ప్రస్తుతం మనలో చాలా మంది ఉద్యోగ అవసరాలు కావచ్చు, ఫ్యాషన్ కోసం కావచ్చు బూట్లు వేసుకోకుండా బయటకు వచ్చే వారికి సంఖ్య తక్కువే. అయితే కంటికి నచ్చేవి కొని వేసుకుంటున్నారే తప్ప, అవి ఎంత వరకూ సౌకర్యంగా ఉంటాయో తెలుసుకోలేక అనేక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి బూట్లను వేసుకోకూడదు, పాదాలకు సౌకర్యవంతంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా.

మన పాదాలు శరీర బరువును మోస్తాయి. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాయి. మనం నడక నేర్చినప్పటి నుంచీ నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి. అయినా ఇతర అవయవాల మాదిరిగా పాదాల ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోం. చూసీ చూడనట్టు వదిలేస్తుంటాం. ప్రతి వ్యక్తిలోనూ 20 ఏళ్ల వయసు వచ్చే వరకూ పాదం పూర్తిగా రూపొందే ప్రక్రియ పూర్తి కాదు. కానీ మారుతున్న జీవనశైలి ప్రకారం చిన్నప్పట్నుంచే ప్రతివారి పాదాలనూ షూలతో బిగించి ఉంచడం సాధారణమైంది. బుడిబుడి అడుగులు వేసే బుడతల పాదాలను సైతం రంగురంగుల సాక్స్ లేదా షూలతో బిగిస్తుంటారు. దీనివల్ల వచ్చే చిన్న చిన్న లోపాలే పెద్దయ్యాక నడకలో నష్టం కలిగించే అవకాశం ఉంది. నలుగురిలో ప్రత్యేకంగా, స్టయిల్‌గా కనిపించడం కోసం ఎత్తు మడమల చెప్పులు వాడొచ్చు. అయితే వాటి వాడకం మితంగా ఉండాలి. లేదంటే రకరకాల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే. దుస్తులకు తగ్గట్టు రకరకా షులను యువతులు ఎంచుకుంటూ ఉంటారు. అయితే వాటిని వేసుకుని కొద్ది దూరం నడిస్తే చాలు… కాలి వేళ్లు, పాదాలు, పిక్కల నొప్పులు మొదలుపెడతాయి.
సరైన బూట్లు వాడకపోతే ఎదురైయే సమస్యలు ఏంటి…?
వ్యాయామం అనగానే అందుకు తగ్గ ప్రత్యేక దుస్తులపై ఉన్న శ్రద్ధమనకు షూలపై ఉండట్లేదు. నిజానికి ఈ పాదరక్షల విషయంలో ఏవైనా తేడా వచ్చినా తీవ్రమైన నొప్పులు తప్పవు. అందుకే..నడకని ఓ వ్యాయామంగా చేసుకునేవాళ్లూ.. మెత్తదనానికీ ప్రాధాన్యం ఇవ్వాలి. అకస్మాత్తుగా పాదం జారినా.. పట్టుతప్పని షాక్ అబ్జర్వర్‌లాంటివి ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకమైన ‘సోల్’తో కూడిన బూట్లు మార్కెట్‌లో లభిస్తున్నాయి. మీ రోజువారీ వ్యాయామం పరుగే అయితే వాటికి అనుకూలంగా ఉండే రన్నింగ్ షూలను ఎంచుకోండి. ఇవి కూడా బాగా మెత్తగా ఉండాలి. వేగాన్నే కాదు.. కుదురునీ అందించేలా ఉండాలి. కాబట్టి ఎంచుకునేటప్పుడు షాపులోనే చిన్నపాటి జాగింగ్‌లా చేసి చూడాలి. మనం వేసుకోనే బూట్లు విషంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చదునుగా ఉండే బూట్లు వేసుకుంటే పాదాలు నేల మీద సమాంతరంగా ఆని, శరీర బరువు రెండు పాదాల మీద సమానంగా పడుతుంది. దాంతో నడుమూ, వెన్నూ నిటారుగా ఉంటాయి. శరీరాకృతీ చక్కగా ఉంటుంది. బూట్లు ఎంత అందంగా కనిపిస్తున్నా సరే.. ఏ మాత్రం బిగుతుగా పట్టేసినట్లు అనిపిస్తున్నా వేసుకోకపోవడమే మంచిది.

బూట్లు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి….?
బూట్లు ఎంపికలో కొన్న జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలి. మొదట రెండు పాదాల పొడవును కొలిచి, రెండింటికీ సౌకర్యంగా ఉండే జోడునే ఇవ్వమని చెప్పాలి. మనం తొడుక్కునే షూస్ పాదం చివరే ముగియకుండా మరో రెండు సెంటీమీటర్లు ఎక్కువగా ఉండాలా చూసుకోవాలి. పాదంలో వెడల్పులగా ఉండే భాగం ముడుచుకోకుండా, సౌకర్యంగా పరచుకునేలా షూ ఉండాలి. ఈమధ్య చాలామంది పొట్టిగా ఉండే ‘షార్ట్ సాక్స్’ తొడుగుతున్నారు. అవి కాలిని బాగా బిగుతుగా మడిచినట్లుగా చేసే టైట్ షూ అంత ప్రమాదకరం. సాక్స్ కాస్త సాగుతూ ఉండేవి అయితేనే మంచిది. సౌకర్యంగా ఉండేవి మాత్రమే ఎంచుకోవాలి.ఇలాంటివన్నీ పాదాలపై తీవ్రమైన ఒత్తిడి కలగజేస్తాయి. ఏళ్లకేళ్లుగా శ్రమిస్తుండటం వల్ల పాదాలకు రక్త సరఫరా తగ్గటం వంటి జబ్బులూ దాడిచేయొచ్చు. కాబట్టి పాదాలను ఓ కంటి కనిపెట్టటం మంచిది. పాదాల్లో తీవ్రమైన నొప్పి, మొద్దుబారటం వంటివి కనిపిస్తే తాత్సారం చేయకుండా డాక్టర్‌ను కలవాలి. పాదాల సమస్యలు కొన్నిసార్లు మధుమేహం, కీళ్లవాపు, నాడీ సమస్యల వంటి తీవ్ర జబ్బులకూ తొలి సంకేతం కావచ్చు. వీటిని ముందుగానే గుర్తిస్తే తీవ్రమైన సమస్యల బారినపడకుండా కాపాడుకోవచ్చు. కాలికి చెప్పులు, బూట్లు లేకుండా నడవకూడదు. అయితే ఈ చెప్పులు, బూట్లూ కాలికి చాలా సౌకర్యంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యం ఉన్నా ఆ పాదరక్షలు వాడకండి.