజమే. ఐతే ఈ మతిమరుపుతోపాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతూనే ఉంటాయి. అందువల్ల మతిమరుపు సమస్యతో ఇబ్బందిపడుతున్నవారు జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు మెదడుకు పదును పెట్టే అంశాలపై దృష్టి పెడితే జీవితం మరికొంత కాలం సాఫీగా సాగుతుంది. మరి వయసుతోపాటు వచ్చే మతిమరుపును రాకుండా ఎలా చూసుకోవచ్చు ? ఇప్పుడు మనం తెలుసుకుందాం….
వయసు పెరుగుతున్నకొద్దీ అన్ని అవయవాల పనితీరులో మార్పు వస్తుంది. ముఖ్యంగా నడి వయసు నుంచి వృద్ధాప్యంలోకి అడుగు పెట్టే వారికి ఈ సమస్య సర్వసాధారణం . శరీరంలోని అన్ని అవయవాల పనితీరులో మందగమనం మొదలవుతుంది. అలాగే మెదడు పనితీరులోనూ మందగమనం గమనించవచ్చు. ఇలా మెదడు పనితీరులో మార్పు వస్తే అలాంటి వ్యక్తులకు మతిమరుపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీన్నే వైద్య పరిభాషలో అల్జీమర్స్ లేదా డిమెన్షియాగా పిలుస్తారు . ఇది సాధారణంగా 60 నుంచి 65 ఏళ్లు పైబడిన వారిలో వస్తుంది. వృద్ధాప్యం పైబడిన వారిలోనే కాకుండా వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
డిమెన్షియాగా అనేది సాధారణ మతిమరుపు కాదు. ఈ వ్యాధికి లోనైన వారికి ఏ విషయమూ గుర్తుండదు. కొద్ది రోజులు, కొద్ది గంటల క్రితం చేసిన పనులను కూడా మర్చిపోతుంటారు. మరికొందరైతే తాము రోజువారీ సాధారణ పనులు చేసుకోవడంపైన కూడా ధ్యాస ఉండదు. తమ ఆహారం తామే తినడం, బట్టలు వేసుకోవడం కూడా మర్చిపోతుంటారు. డిమెన్షియా ఉన్నవారు ఎప్పటికీ ఏదో పోగొట్టుకున్న వారిలా కనిపిస్తారు. డిప్రెషన్ కు లోనై ఉన్నట్లుగా ఉంటారు. చాలా మంది తమ ఆప్తులను కూడా మర్చిపోతూ ఉంటారు. డిమెన్షియా వ్యాధి ఉన్న వారు ఎక్కువ సేపు నడవలేరు. మూత్ర విసర్జనకు వెళ్లాల్సిన దాని గురించి కూడా వారికి జ్ఞాపకం ఉండదంటే .. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు…
మెదడులోని టిష్యూలు విచ్ఛిన్నం కావడం వల్ల డిమెన్షియా వస్తుంది. నిజానికి మెదడులో ఉండే టిష్యూలు చాలా బలంగా ఉంటాయి. ఇది సాధారణంగా 65 ఏళ్లు పైబడిన వారిలో జరుగుతుంది. మతి మరుపు అనేది వంశపారంపర్యంగానూ వస్తుంది. దీనికి జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే రక్తపోటు , హై కొలెస్ట్రాల్ ఉన్నవారిలోనూ డిమెన్షియా వచ్చే అవకాశం చాలా ఎక్కువ. వీటితోపాటు ఏదైనా ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డా, మెదడుకు గాయమైనా, లేదా ప్రమాదానికి భయపడినవారు డిమెన్షియా వ్యాధిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
సిగరెట్, మద్యం తాగేవారిలో రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కూడా దీని బారినపడే ప్రమాదం ఉంది. వయసులో ఉండగా విపరీతమైన ఒత్తిడిలో పనిచేసేవారు వృద్ధాప్యంలో ఈ సమస్యను ఎదుర్కునే అవకాశముంది. 65 ఏళ్లు దాటిన తర్వాత మెదడులో టిష్యూలు విచ్ఛిన్నం అవడం ప్రారంభమవుతుంది. మెదడులోని కణాలు చిక్కుముడులుగా మారిపోతాయి. ఈ విధంగా నరాలు చెడిపోతే డిమెన్షియా వ్యాధి వస్తుంది. తొలి దశలోనే దీన్ని గుర్తిస్తే చికిత్స చేసుకోవడం సులభమవుతుంది. అలాగే వ్యాధి తీవ్రతరం కాకుండా కూడా ముందే జాగ్రత్తపడవచ్చు.
