Hearing Loss: వినికిడి లోపాన్ని సరిదిద్దొచ్చా? తిరిగి వినికిడిని రప్పించొచ్చా?

By manavaradhi.com

Updated on:

Follow Us
Hearing Loss

మన చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, అభిప్రాయాల కలబోత, నలుగురితో సంబంధ బాంధవ్యాలు, సంగీత రసాస్వాదన.. ఇలా అన్నింటికీ వినికిడే మూలం. వినికిడి లేకపోతే జీవితమే నిశ్శబ్దంగా మారిపోతుంది. పసిపిల్లల్లో వినికిడి దెబ్బతింటే అసలు మాటలే రావు. చెవిటి, మూగవాళ్లుగానే మిగిలిపోతారు. వినికిడికి అంత ప్రాధాన్యం. కాబట్టే జీవితానికి వినికిడి… వినికిడి లోపంతో మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోకండి అని నినదిస్తోంది.

మాటలు, శబ్దాల వంటి వాటిని మనం యథాలాపంగా వింటుంటాం గానీ ఇదో అద్భుత ప్రక్రియ. ఇందుకోసం బయటి చెవి దగ్గర్నుంచి మెదడు వరకూ పెద్ద యంత్రాంగమే పని చేస్తుంటుంది. మన చెవిని మూడు భాగాలుగా విభజించుకోవచ్ఛు. బయటి చెవి. పైకి కనిపించేది ఇదే. దీని గుండానే శబ్ద తరంగాలు లోపలికి అడుగిడతాయి. మధ్య చెవి. ఇందులో శబ్ద తరంగాలకు కంపించే కర్ణభేరి, దానికి అనుసంధానంగా మూడు గొలుసు ఎముకలు మాలియస్‌, ఇంకస్‌, స్టేపిస్‌ ఉంటాయి. ఆయా శబ్దాలకు కర్ణభేరితో పాటు గొలుసు ఎముకలూ కంపిస్తాయి. లోపలి చెవి. వినికిడికి తోడ్పడే అత్యంత కీలకమైన, సున్నితమైన భాగం ఇది. గుండ్రంగా, నత్తలా కనిపించే ‘కాక్లియా’ ఉండేది ఇందులోనే. మధ్య చెవిలోని గొలుసు ఎముకల్లో ఒకటి దీనికి అనుసంధానమై ఉంటుంది. కాక్లియాలో ద్రవం, ఆ ద్రవంలో తేలియాడే సున్నితమైన, సూక్ష్మమైన వెంట్రుకల్లాంటి రోమకణాలు వినికిడిలో కీలకపాత్ర పోషిస్తాయి.

కర్ణభేరి, గొలుసు ఎముకల కదలికలతో కాక్లియాలోని ద్రవంలో సున్నితమైన అలలు లేస్తాయి. ఇవి రోమకణాలు అటూఇటూ కదిలేలా చేస్తాయి. వీటి నుంచి పుట్టుకొచ్చే విద్యుత్‌ ప్రచోదనాలు శ్రవణ నాడి ద్వారా ప్రయాణించి మెదడుకు చేరుకుంటాయి. అప్పుడు మెదడులో మాటలు, వినికిడికి సంబంధించిన భాగం శబ్దాలను విడమరచి వినపడేలా చేస్తుంది. అప్పుడే మనకు శబ్దాలను విన్న అనుభూతి కలుగుతుంది. ఈ మొత్తం యంత్రాంగంలో ఎక్కడ తేడా తలెత్తినా వినికిడి దెబ్బతినే ప్రమాదముంది.

ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 46.6 కోట్ల మంది పిల్లలు, పెద్దలు వినికిడి లోపంతో బాధపడుతున్నారు. దీంతో ఎంతోమంది శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. మంచి విషయం ఏంటంటే వినికిడి లోపాన్ని సరిదిద్దటానికి ఇప్పుడు మంచి చికిత్సలు, సాధనాలు అందుబాటులో ఉండటం. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే చాలావరకు ఇబ్బందుల పాలు కాకుండా చూసుకోవచ్ఛు అందువల్ల వినికిడి లోపం గురించి తెలుసుకొని ఉండటం, అవగాహన కలిగుండటం ప్రతి ఒక్కరి బాధ్యత.

మనం మాట్లాడేది నోటితో. వినేది చెవులతో. ఇవి రెండూ వేర్వేరుగా అనిపించినా వీటి మధ్య అవినాభావ సంబంధముంది. ముఖ్యంగా పసితనంలో వినికిడి చాలా ముఖ్యం. చెవులు వినిపిస్తేనే మాటలు వస్తాయి. దురదృష్టవశాత్తు మనదేశంలో ప్రతి వెయ్యి శిశువుల్లో 5-6 మంది వినికిడి లోపంతో పుడుతున్నారని, వీరిలో తీవ్ర వినికిడి లోపం గలవారు 1-2 మంది ఉంటున్నారని అంచనా. దీన్ని సకాలంలో గుర్తించలేకపోవటం మూలంగానే ఎంతోమంది చెవిటి-మూగ పిల్లలుగా మిగిలిపోతుండటం విషాదం.

వినికిడి లోపాన్ని ముందే గుర్తించి వినికిడి సాధనాలను, కాక్లియార్‌ ఇంప్లాంట్లను అమర్చగలిగితే వీరిని అందరి పిల్లలా ఎదిగేలా చేయొచ్ఛు చక్కటి జీవితాన్ని అందించొచ్ఛు.పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేచోట పనులు చేసేవారికీ వినికిడి దెబ్బతినొచ్ఛు 85 డెసిబెల్స్‌ కన్నా ఎక్కువ శబ్దాలు వచ్చేచోట రోజుకు 8 గంటల సేపు పనిచేసేవారికి దీని ముప్పు ఎక్కువ. సాయుధ దళాలు, గని కార్మికులు, డీజేలు, పోలీసు సిబ్బంది వంటి వారికి ఇలాంటి లోపం రావొచ్ఛు ఇది పూర్తిగా నివారించుకోదగిన సమస్య. వినికిడిలోపం ఎక్కువగా గలవారికి వినికిడి సాధనాలు వాడుకోవాల్సి ఉంటుంది.

వినికిడిలోపాన్ని చాలావరకు నివారించుకోవచ్ఛు ఇందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. రుబెల్లా, గవద బిళ్లలు, మెనింజైటిస్‌ వంటి ఇన్‌ఫెక్షన్ల నివారణకు టీకాలు ఇప్పించటం ముఖ్యం. గర్భధారణ సమయంలో, పుట్టిన తర్వాత తల్లీబిడ్డల ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి శిశువుకూ పుట్టిన వెంటనే వినికిడి పరీక్ష చేయించాలి. పనిచేసే చోట, చుట్టుపక్కల పెద్ద శబ్దాలు లేకుండా చూసుకోవాలి. పెద్ద శబ్దాలు వచ్చే చోట పనిచేసేవారు చెవులకు మఫ్స్‌ ధరించాలి. ఎక్కువసేపు పెద్ద వాల్యూమ్‌తో సంగీతం వంటివి వినొద్ధు ఇయర్‌ ఫోన్స్‌ వాడేటప్పుడు వాల్యూమ్‌ మరీ శ్రుతి మించకుండా చూసుకోవాలి.

ఏవైనా మందులు వినికిడిని దెబ్బతీసే అవకాశముంటే ఆ విషయాన్ని డాక్టర్‌ను అడిగి తెలుసుకోవాలి. వినికిడి లోపాన్ని అనుమానిస్తే తాత్సారం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. కాటన్‌ బడ్స్‌, పిన్నులు, క్లిప్పులు, టూత్‌పిక్స్‌ వంటివి చెవిలో పెట్టటం చేయకూడదు. చెవిలోంచి చీము, నీరు వంటివి వస్తుంటే నిర్లక్ష్యం చేయొద్దు. చెవిలో నూనె వంటివేమీ పోయొద్దు.

ఇయర్‌ఫోన్‌లనుంచి వచ్చే శబ్దతరంగాల తీవ్రత వల్ల వినికిడి సామర్ధ్యం దెబ్బతినే ప్రమాదపు అంచుల్లో ఉండటం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. సమీప భవిష్యత్తులో వినికిడి లోపం సమస్య అధికంగా ఉంటుంది. ముఖ్యంగా యువతలో ఈ సమస్య కనిపిస్తోంది. ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకోవడంతో ధ్వని కాలుష్యం నేరుగా చెవిలోకి చేరుతుంది. ముందుగా మేల్కొనకుంటే నష్టమే.. అని గుర్తుంచుకోవాలి.

Leave a Comment