Cancer Signs : క్యాన్సర్ ను ముందుగా గుర్తించే లక్షణాలు ఏవి…?

By manavaradhi.com

Updated on:

Follow Us

ఈ మధ్య కాలంలో మనిషిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ ముందు వరుసలో ఉంటుంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగానే వస్తున్నాయంటున్నారు వైద్య నిపుణులు. క్యాన్సర్ అనేది శరీరంలో ఎక్కడైనా వచ్చే అసాధారణమైన కణాల అనియంత్రిత పెరుగుదల. ఈ కణాలు సాధారణ శరీర కణజాలాలను చొరబాట్లు చేయగలవు. సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించ బడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణ సమూహాలనే క్యాన్స‌ర్లుగా పిలుస్తారు.

క్యాన్సర్ వ్యక్తి చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. చర్మపై కొత్త రకమైన ఆకారం, రంగులో మచ్చలు కనిపించవచ్చు. అప్పుడు దీన్ని స్కిన్ క్యాన్సర్ గా అనుమానించాలి. ఈ సమయంలో వైద్యున్ని సంప్రదిస్తే చర్మం నుంచి ఓ ముక్క తీసి బయాప్సీ పరీక్ష చేసి అది చర్మ క్యాన్సరా? కాదా అని నిర్ధారణ చేస్తారు. మలవిసర్జనకు వెళ్ళేటప్పుడు, లేదా మూత్రం చేసేటప్పుడు కొన్నిసార్లు రక్తం పడినట్లైతే అది కోలన్ క్యాన్సర్ లక్షణంగా భావించాలి. మూత్రంలో రక్తం పడటం అనేది కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. దీన్ని అశ్రద్ధ చేస్తే అది కిడ్నీ క్యాన్సర్ లేదా బ్లాడర్ క్యాన్సర్ కు దారితీయవచ్చు. తీవ్ర‌మైన తలనొప్పి, వికారం, వాంతులు, అవయవాలలో బలహీనత బ్రెయిన్ క్యాన్సర్ గా అనుమానించాలి. అజీర్ణం అనేది రెండు మూడు రోజుల్లో తగ్గిపోకుండా చాలా రోజులపాటు ఇబ్బంది పెడితే కడుపులో క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉన్నాయి.

చర్మం కింద గడ్డల లాగా ఏదైనా తగిలితే వాటిని నిర్లక్ష్యం చేయవద్దని అంటున్నారు వైద్యులు. ఇవి ఎక్కువగా ఆడవారిలో చాతిలోను, మగవారిలో వృషణాలలోనూ వస్తుంటాయి. పుట్టు మచ్చలు లేదా పులిపిరి కాయలు పెద్దగా మారడం, వీటి పై వెంట్రుకలు మొలవటం జరిగితే.. స్కిన్ క్యాన్సర్ గా మారే అవకాశాలు ఉన్నాయి. నోటి లోపల తెల్లని మచ్చలు ఉంటే… ఇది ల్యూకోప్లాకియా లేదా ఓరల్ క్యాన్సర్ అయిఉండవచ్చు.

  • ఏ కారణం లేకుండా ఆగకుండా దగ్గు వస్తుందంటే.. అది ఊపిరితిత్తుల క్యాన్సర్ అయి ఉండచ్చు. నోటి దుర్వాసన నుంచి మొదలుకొని నోటి పూత వరకు వచ్చే ఏ సమస్యలు ప్రాణాంతకం కాదు. కానీ ఒకవేళ కొన్ని వారాల పాటు మీ నోట్లో తెల్లని లేదా ఎర్రని మచ్చలు నయం కాకుండా ఉన్నట్లైతే అది ఓరల్ క్యాన్సర్ కావచ్చు. ఈ సమస్య ఎక్కువగా పొగ తాగేవారిలో కనిపిస్తుంది. కాబట్టి ఈ లక్షణాలు కనిపించిన వెంటనే మీ సమీపంలో ఉన్న వైద్య నిపుణులను సంప్రదించాలి.
  • చిన్న చిన్న లక్షణాలు రేపు పెద్దవిగా మారి ప్రాణాపాయం తలబెట్టే ప్రమాదం ఉంది. ఇలాంటిది జరగకముందే మనం జాగ్రత్త వహిస్తే ముప్పు తప్పుతుంది.
  • దూమ‌పానం, మ‌ద్య‌పానం పూర్తిగా మానుకోవాలి. జీవ‌న‌శైలిలో మార్పులు చేసుకొని పోష‌కాహారం తీసుకోవాలి.
  • ఎలాంటి క‌ణుతులు, గ‌డ్డ‌లు క‌నిపించినా అశ్ర‌ద్ధ చేయ‌కుండా స్క్రీనింగ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ముంద‌స్తుగా గుర్తించి చికిత్స తీసుకోవ‌డం ద్వారా క్యాన్స‌ర్ల‌ను జ‌యించొచ్చు.

Leave a Comment