డయాబెటిస్ ఉన్నవారికి ఎక్కువగా డెమెన్షియా ఎందుకు వస్తుందో వైద్యులకు ఖచ్చితంగా తెలియదు. కానీ డయాబెటిస్ ఉన్నవారికి రక్త నాళాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని నెమ్మదిగా లేదా నిరోధించగలదు మరియు మెదడులోని ప్రాంతాలను దెబ్బతీస్తుంది. మధుమేహం ఉన్నవారు సైతం వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన ఆహారంతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటే మెదడు క్షీణతను తగ్గించవచ్చు. మీకు ఇతర ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ, అధిక రక్తపోటు కలిగి ఉండటం వల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంది. అధిక రక్తపోటు మెదడులోని రక్త నాళాలకు హాని కలిగించే అవకాశం ఉంది. ఇది స్ట్రోక్ వంటి చిత్తవైకల్యానికి కారణమయ్యే ఇతర పరిస్థితులకు కూడా దారితీస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. శరీరానికి తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం. కలత నిద్ర, మగతగా నిద్రించడం వంటివి కాకుండా పూర్తిస్థాయి గాఢనిద్ర ఉండాలి. మొత్తంగా రోజుకు కనీసం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు నిద్ర అవసరమని, పని మధ్యలోనూ అప్పుడప్పుడు పది పదిహేను నిమిషాలు విశ్రాంతి తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.
తగినంత నిద్ర లేకపోతే దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్ల వల్ల శరీరంలో రక్తనాళాలు దెబ్బతినడం, హానికర రసాయనాలు చేరడంతో మెదడు పనితీరు దెబ్బతింటుంది. అందువల్ల వీటికి దూరంగా ఉండాలి. కాలుష్యం కూడా మన మెదడుపై ప్రభావాన్ని చూపెడుతుంది. మనం పీల్చుకునే ఆక్సిజన్ లో ఎక్కువ శాతం మన మెదడు వినియోగించుకుంటుంది. కలుషిత గాలి పీల్చడం వల్ల మెదడు ఆక్సిజన్ సరఫరా తగ్గి, దాంతో మెదడు సామర్థ్యం తగ్గుతుంది. శారీరకంగా చురుకుగా ఉన్న వ్యక్తులు మానసికంగా పదునుగా ఉండటానికి మరియు అల్జీమర్స్ ఇతర రకాల చిత్తవైకల్యం పొందే అవకాశం తక్కువ. మీరు ఇప్పటికే ఈ పరిస్థితుల ప్రారంభ దశలను కలిగి ఉంటే, చురుకుగా ఉండటం మరింత స్పష్టంగా ఆలోచించడానికి, విషయాలను గుర్తుంచుకోవడానికి వ్యాయామం చక్కగా సహాయపడుతుంది. ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా వయసుతోపాటు వచ్చే మతిమరుపును రాకుండా జాగ్రత్తపడవచ్చు.
మెదడు ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహార నిపుణులు సూచించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అప్పుడు వయసు ప్రభావాన్ని మెదడుపై పడకుండా చేస్తాయి. అంతేకాదు ఫిజికల్ యాక్టివిటీని పెంచుకుంటే కూడా మెదడు చురుగ్గా పనిచేస్తుంది.దీని పట్ల అవగాహనతో మెదడుతో పాటు, శరీర ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం.