అంతర్గతమైన అనారోగ్యం, గాయం లేదా ఇన్ఫెక్షన్ ల వల్ల రక్త సరఫరా ఆగిపోయి మరణించిన కణజాలాన్నే గాంగ్రీన్ అటారు. దీనివల్ల చేతి వేళ్లు, కాళ్ల వేళ్లు మరియు కీళ్లు, అంతర్గత అవయవాలు మరియు కండరాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి.
మన శరీరంలో ఏ భాగంలోకి రక్తం వెళ్లదో ఆ భాగానికి ఆక్సిజన్, ఆహారం అందక దెబ్బ తింటుంది. దీన్నే గాంగ్రీన్ లేదా నెక్రొసిస్ అంటారు. ఇది సాధారణంగా శరీరం చివరిభాగాల్లో ప్రారంభమవుతుంది. దీనికి సకాలంలో సరైన చికిత్స అందకపోతే క్రమంగా గాంగ్రీన్ కణాలు పైకి పారి పై భాగాన్ని తీసివేయాల్సి వస్తుంది. ఈ స్థితి సాధారణంగా మనకి మధుమేహవ్యాధిగ్రస్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని వాస్క్యులోపతి అంటారు.
ఈ గాంగ్రీన్ నాలుగు రకాలుగా ఉన్నాయి. మొదటిది పొడి గాంగ్రీన్. ఈ గాంగ్రీన్ మధుమేహ రోగుల్లో ఎక్కువ కనిపిస్తుంది. ఇది ఎక్కువగా చేతులు, పాదాల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక రెండో రకం గాంగ్రీన్ తడి గాంగ్రీన్. ఈ గాంగ్రీన్ తేమ కణజాలం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. నోరు, పేగులు, ఊపిరితిత్తులు, గర్భాశయం, మర్మాంగాలను ప్రభావితం చేస్తుంది. తడి గాంగ్రీన్ వల్ల ఏర్పడిన ఇన్ఫెక్షన్, చాలా వేగంగా శరీరమంతా వ్యాపించవచ్చు. ప్రాణాలకే ప్రమాదకరంగా మారవచ్చు. మూడవ రకమైన గ్యాస్ గాంగ్రీన్ అన్నింటి కన్నా ప్రమాదకరమైన గాంగ్రీన్. ఇది క్లొస్ట్రీడియమ్ పెర్‌ఫ్రింజెన్స్ వల్లే ఏర్పడుతుంది. పరిస్థితి తీవ్రమయ్యే కొద్ది చర్మం బూడిద రంగులోకి మారిపోతుంది. నొక్కితే శబ్దం చేస్తుంటుంది. ఈ గ్యాస్ గాంగ్రీన్‌కి వెంటనే వైద్యం చేయించకపోతే రోగి 48 గంటల్లోగా మరణించవచ్చు. ఇక నాలుగవది పౌర్నియర్స్ గాంగ్రీన్. ఈ రకమైన గాంగ్రీన్, పురుషాంగం, మర్మావయవాల మీద ప్రభావాన్ని చూపుతుంది. స్త్రీల కంటే పురుషులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువ. దీని ఇన్ఫెక్షన్ రక్తంలో వ్యాపించి, సెప్సిస్‌కి కారణమైతే, ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థతి ఎదురుకావచ్చు.
గ్యాంగ్రీన్ వ్యాధి లక్షణాలు ఒక్కో రకంలో రకంగా ఉంటాయి.
పొడి గాంగ్రీన్ – లక్షణాలు చూసినట్లైతే …
- • పొడిబారి, పొక్కులెక్కిన లేదా నల్లబడిన చర్మం
- • చల్లగా మొద్దు బారిన చర్మం
- • ఆ ప్రాంతంలో స్పర్శ కోల్పోవడం
- • చీము, దారుణమైన వాసనతో నిండిన గాయం
తడి గాంగ్రీన్ – లక్షణాలు చూసినట్లైతే …
- • అకారణ జ్వరంరక్తపోటు పడిపోవడం
- • గాంగ్రీన్ ఏర్పడిన చోట వాపు, విపరీతమైన నొప్పి
- • దుర్వాసనతో కూడిన పొక్కులు లేదా పుళ్ళు
- • గాంగ్రీన్ ఏర్పడ్డ ప్రాంతంలో చర్మం రంగు మారిపోడం
- • చర్మాన్ని నొక్కితే శబ్దం రావడం
వైద్య చరిత్ర, లక్షణాల మీద ఆధారపడి గాంగ్రీన్ ను నిర్ధారిస్తారు. గాంగ్రీన్ ఏర్పడిన ప్రదేశం, తీవ్రతకి సంబంధించిన మరింత ఖచ్చితమైన వివరాల కోసం వైద్యులు రోగనిర్ధారణ మరియు ప్రయోగశాల పరీక్షలను నిర్వహిస్తారు. చనిపోయిన కణాలను గమనించడానికి, ప్రభావిత భాగం నుంచి కణజాల నమూనాలను సేకరిస్తారు. అలాగే అసాధారణంగా తెల్లరక్త కణాలు పెరిగిపోయాయేమో పరీక్షించేందుకు రక్త పరీక్షలు చేస్తారు. గాంగ్రీన్ ఉన్న ప్రదేశాన్ని, వ్యాప్తిని నిర్ధారించేందుకు ఎక్స్‌రేల వంటి ఇమేజింగ్ పరీక్షలు కూడా చేస్తారు. ధమనులలో రక్త ప్రసరణ లేదా అవరోధాలను కనుగొనేందుకు ఒక ప్రత్యేకమైన రంగుని ఉపయోగించి ఆర్టిరియోగ్రామ్ చేస్తారు.
గాంగ్రీన్ చికిత్సలో భాగంగా ఇన్ఫెక్షన్ మరింత వ్యాపించకుండా నివారించేందుకు ప్రభావిత భాగాలను శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చు. అలాగే ఇన్ఫెక్షన్ల చికిత్స కోసం వైద్యులు యాంటీబయాటిక్స్ సజెస్ట్ చేస్తారు. గాంగ్రీన్ తిరగబెట్టకుండా ఉండేందుకు వాస్కులర్ శస్త్రచికిత్స ద్వారా అడ్డంకులను తొలగించడం జరుగుతుంది. గాంగ్రీన్‌లు, ప్రాణాలకే ప్రమాదకరమైన పరిస్థితిగా మారడానికి ముందే, వీలైనంత తొందరగా చికిత్స అందించడం చాలా ముఖ్యం. ప్రాథమిక స్థాయిలోనే చికిత్స అందించడం వల్ల గాంగ్రీన్ వల్ల జరిగే హానిని కొంత వరకు తగ్గించుకోవచ్చు.