Diabetes Diet :డయాబెటిస్ డైట్ అపోహలు..!

By manavaradhi.com

Published on:

Follow Us
Diabetes Diet

డయాబెటిస్‌ అనేది క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ ఉండాల్సిన దీర్ఘకాలిక సమస్య. ఈ సమస్యతో భాధపడుతున్నవారికి తాము తీసుకోవాల్సిన డైట్ విషయంలో చాలా రకాల సందేహాలుంటాయి. ఇది చాలా చిన్న సమస్య అని దీంతో ఎలాంటి నష్టం లేదనుకుంటారు చాలామంది. కాని అది అపోహ మాత్రమే. డయాబెటిస్‌ అనేది జీవితాంతం వెన్నంటే ఉంటుంది. దీన్ని కంట్రోల్‌ లో ఉంచుకోలేకపోతే కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, కంటి చూపు కోల్పోవడం, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి.

ఈ వ్యాధిపై ప్రజల్లో మరిన్ని అపోహలున్నాయి. చక్కెర తిన్నంత మాత్రాన చక్కెర వ్యాధి వస్తుందనడం సరికాదు. అలాగే చక్కెర తినకపోతే రాదనీ చెప్పలేం. కానీ చక్కెర మోతాదుకు మించకూడదు. తీపి పదార్థాల కన్నా కొవ్వు పదార్థాలు తింటేనే డయాబెటిస్ వస్తుంది. వరి అన్నానికి బదులుగా రాగులు, జొన్నల వంటి చిరు ధాన్యాలు తీసుకోవడం వల్ల డయాబెటిస్ రాదనడంలో కొంత నిజం ఉన్నప్పటికీ తగ్గడం మాత్రం జరగదు. అయితే ఏ ప్రాంతంలో ఏ ఆహారపు అలవాటు ఉంటే అవి తీసుకోవాలి. గోధుమల్లో గ్లూటెన్ ఉంటుంది. చాలామంది డయాబెటిస్ పేషెంట్లకు ఇది పడదు. దీనివల్ల చిన్నపేగులోని కణాలు పాడైపోయి, ఆహార పదార్థాల శోషణ తగ్గిపోతుంది. అందుకే అనవసరంగా అన్నం మానేసి చపాతీకి మారడం కరెక్ట్ కాదు.

ముడిబియ్యం, పొట్టుతీయని ధాన్యాలు తీసుకోవడం వల్ల పీచు పదార్థాలు శరీరానికి ఎక్కువగా అందుతాయి. రక్తంలో గ్లూకోజ్‌ను తగ్గించడానికి ఈ పీచు పదార్థాలు ఉపయోగపడతాయి. గ్రీన్‌ లీఫీ వెజిటబుల్స్‌ తోపాటు బొప్పాయి, జామ పండు, సజ్జలు, జొన్నలు, బార్లీ, రాగులు, కొర్రలు వంటి ధాన్యాల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్‌ రోగులు నేరుగా చక్కెర, తేనె, కేకులు, పళ్ల రసాలు తీసుకోకూడదు. పండ్లరసాల రూపంలో కాకుండా నేరుగా పండ్లను తీసుకోవడం చాలా మంచిది. అలాగే మొలకెత్తిన గింజలు తీసుకోవడం వీరి ఆరోగ్యానికి మంచిది. ఈ ఆహారాలతోపాటు వ్యాయామం చేస్తూ బరువు పెరగకుండా జాగ్రత్త పడితే డయాబెటిస్‌ దుష్ప్రభావాలనుంచి దూరంగా ఉండవచ్చు.

రోజూ కనీసం ఒక గంట సేపు వ్యాయామం చేయడం, తాము తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తక్కువగా తీసుకోవడం, స్థూలకాయం లేకుండా చూసుకోవడం చేస్తుంటే చాలాకాలం పాటు డయాబెటిస్‌ దరిచేరకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ రాకుండా కాపాడుకునే అవకాశం ఇంకా ఉందని అర్థం.

మనం తినే ఆహారాన్ని మందులను నియంత్రించ గలవు అనే మరో అపోహ కూడా ఉంది. మనం తినే ఆహారాన్ని ఇన్సులిన్ మాత్రమే క్రమబద్దం చేయగలదు. అయితే ఇన్సులిన్ తీసుకున్నంత మాత్రాన ఎంత పడితే అంత ఆహారాన్ని తీసుకోవటానికి వీలులేదు. ఎక్కువ ఆహారం తీసుకొని అంతే మోతాదులో ఇన్సులిన్ తీసుకుంటే సరిపోతుందని అనుకోవడం సరికాదు. కృత్రిమ తీపి పదార్థాలు మంచివి కావు అని మరో అపోహ ఉంది. కృత్రిమ తీపి పదార్థాలు మధుమేహ వ్యాధితో భాధపడే వారికి ఎలాంటి హాని చేయవు. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవటం మంచిది కాదు.

మధుమేహం ఉన్నవారికి ప్రత్యేకమైన భోజనం అనేది కేవలం అపోహ మాత్రమే. సాధారణంగా మధు మేహం ఉన్నవారి కోసం ప్రత్యేకంగా భోజనం తయారు చేయనక్కర్లేదు. అయితే మధుమేహం ఉన్నవారు ఏవిధమైన భోజనం చేస్తున్నారనే విషయంపై కొంచం శ్రద్ధ చూపిస్తే సరిపోతుంది. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం మరియు డాక్టరుగారు రెకమెండు చేసినటువంటి మందులను తీసుకోవటం ద్వారా మీ రక్తంలోని షుగర్ శాతాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు ఇలా డైట్ పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటే అందరిలా నార్మల్ లైఫ్ ని లీడ్ చేయవచ్చు.

మీలో ఉన్న అనుమానాలు పోగొట్టుకొని డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు డయాబెటిస్ ఉన్నాకూడా అందరిలా నార్మల్ లైఫ్ ని లీడ్ చేయవచ్చు.

Leave a Comment